అర్గల:

 అర్గల: అడ్డంకి, ప్రతిబంధకము అని అర్థము

ఏ అర్గలద్వారా భావ, గ్రహఫలము నిశ్చితంగా ఫలించునో, అట్టి అర్గలను మునులు ఈవిధంగా చెప్పియున్నారు. 

ఏ గ్రహమునుండిగాని, చతుర్థ, ద్వితీయ, ఏకాదశ స్థానములందు గ్రహమున్నచో అర్గలాయోగ మగును. దానికి క్రమముగా 

1. 4 వస్థానమునకు 10, 

2. 2 వస్థానమునకు 12, 

3. 11 వస్థానమునకు 3 స్థానగతగ్రహము బాధకము, 

అనగా అర్గల ఉండగా  బాధకముకూడా ఉన్నచో అర్గలా ప్రభావం ఉండదు. 


అర్గలా ప్రతిబంధకగ్రహము అర్గలా కారకగ్రహము కన్న దుర్బలమైనా, అల్ప సంఖ్య కలదైనా, (అల్పసంఖ్య అనగా ద్విగ్రహకృతమైన అర్గలకు ఏకగ్రహకృతము ప్రతిబంధకము కాదు. అర్గళ చేసిన గ్రహసంఖ్య ఎక్కువే ప్రతిబంధకగ్రహ సంఖ్య తక్కువైనచో ప్రతిబంధకముకాదని భావము) అర్గలకు ప్రతిబంధకము చెప్పకూడదు. 

తృతీయ స్థానమున ముగ్గురు కాని, అంతకన్న ఎక్కువ గ్రహములుండి అర్గలా బాధకమైన విపరీతార్గలయగును. అనగా గ్రహ, భావమువలన కల్గిన ఫలము బాధారహిత మగును. పంచమమున గ్రహమున్న అర్గలాయోగ మగును. కాని. నవమమందున్న గ్రహము దానికి ప్రతిబంధకము. 

విపరీతముగా తిరిగెడి రాహు కేతువుల అర్గళను విపరీతముగా చెప్పుకోవలెను. అనగా రాహు కేవుతువులున్న రాశినుండి 10, 12, 3 స్థానములందున్న గ్రహములకు అర్గలాయోగమును, క్రమముగా 4, 2, 11 స్థానములందున్న గ్రహములకు ప్రతిబంధకత్వమును చెప్పవలెను. ఏకగ్రహకృతమైన అర్గళ స్వల్పము, ద్విగ్రహకృతము మధ్యమము, త్ర్యాది (మూడుగాని అంతకన్న ఎక్కువగాని) గ్రహకృత అర్గళ ఉత్తమము. 

ఇట్లు రాశివలన, గ్రహములవలన రెండు విధములైన ఆర్గళలు వచ్చినవి. బాధారహిత అర్గళ మంచిది. బాధిత అర్గళ నిష్పలమైనది. ఏ రాశికాని, గ్రహముకాని సార్గలమో దాని ఫలము దానిదశయందు తెలియదగినది.


ఆర్గలా ఫలములు: 

1. పదమందుగాని, లగ్నమునగాని, సప్తమమునగాని బాధించని అర్గలయున్న ప్రసిద్ధుడు, సద్భాగ్యశాలి యగును. 

2. ఎవనికి బాధించని అర్గలయందు క్రూరగ్రహము, లేదా సౌమ్యగ్రహముండునో, ఆ గ్రహముచే లగ్నము చూడబడినచో పై యోగము ప్రబలమైన దగును. 


ద్వాదశభావ ఆర్గలా ఫలములు: 

1. లగ్నము చూడబడినచో ప్రసిద్ధుడు, సద్భాగ్యశాలి యగును.

2. ద్వితీయ భావమందు అర్గల యున్నచో ధనాది సస్యసంపత్తి,

3. తృతీయ భావమందు అర్గల యున్నచో సోదరసౌఖ్యమును కలుగును. 

4. చతుర్థ భావమందు అర్గల యున్నచో గృహాది సౌఖ్యము ఉండును, 

5. సుత భావమందు అర్గల యున్నచో బుద్ధిమంతుడు, పుత్రసుఖము కలవాడు అగును. 

6. షష్ఠభావమందు అర్గల యున్నచో శత్రుభయముండును, 

7. సప్తమ భావమందు అర్గల యున్నచో భార్యసుఖముండును, 

8. అష్టమ భావమందు అర్గల యున్నచో బహువిధ క్లేశములుండును, 

9. నవమ భావమందు అర్గల యున్నచో భాగ్యవంతుడగును, 

10. దశమ భావమందు అర్గల యున్నచో రాజపూజ్యత, 

11. లాభ భావమందు అర్గల యున్నచో ధనాగమము, 

12. వ్యయ భావమందు అర్గల యున్నచో అధికవ్యయము అగును. 

