రజ్జాదియోగ ఫలము:
రజ్జాదియోగ ఫలము:
1. రజుయోగమున పుట్టినవారు తిరుగుటయం దిష్టపడుదురు. సుందరులు, పరదేశమున సుఖముగా నుండువారు, క్రూరులు, దుష్టస్వభావులును.
2. ముసలయోగ జాతుడుమాని, జ్ఞాని, ధార్మికుడు, రాజప్రియుడు, ప్రసిద్ధుడు, బహుపుత్రవంతుడు, స్థిరబుద్ధియును.
3. నలయోగజుడు హీనాంగుడు, లేక అధికంగుడు, ధనము ప్రోగుచేయువాడు, మంచి నేర్పరి, బంధుప్రేమ కలవాడు, సుందరుడును.
4. మాలాయోగ జాతకుడు నిత్యసుఖి, వాహన, వస్త్ర, అన్నాది భోగవంతుడు, అనేక సుందరీ ప్రియుడు.
5. సర్పయోగ జాతకుడు కుటిలుడు, దుష్టుడు. నిర్ధనుడు, దుఃఖపీడితుడు, దీనుడు, పరుల అన్నపానములమీద ఆధారపడిన వాడు;
6. గదాయోగజాతుడు సతతము ధనసంపాదనపరుడు, యజ్వ. శాస్త్ర, గానప్రవీణుడు, ధన, సువర్ణ, రత్నాది సమృద్ధుడు.
7. శకటయోగ జాతకుడు రోగపీడితుడు, పుప్పిగోళ్ళు కలవాడు, మూర్ఖుడు, బండి తోలుకొని జీవించువాడు, నిర్ధనుడు, మిత్రులు, ఆత్మీయులు లేనివాడు,
8. విహగయోగ జాతకుడు తిరిగే స్వభావము కలవాడు, పరాధీనుడు, దూత, కామినీ కాముకులను సంధానము చేయువాడు, కలహప్రియుడును.
శృంగాటక యోగాది జాతకుల ఫలములు:
1. శృంగాటకయోగ జాతకుడు కలహప్రియుడు, సుఖి, రాజప్రియుడు, సుందరమైన భార్య కలవాడు, ధని, స్త్రీలచే ద్వేషింపబడువాడును,
2. హలయోగ జాతకుడు తిండిపోతు, దరిద్రుడు, రైతు, దుఃఖి, ఉద్వేగము కలవాడు, బంధుమిత్రులు కవాలడు దాస్యము చేయువాడు.
3. వజ్రయోగజాతుడు చిన్నప్పటినుండి చివరివరకు సుఖవంతుడు, అందమైనవాడు, నిరీహుడు, భాగ్యహీనుడు, దుష్టుడు, జనవిరోధియు.
4. యువయోగ జాతకుడు ప్రతనియమపరుడు, మధ్యవయస్సున సుఖము, పుత్రులు, ధనము కలవాడు, దాత, స్థిరబుద్ది;
5. కమలయోగ జాతకుడు మంచి గుణములు కలవాడు, సంపన్నుడు, దీర్ఘాయుష్కుడు, కీర్తిమంతుడు; పరిశుద్ధుడు, ఎన్నో సత్కర్యములు చేయువాడు, రాజసముడు అగును.
వాపీ ప్రభృతి జాతకుల ఫలములు:
1. వాపీయోగజాతకుడు ధనము ప్రోగుచేయుటలో నిపుణుడు, స్థిరమైన ధనము సుఖము కలవాడు, పుత్రవంతుడు, నేత్రానందమిచ్చు నృత్యాదిక మెరిగినవాడు, రాజగును.
2. యూపయోగజాతుడు ఆత్మవేత్త, యాగములు చేయువాడు, స్త్రీయుతుడు, సాత్త్వికుడు, వ్రతనియమపరుడు, విశిష్టుడు అగును.
