మేషలగ్నమునకు శుభ, అశుభ గ్రహములు:
మేషలగ్నమునకు శుభ, అశుభ గ్రహములు:
1. మేషలగ్నమున పుట్టినవానికి శని, బుధ, శుక్రులు పాపఫలమును ఇస్తారు.
2. గురు సూర్యులు శుభకరులు;
3. శనిగురుల్ సంబంధము చెడ్డది. సంబంధమువలన శుభపలప్రదులు కారు.
4. గురుడు పరాధీనుడగుట వలన పాపకారి యగును. అనగా మరొకరితో కలిసిన చెడ్డవాడుకాని, స్వతహాగా మంచివాడే.
5. మారకాధిపతియైన శుక్రుడు ప్రబలమారకుడు.
6. శన్యాదులు పాపులు కనుక శుక్రసంబంధమున మారకులగుదురు. ఇది మేషలగ్న జాతకుని ఫలము.
మేషలగ్నమునకు:
1) రవి పంచమకోణాధిపతి కాన శుభుడు.
2) కుజుడష్టమాధిపతి కనుక అశుభుడేకాని లగ్నాధిపతి కూడ కనుక శుభుడే.
3) బుధుడు తృతీయ, షష్ఠాధిపతికాన పాపుడు.
4) గురుడు వ్యయాధిపతియైనా, నవమాధిపతి కనుక శుభుడే.
5) శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ఉభయమారక స్థానాధిపతి. అందును కేంద్రాధిపతి. కోణాధిపతికాడు కనుక అశుభ ఫలప్రదుడే. కాన శుక్రుడు మారకుడైనాడు.
6) శని దశమాధిపతి కనుక శుభమే. కాని లాభాధిపతి యగుటచే యోగకారకుడు కాడు, పాపఫలప్రదుడే అగును. ఇట్లే లగ్నము లన్నీటికీ గ్రహముల శుభాశుభత్వములు ఆధిపత్యవశాత్తు వివేచన చేయవలెను.
సింహావలోకనము: ఈ అధ్యాయములో చెప్పిన విషయములు
(1) త్రికోణాధిపతి ఎప్పుడు మంచివాడు, 3, 6, 11 అధిపతి అశుభప్రదుడు.
(2) కేంద్రాధిపతి శుభుడైన శుభఫలమియ్యడు, పాపగ్రహమైన అశుభఫలమియ్యడు.
(3) పంచమాధిపతి కన్న నవమాధిపతి, తృతీయాధిపతికన్న షష్ఠాధిపతి, షష్ఠాధిపతికన్న ఏకాదశాధిపతి; అదేవిధముగా లగ్నాధిపతికన్న చతుర్థాధిపతి, వానికన్న సప్తమాధిపతి, వానికన్న దశమాధిపతి బలవంతులు.
(4) లగ్నాత్తు ద్వితీయ, ద్వాదశాధిపతులు శుభగ్రహసాహచర్యమువలన శుభఫలమును, పాపగ్రహ సాహచర్యమున పాపఫలమును ఇస్తారు..
(5) అష్టమాధిపతి అశుభప్రదుడు; అతడే 3.6, 11ల కధిపతి యైన మరింత పాపి; కాని త్రికోణాధిపతియైన శుభుడగును..
(6) కేంద్రాధిపత్య దోషము చంద్ర, బుధ, గురు, శుక్రులకు ఉత్తరోత్తరము ప్రబలము. కాబట్టి శుక్రుడు మారకుడైనాడు మరింత ప్రబల మారకుడు కూడా అగును.
కేంద్ర కోణేశ సంబంధము రాజయోగము: సంబంధము 4 విధములు.
(1) పరస్పర రాశులందుండుట.
(2) కేంద్ర త్రికోణాధిపతులిద్దరు ఒకేచోట ఉండుట,
(3) ఒక్కడు మరొకని యింటిలో నుండుట;
(4) ఒకరు మరొకరిని చూచుట, ఈ నాల్గిటిలో ఏది ఉన్న రాజయోగమే. అందును నవమ దశమాధిపతితులకు పై చెప్పిన సంబంధ మేది యున్నను విశిష్టమైన యోగము. కేంద్రత్రికోణముల కొక్కడే అధిపతియైన వృషభలగ్నమునకు, తులకును శని; రాజయోగము. కేంద్ర త్రికోణాధిపతుల సంబంధమున్నను త్రిషడేకాదశ (3, 6, 11) ధిపతుల సంబంధమున్న రాజయోగము చెడును. కేంద్రమందున్న రాహుకేతువులకు త్రికోణాధిపతితోను, త్రికోణమందున్న రాహుకేతువులకు కేంద్రాధిపతితోను సంబంధమున్న రాజయోగము.