13. శుభగ్రహార్గలచే అనేక విధములైన సుఖములును, పాపగ్రహార్గలచే అల్పసుఖమును, మిశ్రగ్రహార్గళచే మధ్యమసుఖమును చెప్పవలెను. 

14. లగ్నము, పంచమము, సార్గలమైన రాజుగాని, రాజతుల్యుడుగాని అగును.


33. కారకాధ్యాయము

రవ్యాది శనిపర్యంతమున్న సప్తగ్రహములకుగాని, రవ్యాది రాహుపర్యంతమున్న అష్టగ్రహమలకుగాని కారకత్వమును చెప్పబడుచున్నవి. 

డిగ్రీలు, భాగలలో అధికమున రెండు గ్రహములు సమముగా ఉన్న  అప్పుడు రవినుండి రాహువువరకు ఎనిమిది గ్రహములను లెక్కలోనికి తీసికొనునది. ఇట్లు ఏడుగురుగాని, ఎనమండుగురుగాని కారకులగుదురు. ఇది పెద్దలకు సమ్మతము. 

రవ్యాది గ్రహములలో ఏగ్రహము డిగ్రీలు, భాగలలో అధికభాగలుకలవాడో అతడు కారకాధిపతి, ఆత్మకారకుడు అగును..

డిగ్రీ,భాగలు ఇద్దరికి సమముగా ఉన్న  కలాసామ్యమును, కలాసామ్యమున్నచో వికలాధిక్యమును పరిగణించునది. వికలాధికుడు ఆత్మకారకుడుఅగును. 

అధికడిగ్రీ,భాగలు కలవాడు ప్రథమకారకుడు అగును., 

అల్ప డిగ్రీ,భాగలు కలవాడు అంతిమకారకుడు అగును. 

మధ్య డిగ్రీ,భాగలు కలవాడు మధ్యగ్రహము, అదే ఉపగ్రహ మనబడును. 

విపరీతగతి కలిగిన రాహువు కారక విచారమున అతని అంశలను 30నుండి తీసివేయగా మిగిలినవి భుక్తి డిగ్రీ,భాగలు అయినట్లు తెలియవలెను. ఇట్లు చేసిన భాగానుక్రమమున చివరన (క్రింది) ఉన్న  గ్రహములు చరకారకులు అనిపించుకొందురు. 

కారకులు అందరిలో  ఆత్మకారకుడు ప్రధానుడు, అతడే జాతకాధిపతి అగును. 

రాజు జనులందరికన్న అన్ని విషయములలోను అధికారి, బంధన, మోచనసమర్థుడుగా ప్రఖ్యాతుడుగదా, అదేవిధముగా  ఆత్మకారకుడని తెలియవలెను.

రాజాజ్ఞచే రాజకుమారుడు, మంత్రి ప్రభృతులు జనుల కార్యములు చేయుటలో సమర్థులైనట్లు కారక గ్రహములన్నియు ఆత్మకారకుని ఆనుకూల్యమువలన తమ తమ ఫలితముల నిత్తురు. రాజునకు విరుద్ధముగా నున్నవానికి తక్కిన మంత్రిప్రభృతులు కార్యములు చేయునట్లుగా, ఆత్మకారకుడొక్కడే ప్రతికూలుడైన పక్షమున ఎవ్వరును శుభఫలముల నియ్యరు. 

రాజు అనుకూలుడైనపుడు అమాత్యాదులు చెడు చేయుటకు సమర్థులు కానట్లు, ఆత్మకారకు డనుకూలుడైన, తక్కిన కారకగ్రహములు శుభము చేయవు.

ఆత్మాదికారకులు: 

(1) ఒకరాశిలో అందరిక కన్నా అధికభాగలు కలవాడు ఆత్మకారకుడు. 

(2) ఆత్మకారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు అమాత్యకారకుడు. 

(3) అమాత్యకారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు భ్రాతృకారకుడు.

(4) భ్రాతృకారకుని కుని కన్నా తక్కువ భాగలు కలవాడు మాతృకారకుడు.

(5) మాతృకారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు పితృకారకుడు. 

(6) పితృకారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు పుత్రకారకుడు.

(7) పుత్రకారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు  జ్ఞాతికారకుడు. 

(8) జ్ఞాతికారకుని కన్నా తక్కువ భాగలు కలవాడు కళత్రకారకుడు. 

ఈ సప్త కారకములను పూర్వము బ్రహ్మ చెప్పేను. 

కొందరు మాతృకారకునే పుత్రకారకునిగా చెప్పుదురు. రెండు గ్రహములకు భాగలు. సమముగా చెప్పినపుడు ఇద్దరు ఒకే కారకత్వము కలిగియుందురు. మొదటివానికి కారకత్వము లోపించును. ఇట్టి పరిస్థితిలో ఆ కారకత్వము నిర్ణయించదగినది.