3. శరయోగజాతుడు బాణములు చేయువాడు, కారాగారాధిపతి, వేటవలన ధనము కలవాడు, మాంసఖాది, హింసకుడు, కుత్సితకర్మ చేయువాడు అగును.
4. శక్తియోగజాతకుడు దరిద్రుడు, వైఫల్యము వలన దుఃఖించువాడు, నీచుడు, మందుడు, దీర్ఘాయువు, యుద్ధకుశలుడు, రూపవంతుడు అగును.
5. దండయోగజాతకుడు భార్యపుత్రులు లేనివాడు, దాసవృత్తి చేయువాడు అగును.
6. నౌకాయోగ జాతకుడు జలజీవి పదార్థములవలన జీవించువాడు, గొప్పగొప్ప ఆశలు కలవాడు, దుష్టుడు, కీర్తిమంతుడు, లోభి, మలినుడు, దుర్మార్గుడు అగును.
కూటాదియోగ జాతకుల ఫలములు:
1. కూటయోగ జాతకుడు అసత్యభాషి, కారాగారాధిపతి, దరిద్రుడు, శరుడు, క్రూరుడు, కొండల మీది అడవులలో ఉండు వాడు అగును.
2. ఛత్రయోగజాతకుడు స్వజనుల కాశ్రయుడు, దయావంతుడు, రాజులకిష్టుడు, బుద్ధిశాలి, చిన్నతనమున సుఖించువాడు, దీర్ఘాయువు అగును.
3. చాపయోగ జాతకుడు అసత్యభాషి, కారాగారాధిపతి, చోరుడు, ధూర్తుడు, అడవిలో తిరుగువాడు, భాగ్యహీనుడు మధ్యవయస్సున సుఖించినవాడు అగును.
4. అర్ధచంద్రయోగ జాతకుడు సేనాధిపతి, సుందరుడు, రాజప్రియుడు, బలవంతుడు, మణి, కనక భూషణములు కలవాడు అగును.
5. చక్రయోగ జాతకుడు సామాంతరాజులచే కాళ్ళకు మొక్కించుకొనే చక్రవర్తి అగును.
6. సముద్రయోగ జాతకుడు బహురత్నములు, ధనము సమృద్ధిగా కలవాడు, రాజభోగములు కలవాడు, జనప్రియుడు, పుత్రవంతుడు, స్థిరవైభవము కలవాడు, సాధుశీలుడు అగును.
వీణాదియోగ జాతకుల ఫలములు:
1. వీణాయోగజాతుడు గీత, నృత్య, వాద్యప్రియుడు, నేర్పరి, సుఖి, ధని, నాయకుడు, అనేక భృత్యులు కలవాడు;
2. దామయోగజాతుడు జనోపకారి, న్యాయార్జిత ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యము కలవాడు, ప్రఖ్యాతుడు, పుత్రులు, రత్నములు కలవాడు, ధీరుడు, పండితుడును.
3. పాశయోగజాతుడు బంధనము కలవాడు, కార్యదక్షుడు, లౌకికుడు, బహుభాషి శీలహీనుడు, అనేక సేవకులు కలవాడు, పరివారము కలవాడు,
4. కేదారయోగజాతుడు చాలమందికి ఉపకారము చేయువాడు, రైతు, సత్యవాది, సుఖి, చంచలస్వభావుడు, ధనవంతుడు అగును.
5. శూలయోగజాతుడు కఠిన స్వభావుడు, బద్ధకస్తుడు, దరిద్రుడు, హింసకుడు, సమాజ బహిష్కృతుడు, శూరుడు, యుద్ధమున ప్రఖ్యాతుడు అగును.
6. యుగయోగ జాతకుడు పాషండుడు, నిర్ధనుడు, సమాజ బహిష్కృతుడు, తల్లి, తండ్రి, ధర్మము లేనివాడు అగును.
7. గోలయోగ జాతకుడు బలశాలి, దరిద్రుడు, విద్యా విజ్ఞానరహితుడు, మలినుడు, నిత్య దుఃఖితుడు దీనుడు అగును.