వృషభ లగ్నమునకు శుభాశుభ గ్రహములు:
1. గురు, శుక్రు, చంద్రులు పాపులు;
2. రవి శనులు శుభులు;
3. శని రాజయోగకారకుడు.
4. బుధుడు కొద్దిగా శుభము చేయువాడు.
5. గురు శుక్ర, చంద్రులు, కుజుడు మారకులగుదురు.
1) వృషభ లగ్నమునకు రవి చతుర్థ కేంద్రాది శుభుడు.
2) శని నవమకోణ, దశమ కేంద్రాధిపతి విశిష్ట శుభుడు;
3) చంద్రుడు తృతీయాధిపతి అశుభుడు,
4) బుధుడు ద్వితీయాధిపతియైనా పంచమ కోణాధపతి కనుక కొంత శుభుడు.
5) గురుడు అష్టమ, లాభాధిపతి అశుభుడు. శుక్రుడు లగ్న, షష్ఠాధిపతి పాపి.
మిథున లగ్నమునకు శుభాశుభ గ్రహములు:
1. రవి, కుజ, గురులు పాపులు.
2. శుక్రుడొక్కడే శుభుడు.
3. శని యోగకారకుడు.
4. శనికి గురునితో సంబంధమున్న శుభప్రదుడుకాడు. (మేషమువలెనే) చంద్రుడు ముఖ్యమారకుడు. సాహచర్యమువలన ఫలప్రదు డగును.
1) మిథునానికి రవి తృతీయాధిపతి అశుభుడు,
2) చంద్రుడు ద్వితీయాధిపతి మారకుడేగాని యోగము విషయమున ఎవనితో కలియునో దానినిబట్టి ఫలము నిచ్చును.
3) కుజుడు షష్ఠ. లాభాధిపతి పాపి,
4) బుధుడు లగ్నచతుర్థాధిపతి శుభుడు.
5) గురుడు సప్తమ, దశమ, ఉభయ కేంద్రాధిపతి యగుటవలన మరింత పాపి.
6) శుక్రుడు వ్యయాధిపతి కనుక అశుభుడైనా, పంచమ కోణాధిపతి కనుక శుభుడు మరియు యోగకారకుడగును.
7) శని నవమాధిపతి ఐనందున శుభత్వము.అష్టమాధిపత్యము అశుభము) మిథునానికి నవమ దశమాధిపతులైన శనిగురుల యోగము మంచిదికాదు.
కర్కాటక లగ్నమునకు శుభాశుభ గ్రహములు:
1. బుధ, శని, శుక్రులు పాపులు;
2. కుజ, చంద్ర గురులు శుభులు;
3. కుజుడు పూర్ణ యోగకారకుడు;
4. శని మారకుడు;
5. రవి సాహచర్యము వలన ఫలమిచ్చును.
1) రవి ద్వితీయాధిపతి కనుక సాహచర్యమున ఫలప్రదుడు;
2) చంద్రుడు లగ్నాధిపతి శుభుడు;
3) కుజుడు పంచమ, దశమాధిపతి. కేంద్రకోణాధిపతి యైనందున విశిష్ట శుభుడు, పూర్ణయోగకారకుడు.
4) బుధుడు తృతీయ వ్యయాధిపతి పాపి.
5) గురుడు షష్ఠాధిపతియై పాపియైనా, నవమాధిపత్యమువలన శుభుడైనాడు.
6) శుక్రుడు చతుర్థ కేంద్రాధిపతియై పాపియై, లాభాధిపతియై నందున మరింత పాపియైనాడు.
7) శని సప్తమాధిపతియైనందున పాపఫలము నియ్యలేకపోయినా, అష్టమాధిపత్యము వల్ల మారకుడైనాడు.
సింహలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. శని, బుధ, శుక్రులు పాపులు.
2. రవి, కుజ, గురులు శుభులు.
3. గురుశుక్రుల యోగమాత్రమున శుభము నియ్యరు.
4. శని మారకుడు. చంద్రుడు సాహచర్యవశాత్తు ఫలమిచ్చును.