స్థిరకారక ఫలములు: 

రవిశుక్రులలో బలవంతుడు, పితృకారకుడు,

కుజచంద్రులలో బలవంతుడు మాతృకారకుడు; 

కుజుడు సోదరి, బావమరది, సోదరుడు, మాతృకారకత్వము కలవాడు, 

బుధుడు తల్లితరుపు వారైన మేనమామ వగైరాలకు కారకుడు; 

గురువు పితామహకారకుడు: 

శుక్రునివలన ప్రభువు, 

శనివలన సుతుడు, 

కేతువువలన భార్య, తల్లిదండ్రులు, అత్తమామలు, మాతామహప్రభృతులు చూడదగినవారు.


విమర్శ: జైమినిమహర్షి ఈ విషయమునంతను సూత్రీకరించెను. అందు "ఆత్మాధికః కలాదిభిర్న భోగస్సప్తానా మష్టానాంవా'8 అధ్యా 1.1 సూ11. దీనిలో 7 లేక 8 గ్రహములో కలాదిచే అధికుడు ఆత్మకారకుడనెను. అదేవిధముగా  “తస్యానుసరణాదయాత్య: 13, తస్యభ్రాతా 14; తస్యమాతా 15; తస్యపుత్రః 16: తస్య జ్ఞాతి: 17; తస్యదారాశ్చ 18; మాత్రాసహపుత్రమేకే సమామామనన్తి 19. అని చరకారకులను చెప్పి, స్థిరకారకులను భగిన్యారతఃస్యాల: కనీయాన్ జననీచేతి 20; మాతులాదయోబంధవో మాతృసజాతీయా ఇత్యుత్తరతః 21; పితామహః పతి పుత్రావితి గురుముఖాదేవ జానీయాత్ 22; పత్నీపితరౌశ్వశురౌ మాతామహా ఇత్యంతే వాసినః 23;” అని సూత్రీకరించినాడు. ఇచ్చట “అంతే వాసినః' అన్నదానికి “తరువాతివాడు” అని అర్థము చెప్పి, శుక్రుని కారకత్వము చెప్పినారు. కాని పరాశరులు చివరివాడన్న' అర్థమున కేతువునకు చెప్పెనేమో అనిపించును. ఇట్లు జెమినీ పరాశరు లిద్దరును సమముగా చెప్పియున్నారని తెలియదగినది.


గ్రహములకు, భావములకు, కారకత్వములు:

1. సూర్యుడు, నవమము, పితృకారకము; 

2. చంద్రుడు, చతుర్థము మాతృకారకము, 

3. బుధుడు, షష్ఠము మాతుల కారకము; 

4. గురుడు పంచమము పుత్రకారకము; 

5. శుక్రుడు సప్తమము కలత్రకారకము; 

6. శని, అష్టమము పితృకారకము.   ఇది తెలిసి వివేచన చేయదగదిపగి.


యోగకారక గ్రహములు: జాతకమున స్థితివశమున యోగకారక గ్రహములు .

ఏ గ్రహము స్వ, ఉచ్చ, మిత్రక్షేత్రములై పరస్పర కేంద్రగతమగునో అది యోగకారకము. దశమంలోఉంటే మరింత యోగము. 

లగ్న, చతుర్థ; సప్తమములందు స్వక్షేత్ర, ఉచ్చస్థ గ్రహమున్న యోగము. 

ఇదేవిధంగా కేంద్రేతర రాశులందును, స్వ, ఉచ్చ, మిత్రక్షేత్రగత గ్రహములు పరస్పర కేంద్రగతములైన (ఆయా గ్రహములున్న రాశినుండి 4, 7, 10 రాశులందున్నా ) ను యోగమే. 


ఇటువంటి యోగములందు పుట్టిన జాతకుడు నీచవంశజుడైనా, రాజువలె ధనసౌఖ్యములు పొందును. 

రాజవంశజుడైన మహారాజగును. ఇట్లు కులానుసారమున ఫలితము చెప్పవలెను.


భావములనుబట్టి కారకత్వములు:

1. జన్మలగ్నము ఆత్మకారకము; 

2. ధనభావము జాయాకారకము, 

3. ఏకాదశము జ్యేష్ఠ భ్రాతృకారకము; 

4. తృతీయము కనిష్ఠ సోదరకారకము; 

5. పంచమము పుత్రకారకము; 

6. సప్తము పత్నీకారకము; పంచమముందున్న గ్రహముకూడ కారకుడే.


ద్వాదశభావ కారకులు: 

సూర్యో గురుః కుజస్సోమో గురుర్భౌమ సితశ్శనిః ।

గురుశ్చంద్రసుతో జీవో మందశ్చ భావకారకాః ।

తన్వాది భావములకు క్రమముగా 

1. రవి, 

2. గురుడు, 

3. కుజుడు, 

4. చంద్రుడు, 

5. గురుడు, 

6. కుజుడు, 

7. శుక్రుడు, 

8. శని, 

9. గురుడు. 

10. బుధుడు, 

11. గురుడు, 

12. శని కారకులు.