8. పైన చెప్పిన యోగఫలములు అన్ని గ్రహముల దశలలోను (పుట్టినది మొదలు జీవితాంతము) జరుగును. ఇవి సామాన్య ఫలిములు కనుక ఎప్పుడును జరుగునని ప్రాచీనాచార్యులు చెప్పియున్నారు.
బహువిధ యోగాములు
శుభ యోగము:
లగ్నమున శుభగ్రహమున్న శుభయోగము, పాపగ్రహమున్న అశుభయోగము కలుగును.
ఇట్లే వ్యయమునగాని, ద్వితీయమునగాని శుభగ్రహములున్నా శుభయోగము,
శుభయోగ జాతకుడు వక్త, రూపము, శీలము, మున్నగు గుణములతో కూడినవాడు అగును.
అశుభ యోగము:
పాపగ్రహములున్న అశుభయోగము జరుగును.
పాపయోగజాతుడు కాముకుడు, పాపకర్మలు చేయువాడు, పరధనాపహారి యగును.
గజ కేసరి యోగము:
లగ్నమునుండికాని, చంద్రునినుండికాని కేంద్రమున(1, 4, 7, 10) గురుడుండి శుభగ్రహ సంబంధమున్న అతడు నీచ, అస్తంగత, షష్ఠస్తుడు కాకున్న గజ కేసరియోగము.
దీనిలో పుట్టిన జాతకుడు తేజస్వి, ధనవంతుడు, మేధావి, గుణవంతుడు, రాజప్రియుడు చేయువాడు అగును.
అమలకీర్తి యోగము:
లగ్నమునుండికాని; చంద్రునినుండికాని దశమమున శుభగ్రహము మాత్రమున్న అమలకీర్తియోగము.
ఈ యోగమున పుట్టినవాడు రాజపూజ్యుడు, మహాభోగి, దాత, బంధుప్రియుడు, పరోపకారి, గుణవంతుడు అగును.
పర్వతయోగము:
షష్ఠాష్టమ స్థానములు శుభగ్రహయుక్తమైనా, గ్రహవర్జితములైనా, కేంద్రములు శుభయుక్తములైన పర్వతయోగము.
దీనిలో పుట్టినవాడు యశస్వి, తేజస్వి, భాగ్యవంతుడు, దాత, వక్త, వినోదవంతుడు, పురపాలకుడు, శాస్త్రవేత్త, కాముకుడు అగును.
కాహళ యోగము:
గురుడు చతుర్థాధిపతి పరస్పరము కేంద్రములందుండి, లగ్నాధిపతి బలవంతుడై యుండినా, లేదా దశమాధిపతితో కూడిన సుఖాధిపతి స్వ, ఉచ్చరాశులందున్న కాహలయోగము.
ఈయోగ జాతకుడు ఓజస్వంతుడు, సాహసి, మూర్ఖుడు, చతురంగబల సంయుతుడు; చిన్న గ్రామాధిపతి యగును.
చామర యోగము:
ఉచ్చస్థుడైన లగ్నాధిపతి కేంద్రమునఉండి, గురునిచే చూడబడిన, లేదా రెండు శుభగ్రహములు లగ్న, సప్తమ, నవమ, దశమ భావములందున్నా, చామర యోగము.
ఈ యోగ జాతకుడు దీర్ఘాయుష్మంతుడు, పండితుడు, రాజు, రాజవంద్యుడుగాని, వక్త, కళావేత్త గాని అగును.
శంఖ యోగము:
పంచమ, షష్ఠాధిపతులు పరస్పర కేంద్రగతులై, లగ్నాధిపతి బలవంతుడైనా లేక, లగ్న, దశమాధిపతులు చరరాశిస్థులై భాగ్యాధిపతి బలవంతుడైనా శంఖయోగము.
ఈ యోగజాతకుడు దయావంతుడు, పుణ్యవంతుడు, విద్వాంసుడు, సుతుడు, విత్తము, భార్య కలవాడు దీర్ఘాయుష్మంతుడు, శుభాచారుడు అగును.