1) సింహమునకు రవి లగ్నాధిపతి శుభుడు;
2) చంద్రుడు వ్యయాధిపతి కనుక సాహచర్య వశమున ఫలమిచ్చును.
3) కుజుడు చతుర్ధ నవమాధిపతి అనగా కేంద్రకోణాధిపతి కాన యోగకారకుడు.
4) బుధుడు ద్వితీయ ఏకాదశాధిపతి కనుక ధనయోగమున మంచి వాడైనా, రాజయోగమున మంచిదికాదు.
5) గురుడు పంచమాధిపతి కావున శుభుడు, (అష్టమాధిపత్యము కూడా ఉన్నది)
6) శుక్రుడు తృతీయ దశమాధిపతియై పాపియైనాడు. ఇతనికి అష్టమాధిపతియైన గురుసంబంధము మంచిదికాదు.
7) శని సప్తమాధిపతియై నందున పాపియే కాక మారకుడుకూడాఅగును.
కన్యాలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. కుజ, గురు, చంద్రులు పాపులు.
2. బుధశుక్రులు శుభులు; వీరే యోగకారకులు.
3. శుక్రుడు మారకుడు.
4. రవి సాహచర్యమున ఫలమిచ్చును.
1) కన్యాలగ్నానికి రవి ద్వాదశాధిపతి కావున సాహచర్యనశమున ఫలమిచ్చును.
2) చంద్రుడు లాభాధిపతి పాపి.
3) కుజుడు తృతీయాష్టమాధిపతి పాపి.
4) బుధుడు లగ్న దశమాధిపతి యోగకారకుడు.
5) గురుడు చతుర్థ సప్తమ ఉభయ కేంద్రాధిపతియై మరింత పాపి.
6) శుక్రుడు ద్వితీయాధిపతి సాహచర్యము, నవమాధిపతియైనందున యోగకారకుడు. కావున బుధ శుక్రసంయోగము మంచిది.
7) శని పంచమాధిపతియై శుభుడైనా షష్ఠాధిపతి కనుక ఆశుభుడైనాడు.
తులాలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. రవి, కుజ, గురులు పాపులు;
2. శని బుధులు శుభఫలప్రదులు.
3. చంద్రబుధులు రాజయోగకారకులు.
4. కుజుడు మారకుడు, గుర్వాదులు మారక లక్షణములు కలవారు.
5. శుక్రుడు సముడు.
1) తులాలగ్నమునకు రవి లాభాధిపతిపాపి,
2) చంద్రుడు దశమాధిపతి శుభుడు;
3) కుజుడుద్వితీయ సప్తమాధిపతి ఉభయ మారక స్థానాధిపతి మారకుడు.
4) బుధుడు వ్యయాధిపతియైనా నవమాధిపతి కనుక శుభుడే.
5) నవమ దశమాధిపతులైన బుధచంద్రుల యోగము శుభప్రదము.
6) గురుడు తృతీయ షష్ఠాధిపతి పాపి;
7) శుక్రుడు అష్టమాధిపతియై పాపియైనా, లగ్నాధిపతి కావున శుభుడే. కాని యితడు సముడన్నాడు.
8) శని చతుర్థ పంచమ కేంద్రకోణాధిపతి కనుక పూర్ణశుభుడు. రాజయోగ కారకు డగును.
వృశ్చికలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. శుక్ర బుధ శనులు పాపులు;
2. గురు చంద్రులు శుభులు.
3. సూర్య చంద్రల సంబంధము యోగకారము.
4. కుజుడు సముడైనాడు,
5. శుక్రాదులు మారకము కలవారు.
1) వృశ్చిక లగ్నమునకు రవి దశమాధిపతి శుభుడు;
2) చంద్రుడు నవమాధిపతి శుభుడు. రవిచంద్రుల సంబంధము యోగకారకము,
3) కుజుడు లగ్న షష్ఠాధిపతియై శుభాశుభత్వములు కలిసి సముడైనాడు.
4) బుధుడు అష్టమ లాభాధిపతియై నందున పాపి.
5) గురుడు ద్వితీయాధిపతియై సామాన్యుడైనా, పంచమాధిపతి కనుక శుభుడైనాడు.
6) శుక్రుడు సప్తమ కేంద్రాధిపతి, వ్యయాధిపతి కనుక పాపి, మారకుడును,
7) శని తృతీయ చతుర్థాధిపతి పాపి.