 భావముల శుభా శుభములు:

పునస్తన్వాదయోభావాః స్థాప్యాస్తేషాం శుభాశుభం । లాభస్తృతీయో రంధ్రశ్చ రిపుర్విత్తం వ్యయ స్తథా । జ్యోతిర్విద్బిరిమే భావా అశుభాస్సముదీరితాః ।ఏషాం యోగేన యో భావో నాశం తస్య వినిర్దిశేత్ । కేంద్రత్రికోణనామానో భావా భద్రాః ప్రకీర్తితాః । ఏతేషాం యోగమాత్రేణ హ్యశుభోఽపి శుభో భవేత్ ।

1. లగ్నాది ద్వాదశ భావములలో 11, 3, 8, 2, 12 ఇవి అశుభములు. దీనితో సంబంధమున్న భావముకూడ నాశమగును. 

2. కేంద్రములు, త్రికోణములు భావములు (1, 4, 7, 10, 05, 9) శుభములు. వీటితో సంబంధమున్న మాత్రముచేతనే అశుభము కూడా శుభమగును.


కారకాంశ ఫలము:

 కారకాంశ ఫలములు: 

బ్రహ్మగారు చెప్పినరీతిగా మేషాది నవాంశగత ఆత్మకారక గ్రహఫలమును ఋషిచే చెప్పబడుచున్నది. ఆత్మకారకుడు మేషనవాంశలో ఉన్న  జాతకుడు గృహమున ఎలుకలకు పిల్లులకు భయపడు స్వభావము కలవాడగును. పాపసంబంధమున్న విశేషముగా ఉండును. వృషభాంశయందున్న చతుష్పాత్తుల వలన సుఖము కలుగును. 

మిథునాంశమందున్న దురద మొదలైన రోగములు కలుగును. 

కర్కాటకాంశయందున్న నీటిభయ ముండును. 

సింహాంశయందున్న క్రూరమృగముల వలన భయము కలుగును. 

కన్యాంశయందునస్థౌల్యము, దురద, అగ్నిభయము కలుగును. 

తులాంశమున ఉన్న  వాణిజ్య, వృత్తి, వస్త్రములు తయారుచేయుట ఉండును. 

వృశ్చికాంశలో ఉన్న  సర్పభయము, తల్లికి స్తనవ్రణము కలుగును. 

ధనురంశయందున్న పైనుండి పడుటగాని, వాహనమునుండి పడుట గాని జరుగను. మకరాంశలోనున్న జలజంతువులయిన చేపలు, శంఖములు, ముత్యములు పగడములు, పక్షులనుండి నిస్సంశయముగా లాభము కలుగును. 

కుంభాంశయందున్న తటాకాది నిర్మాణమువలన కీర్తిమంతు డగును. 

మీనాంశ యందున్న సాయుజ్యముక్తి నందును. శుభగ్రహ దృష్టి వలన అశుభమురాదు; అదేవిధముగా  పాపగ్రహ సంబంధమున్న శుభము జరుగదు. 

ఆత్మకారకుడున్న అంశయందుగాని, లేక లగ్నాంశయందుగాని శుభగ్రహమున్నను, శుభగ్రహదృష్టి వున్నను జాతకడు రాజగును. 

కారకాంశనుండి కేంద్రకోణములందు శుభగ్రహములుండి, పాపదృష్టి లేకున్న జాతకుడు ధనికుడు, విద్వాంసుడు అగును. 

మిశ్రగ్రహములున్న ఫలితమును మిశ్రమే యని చెప్పవలెను. ఉపగ్రహము (మధ్యాంశలు కలవాడు ఆత్మకారకునికి చివరివానికి మధ్యవాడు) 

స్వ, ఉచ్చరాశులందుండి, శుభగ్రహ సంబంధమున్న పాపదృష్టి లేకున్న అంతమందు కైవల్యము మోక్షము కలుగును. 

చంద్ర, కుజ, శుక్ర, వర్గములందాత్మ కారకుడున్నవాడు పరదారరతుడగును. మరొకచోట ఉన్న, ఫలము మరొకరీతిగా ఉండును.

ఆత్మకారకుని నవాంశయందు రవియున్న జాతకుడు రాజకార్యపరుడగును. 

ఆత్మకారకుని నవాంశపై పూర్ణచంద్ర, శుక్రుల దృష్టియున్న భోగియు, విద్య కలవాడు అగును. 

ఆత్మకారకుని నవాంశయందు కుజుడు బలముకలిగిన్నచో  అగ్నిచే జీవించువాడుగాని, రసవాదిగాని అగును. 

ఆత్మకారకుని నవాంశయందు బుధుడు బలముకలిగిన్నచో  వర్తకమున నిపుణుడు, పండితుడు, శిల్పకళా ప్రవీణుడు అగును. 

ఆత్మకారకుని నవాంశయందు గురుడున్నచో వేదశాస్త్ర పండితుడు, సత్కర్మనిరతుడు అగును. ఆత్మకారకుని నవాంశయందు శుక్రుడున్న దీర్ఘజీవి, కాముకుడు, రాజకార్యములు చేయువాడు అగును. 

ఆత్మకారకుని నవాంశయందు శనియున్న విశిష్టమైన కార్యమువలన ప్రసిద్ధుడును, రాజమాన్యుడు అగును.  

ఆత్మకారకుని నవాంశయందు రాహువున్న ధనుర్ధారి, చోరుడు, లోహయంత్రాదికము చేయు వాడు, విషములిచ్చు వైద్యుడు అగును. 

ఆత్మకారకుని నవాంశయందు కేతువున్న చోరుడు, గజాది వ్యాపారము చేయువాడు అగును.


విశేషములు: 

1. ఆత్మ కారకనవాంశలో రవి రాహువులున్న సర్వభయము కలుగను. శుభగ్రహ దృష్టియున్న భయముండదు. క్రూరగ్రహ దృష్టియున్న మరణము కలుగను. 

2. శుభగ్రహ షడ్వర్గులో రవి రాహువులున్న జాతకుడు విషవైద్యుడగును. 

3. ఆత్మకారకనవాంశపై కుజ దృష్టియున్న, రవిరాహువులతో కూడిన, అన్యగ్రహదృష్టి లేనిచో జాతకుడు స్వ పరగృహములను తగులబెట్టును. 

4. ఆత్మకారకనవాంశపై బుధదృష్టియున్న నిప్పు పెట్టువాడు కాడు. పాపగ్రహ షడ్వర్గము ఆత్మకారకనవాంశపై గురు దృష్టియున్న జాతకుడు సమీప గృహములనుతగులబెట్టును. 

5. ఆత్మకారకనవాంశపై శుక్రదృష్టి యున్నచో గృహములు తగలుబడవు. 

6. ఆత్మకారక నవాంశయందు గుళికుడుండి, వానికి పూర్ణచంద్ర దృష్టియున్న జాతకుడు చోరుడగును; లేదా చోరులతని ధనమును దొంగిలింతురు. 

7. గుళికునితో కూడిన ఆత్మకారకుడిని ఏ గ్రహము చూడకున్న జాతకుడు విషము నిచ్చువాడుగాని, విషముచే చనిపోవువాడుగాని అగును.  బుధుడు చూచిన అండవృద్ధి యగును. కారకాంశ కేతుయుక్తమై పాపగ్రహ వీక్షితమైన కర్ణభేదముగాని, కర్ణరోగముకాని అగును. 

8. మరియు శుక్రుడు ఆత్మకారక నవాంశను చూచిన యజ్ఞము చేయువా డగును. 

9. బుధశనులచే చూడబడిన జాతకుడు నిర్వీర్యుడగును. 

10. బుధశుక్రులు చూచిన దాసీ పుత్రుడగును. లేదా రెండవ పెళ్ళి చేసికొన్నదాని కొడుకగును. 

11. శని చూచిన తాపసుడుగాని, సేవకుడుగాని అగును. 

12. శని మాత్రమే చూచిన సన్యాసి యగును. 

13. రవి శుక్రులు చూచిన రాజ సేవకు డగును. 

14. ఇట్లు కారకాంశ ఫలము సంగ్రహముగా చెప్పబడినది.


కారకాంశక ద్వితీయాది స్థానఫలితములు:

1. ఆత్మకారక నవాంశకు ద్వితీయమున కుజశుక్రులున్న జాతకుడు పరస్త్రీరతు డగును. ఆ కుజ శుక్రసంబంధమున్న జీవితాంతము పరస్త్రీరతుడై యుండును. 

2. ఆత్మకారక నవాంశకు ద్వితీయమున కేతువున్న పైన చెప్పిన ఫలముండదు. 

3. ఆత్మకారక నవాంశకు ద్వితీయమున గురువున్న స్త్రీరతు డగును. 

4. ఆత్మకారక నవాంశకు ద్వితీయమున రాహువున్న ద్రవ్యనాశనమును జరుగును. 


కారకాంశక కు (ఆత్మకారక నవాంశకు) తృతీయమున పాపగ్రహమున్న జాతకుడు వీర్యవంతు డగును. శుభగ్రహమున్న పిరికివాడగును. 


1. ఆత్మకారక నవాంశకు చతుర్థమున శుక్రచంద్రుల కలయికగాని, దృష్టిగాని, లేదా ఉచ్చగ్రహమున్నా, జాతకుడు మేడ కలవాడగును. 

2. ఆత్మకారక నవాంశకు చతుర్థమున గురుడున్న కర్రిల్లు 

3. ఆత్మకారక నవాంశకు చతుర్థమున శని రాహువులున్న రాతి యిల్లు; 

4. ఆత్మకారక నవాంశకు చతుర్థమున కుజ కేతువులున్న ఇటుకల ఇల్లు, 

5. ఆత్మకారక నవాంశకు చతుర్థమున రవియున్న పూరిల్లు; అని చెప్పవలెను. 