ధనుర్లగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. శుక్రుడొక్కడే పాపి, రవికుజులు శుభులు,
2. రవి బుధులుల యోగకారకులు; శని మారకుడు;
3. గురుడు సముడు;
4. శుక్రుడు మారక లక్షణములు కలవాడు.
1) ధనుస్సుకు రవి నవమాధిపతి శుభుడు;
2) చంద్రుడికి అష్టమాధిపతిత్వ దోషము లేనందున కేవల పాపి కాడు.
3) కుజుడు వ్యయాధిపతియైనా, పంచమాధిపతియైనందున శుభుడు మరియు యోగకారకుడుకూడ.
4) గురుడు లగ్న చతుర్థాధిపతియై నందున సముడైనాడు.
5) శుక్రుడు షష్ఠ, లాభాధిపతి పాపి.
6) శని ద్వితీయ తృతీయాధిపతియై నందున అశుభుడే కాక మారకుడుకూడా అగును.
మకరలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. కుజగురుచంద్రులు పాపులు;
2. బుధశ్రుకులు శుభులు; శని స్వయముగా మారకుడుకాడు;
3. కుజాదులు మారకులగుదురు.
4. రవి సముడు; శుక్రుడొక్కడే యోగకరాకుడు.
1) మకరలగ్నమునకు రవి అష్టమాధిపత్యము దోషముకాదు. కాని శుభప్రదత్వము లేనందున సముడు.
2) చంద్రుడు సప్తమ కేంద్రాధిపతి కావున పూర్ణచంద్రుడు పాపి, క్షీణచంద్రుడు శుభుడును.
3) కుజుడు చతుర్థ లాభాధిపతి అశుభుడు;
4) బుధుడు షష్ఠాధిపతియైనా నవమాధిపతి కావున శుభుడు.
5) గురుడు తృతీయ వ్యయాధిపతి కావున పాపుడు;
6) శుక్రుడు దశమ కేంద్రాధిపతియై అశుభుడగుటకన్న పంచమాధిపతియై నందున శుభత్వము హెచ్చు శుభుడుగానే చెప్పబడును.
7) శని లగ్న ద్వితీయాధిపతియై నందున శుభులలోనే లెక్క. మారకత్వము విషయమున మారకుడు.
కుంభలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. కుజగురుచంద్రులు పాపులు;
2. శని శుక్రులు శుభులు; శుక్రుడు రాజయోగకారకుడు.
3. రవి కుజ గురులు మారకులు.
4. బుధుడు మధ్యమ ఫలదుడు.
1) కుంభమునకు రవి సప్తమాధిపతి పాపి కాకపోయినా మారకుడు.
2) చంద్రుడు షష్ఠాధిపతి పాపి;
3) కుజుడు తృతీయ దశమాధిపతి సముడు.;
4) గురుడు ద్వితీయ లాభాధిపతి ధనయోగమున మంచి వాడేయైనా యోగదుడుకాడు.
5) శుక్రుడు చతుర్థ కేంద్రాధిపతియైనా నవమాధిపతి కనుక శుభుడు, రాజయోగకరుడు.
6) శని లగ్న ద్వాదశాధిపతి సముడు.
మీనలగ్న జాతకునకు శుభాశుభ గ్రహములు:
1. రవి శని శుక్ర బుధులు పాపులు.
2. కుజ చంద్రులు శుభులు.
3. కుజగురులు యోగకారకులు.
4. శని బుధులు మారకులుకారు. కుజుడు మారకుడగును.
1) మీనమునకు రవి షష్ఠాధిపతి పాపి,
2) చంద్రుడు పంచమ కోణాధిపతి శుభుడు;
3) కుజుడు ద్వితీయ, నవమాధిపతి కావున శుభుడు; యోగకారకుడును.
4) బుధుడు చతుర్థ. సప్తమాధిపతి పాపి.
5) గురుడు దశమాధిపతిగా పాపియైనా లగ్నాధిపతిగాన శుభుడు.
6) శుక్రుడు తృతీయాష్టమాధిపతి పాపి;
7) శని లాభవ్యయాధిపతియై పాపియైనాడు.
ఈ రీతిగా జన్మలగ్నానుసారముగా భావాధిపతిత్వవశమున గ్రహములకు శుభా శుభత్వము చెప్పబడినది.
Comments
Post a Comment