6. ఆత్మకారక నవాంశకు చతుర్థమున చంద్రుడున్న జాతకునకు అనాచ్చాదిత (పై కప్పులేని) ప్రదేశమున పత్నీ సంయోగమగును. 


కారకాంశ పంచమ స్థాన ఫలితములు: 

1. కారకాంశకు పంచమమున కుజరాహువులున్న జాతకుడు క్షయరోగపీడితు డగును. చంద్రదృష్టియున్న తప్పక జరుగును. 

2. కుజుని దృష్టియున్న పిటకాది( పొక్కులు) రోగమును, 

3. కేతుదృష్టియున్న జలోదరరోగము లేదా గ్రహణి కలుగును. 

4. రాహుగుళికలు ఆ పంచమమున ఉన్న  విషభయము చెప్పవలెను. 

5. ఆ పంచమమున బుధుడున్న విదేహుడు లేక దండిసన్న్యాసి యగును. 

6. రవి ఉన్న  ఖడ్గధారి, 

7. కుజుడున్న కుంతధారి, 

8. శనియున్న ధనుర్ధారి, 

9. రాహువున్న లోహయంత్రములు తయారుచేయువాడు అగును. 

10. కేతువున్న గడియారములు తయారు చేయువాడు, 

11. శుక్రుడున్న కావ్యకర్త, వక్త, కావ్యతత్వజ్ఞుడు అగును.


విశేషము:

1. ఆత్మకారకాంశకాని దానినుండి పంచమమునగాని చంద్ర గురులున్న జాతకుడు గ్రంథకర్త యగును. 

2. గురుడు మాత్రమేయున్న సర్వజ్ఞుడగును. 

3. కుజుడున్న తర్కశాస్త్ర వేత్తయు, 

4. బుధుడున్న మీమాంసాశాస్త్ర వేత్తయు, 

5. శనియున్న పిరికి వాడును, 

6. రవియున్న గాయకుడును, 

7. చంద్రుడున్న సాంఖ్య, సాహిత్య, యోగ, గానముల నెరిగినవాడును, 

8. రాహు కేవుతులున్న గణిత జ్ఞుడును అగును. 

9. వీటిలో గురుసంబంధమున్న సంప్రదాయముగా శాస్త్ర ము నెరిగిన వాడగును. 

10. కారకాశకు ద్వితీయమునుండియు ఈ ఫలములు వచ్చునని కొందరాచార్యు లనిరి.


కారకాంశ షష్ఠ స్థానఫలములు: 

1. కారకాంశకు షష్ఠమున పాపగ్రహమున్న జాతకుడు కర్షకుడును, శుభగ్రహమున్న ఆలస్యము చేయువాడు (బద్దకస్థుడు) అగును. 

2. తృతీయమున  ఉన్న  ఇదే ఫలము చెప్పవలెను. 


కారకాంశ సప్తమస్థాన ఫలితములు: 

1. కారకాంశమునకు సప్తమమున చంద్ర గురులున్న భార్య అందమైనది, ఉత్తమురాలు అగును. శుక్రుడున్న కామాతురయు, 

2. బుధుడున్న విద్యావతియు, 

3. రవియున్న తన కులమున రక్షింపబడినదియు, 

4. శనియున్న వయసున పెద్దదియు, తాపసి, రోగిణియు, 

5. రాహువున్న విధవయు అగును.


కారకాంశ అష్టమస్థాన ఫలితములు:

1. కారకాంశకు అష్టమమున శుభగ్రహముకాని, ఆ రాశ్యధిపతిగాని యున్న జాతకుడు దీర్ఘాయుష్మంతు డగును. 

2. పాపగ్రహ సంబంధమున్న అల్పాయువున్ను, 

3. శుభాశుభగ్రహములు మిశ్రమముగానున్న మధ్యాయువును కలుగును.


కారకాంశ నవమస్థాన ఫలితములు:

1. కారకాంశకు నవమమున శుభగ్రహ సంబంధమున్న జాతకుడు సత్యవాది, గురుభక్తుడు, స్వధర్మాసక్తుడు అగును. పాపగ్రహ సంబంధమున్న బాల్యమున స్వధర్మ నిరతుడును, తరువాత అసత్యవాదియు నగను. 

2. శని రాహువులున్న గురుద్రోహి, శాస్త్ర విముఖుడు అగును. 

3. రవి గురు సంబంధమున్న గురుద్రోహియై, పెద్దలమాట చెవిని పెట్టని వాడగును. 

4. కుజశుక్ర సంబంధమున్న షడ్వర్గాదిక యోగమున్న పరస్త్రీవలన మరణము కలుగును. 

5. చంద్ర బుధయోగమున్న పరస్త్రీ సాంగత్యమువలన ఆ పరస్త్రీకి అధీనమగును. 

6. గురుడు మాత్రమే నవమమందున్నా, చూచినా, స్త్రీలోలుడు, విషయాసక్తుడు అగును.


కారకాంశ దశమ స్థాన ఫలితములు:

1. కారకాంశనుండి దశమము శుభగ్రహ సంబంధము కలదైన జాతకుడు స్థిరమైన సంపద కలవాడు, గంభీరుడు, బలము కల వాడు నగను. 

2. పాపగ్రహసంబంధమున్న వ్యవసాయమున ధననష్టము, తండ్రికి సుఖము లేకపోవుట జరుగును. 

3. కారకాంశనుండి దశమము బుధశుక్ర సంబంధము కలదైన. వ్యాపారమున బహులాభమును, గొప్ప పనులు చేయువాడు అగును.  

4. కారకాంశనుండి దశమంలో చంద్రరవులున్నా, చూచినా, గురుసంబంధమున్నా రాజగును.


5. కారకాంశ నుండి ఏకాదశమునకు శుభగ్రహసంబంధమున్న జాతకునకు అన్నిటా లాభము కలుగును. ఎప్పుడును సోదరసౌఖ్య ముండును. 

6. కారకాంశ నుండిలాభంలో పాపగ్రహ సంబంధమున్న అసద్వృత్తి, అర్థలాభము కలుగును. పరాక్రమవంతుడు, ప్రసిద్ధుడు అగును.


కారకాంశ ద్వాదశస్థాన ఫలితములు: 

1. కారకాంశకు వ్యయమున శుభగ్రహమున్న సత్కర్మకై వ్యయమును, పాపగ్రహమున్న చెడుపనులకోసము ధనవ్యయము చేయును. ఏగ్రహము లేకున్న శుభఫలము చెప్పవలెను. అక్కడ శుభగ్రహము స్వ, ఉచ్చయందుండిన సద్గతి, శుభలోకము కలుగును. 

2. కేతువు వ్యయమందుండి శుభగ్రహ సంబంధము కలిగిన ముక్తి కలిగిన, సాయుజ్యపదవినందును. 

3. వ్యయము మేషముకాని, ధనుస్సుకాని అయి, అక్కడ కేతువుండి శుభగ్రహముచే చూడబడిన కైవల్యపదవి నందును. 

4. అక్కడ కేతువోక్కడే ఉండి, పాపగ్రహ సంబంధమున్న ముక్తికాదు, శుభలోకమును పొందడు. కేతువుతో రవి కలసిన రవి భక్తుడగును. 

5. చంద్రునితో కలిసిన గౌరియందు భక్తికలిగి, శాక్తేయు డగును. 

6. శుక్రునితో కలిసిన లక్ష్మి యందు భక్తి యుండును. 

7. కుజునితో కలిసిన కుమారస్వామి భక్తుడగును. 

8. బుధశనులున్న విష్ణు భక్తుడగును. 

9. గురునితో కలిసిన శివభక్తుడగును. 

10. రాహువున్న తామసీ దుర్గాభక్తుడు కాని, భూతాదిభక్తుడు కానిఅగును. 

11. కేతువున్న గణపతి భక్తుడుగాని, కుమారస్వామి భక్తుడుగాని అగును. 

12. అది పాపగ్రహరాశియై శనియున్న క్షుద్రదేవతో పాసకు డగును. 

13. వ్యయము పాపగ్రహరాశియై శుక్రుడున్న క్షుద్రోపాసకు డగును. 

14. అమాత్యకారకగ్రహము షష్ఠమందున్నా  ఇదే ఫలము చెప్పుకొనవలెను.


విశేషము: 

1. కారకాంశకు పంచమ, నవమములు పాపగ్రహయుక్తములైన జాతకుడు మంత్ర తంత్రవేత్త అగును. 

2. అక్కడ పాపదృష్టియున్న తంత్రనిగ్రహము చేయువాడు (జనులకు ప్రయోగము చేసి అపకారము చేయువాడు) అగును. 

3. శుభగ్రహ దృష్టియున్న జనుల నా, గ్రహించువాడు ఉపయోగించుటకే పని చేయువాడగును.

4. ఆత్మకారకనవాంశ శుక్రదృష్టమై, చంద్రుడున్న జాతకుడు రసవాది అగును. 

5. బుధ దృష్టియున్న సర్వరోగనాశకుడైన వైద్యుడగును. 

6. కారకాంశకు చతుర్థమున చంద్రుడుండి శుక్రదృష్టియున్న శ్వేతకుష్ఠి (బొల్లి కలవాడు) అగును. కుజుడున్న రాజరోగియు, రక్త పైత్య రోగము కలవాడు అగును. 

7. కేతుదృష్టియున్న నీలకుష్ఠము కలుగును. 

8. కుజరాహువులు చతుర్థమునగాని, పంచమమునగాని ఉన్న  క్షయరోగము కలుగును. చంద్రదృష్టియున్న తప్పక కలుగును. 

9. కారకాంశకు చతుర్థ, పంచమములందు కుజుడు మాత్రమే యున్న పిటకాదులు (పొక్కులు) కలుగును. 

10. కేతువున్న జలోదరముగాని, గ్రహణికాని కలుగును. 

11. రాహుగుళికులున్న విషవైద్యు డగును. 

12. కారకాంశకు పంచమమున శనిమాత్రమున్న ధనుర్విద్యాధరుడగును. 

13. కేతువు మాత్రమున్న గడియారము తయారు చేయును. 

14. బుధుడున్న. దండి సన్యాసి యగును. లేదా పరమహంసవలె ఉండును. 

15. కుజుడున్న కుంతధారి, రాహువున్న, లోహా స్త్రధారి, 

16. రవియున్న ఖడ్గధారి యగును. (ఈ ఫలములు 36-39 శ్లోకములలో చెప్పినవిగా ఉన్న యి ).

17. కారకాంశయందుగాని, దానికి పంచమమందుగాని శుక్రుడున్న జాతకుడు వక్త, కవి యగును. గురుడున్న గ్రంథకర్త, వ్యాకరణవేత్త, వేదవేదాంత తత్వజ్ఞుడు అగునుకాని సభలలో ప్రగల్బుడు కాడు. 

18. శనిఉన్న  సభాపీరికి అగును. కారకాంశయందుగాని, తత్పంచమమందుగాని కుజుడున్న తార్కికు డగును. 

19. బుధుడున్న సాహిత్య, సాంఖ్య యోగ, గాన నిపుణుడగును. 

20. రవియున్న వేదాంతతత్వవేత్త, గాయకుడు అగును. 

21. కేతువున్న గణితమున, జ్యోతిషమున నిపుణుడగును. 

22. అక్కడ గురుసంబంధమున్న సంప్రదాయవేత్త అగును. 

23. ఇట్లే కారకాంశకు ద్వితీయములవలన చూడవలెను. 

24. కారకాంశకు ద్వితీయమున కేతువున్న మూగవాడు, (వాక్కుస్తబ్ధమైనవాడు) అగును. పాపగ్రహ దృష్టియున్న విశేషముగా వాక్ స్తబ్ధత యుండును. (ఈ ఫలములు 41-45 శ్లోకములలో చెప్పబడినవే.)


కేమద్రుమ యోగము: 

1. ఆత్మకారక నవాంశ లేక ఆరూఢ లగ్నము, లేక లగ్నమునుండి ద్వితీయ, అష్టమ స్థానములందు సమసంఖ్యలో పాపగ్రహము లున్నయెడల కేమద్రుమము అనెడి యోగము. దానికి చంద్రదృష్టి ఉన్న  ప్రబలమగును ( ఎక్కువ అశుభము చేయును.) 

2. ఈ ప్రకరణములలో ఏయే యోగములు చెప్పబడినవో, అవి ఆయా రాశి, గ్రహదశలలో ఫలితము నిచ్చును. 

3. ఈవిధంగా దశాప్రదమైన రాశినుండి ద్వితీయ, అష్టమములందు గ్రహసామ్య మున్న అశుభకారకమైన కేమద్రుమ విచారణ చేయవలెను. 

4. ఇట్లే లగ్నాది ద్వాదశభావములకు రవ్యాది గ్రహములకు స్థితిని అనుసరించి ఫలము చెప్పవలెను. ఇది సంక్షేపముగా కారకాంశఫలము చెప్పబడినది.


ధూమాది అప్రకాశ గ్రహ సాధనము 

అప్రకాశక గ్రహములు ఐదు ఉన్న వి :- 

1. ధూమము, 

2. వ్యతీపాత, 

3. పరివేషము, 

4. ఇంద్రచాపము, 

5. కేతువు.

1. రవిస్ఫుటానికి 4˚13ˊ 20˝ కలిపిన ధూమము వచ్చును. 

2. 12 రాశులలో ధూమమును తీసివేయగా వ్యతీపాత వచ్చును.  

3. వ్యతీపాతకు 6రాశులు కలుపగా పరివేషము వచ్చును.

4. పరివేషమును 12రాశులలో తీసివేయగా ఇంద్రచాపము వచ్చును. 

5. ఇంద్రచాపమునకు 0˚16ˊ40˝ కలుపగా కేతువు వచ్చును. 

6. కేతువునకు 30˚00ˊ00˝ రాశి కలుపగా రవి వచ్చును.

ధూమము మహాదోషము, సర్వకర్మ వినాశకము. వ్యతీపాతము, పరివేషము, ఇంద్రచాపము, కేతువు ఇవన్నియు అశుభములు, దోషము నిచ్చునవి అగును.


అప్రకాశ గ్రహఫలము:

ఈ అప్రకాశ గ్రహములు రవి, చంద్ర, లగ్నములతో కలిసిన క్రమముగా వంశ, ఆయువు, జ్ఞానములను నశింపజేయును. ఈ అయిదు అర్క దోషముల స్థితిని బ్రహ్మ చెప్పెను.

Comments

Popular posts from this blog

Vaidhavya yoga (widowhood) Recognition

Recognition of Vericose veins in a horoscope

Apamrutyu Dosha Recognition