భేరీ యోగము:
భాగ్యాధిపతి బలవంతుడై, గ్రహములన్నియు, లగ్న, ద్వితీయ, సప్తమ, ద్వాదశములందున్నా, లేక బలముకల భాగ్యాధిపతిఉన్న , కేంద్రము లగ్నాధిపతి గురు, శుక్రులున్నా భేరీయోగము.
ఈ యోగజాతకుడు సత్ర్పవర్తన కలవాడు, సుఖ, భోగములు, భార్య, పిల్లలు కలవాడు, రాజు, సద్గుణవంతుడగును.
మృదంగాది యోగము:
లగ్నాధిపతి ప్రబలుడై, అన్ని గ్రహములు స్వ, ఉచ్చక్షేత్రములందుకాని, కేంద్రకోణము లందుగాని యున్న మృదంగయోగము.
దీనిలో పుట్టినవాడు రాజుకాని, రాజతుల్యుడుకాని అగును.
శ్రీ నాథయోగము:
ఉచ్చస్థుడైన సప్తమాధిపతి కర్మస్థానమున ఉండి, నవమ దశమాధిపతులకు సంబంధమున్న శ్రీ నాథయోగము.
ఈ యోగజాతుడు ఇంద్రునిలో సమమైన రాజగును.
శారదయోగము:
కర్మాధిపుడు (10) పంచమమునఉండి, బలవంతులైన రవిబుధులు స్వక్షేత్రవర్తులై కేంద్రములందున్నా , లేక చంద్రునితో నవమ పంచమములందు బుధుడు గురుడుగాని ఉండి, ఏకాదశమమున కుజుడున్న శారదయోగము.
ఈ యోగ జతకుడు రాజమాన్యుడు, విద్వాంసుడు, సుఖము, తపస్సు, ధర్మము కలవాడు, భార్యా, పుత్ర, ధనసంపూర్ణుడు అగును.
మత్స్యయోగము:
లగ్ననవమములు శుభ గ్రహములు కలవె, పంచమము శుభాశుభగ్రహయుతమై, చతుర్థ అష్టమములందు పాపగ్రహమున్న మత్స్యయోగము.
ఈ యోగజాతకుడు దయావంతుడు, కాలవేత్త, పండితుడు, బుద్ధి, రూపము, గుణము కలవాడు, కీర్తి, బలము, తపస్సు కలవాడు అగును.
కూర్మ యోగము:
మిత్ర, స్వ, ఉచ్చ, స్వనవాంశయందున్న శుభగ్రహములు పంచమ, షష్ఠ సప్తమములందుండి, స్వ, ఉచ్చను పొందిన పాపగ్రహములు త్రి, లాభ, లగ్నములందున్న, కూర్మయోగము.
ఈ యోగజాతకుడు గుణవంతుడు, సుఖి, కీర్తి, ధర్మములు కలవాడు, ఉపకారపరుడు, ధీరుడు, రాజుగాని నాయకుడుగాని అగును.
ఖడ్గయోగము:
భాగ్యాధిపతి ధనమున ఉండి, ధనాధిపతి భాగ్యమున ఉండి, లగ్నాధిపతి కేంద్రకోణము లందున్న ఖడ్గయోము.
ఈ యోగజాతకుడు బుద్ధి, వీర్యము, సుఖము, ధనము కలవాడు, శాస్త్ర వేత్త, కృతజ్ఞుడు, నేర్పరి యగును.
లక్మీయోగము:
లగ్నాధిపతి బలవంతుడై, భాగ్యాధిపతి స్వ, ఉచ్చ, మూలత్రికోణమున కేంద్రమున ఉన్న లక్ష్మీ యోగము.
ఈ యోగజాతకుడు రూపవంతుడు, ధర్మ, ధనయుక్తుడు, గుణము, కీర్తి, అనేక పుత్రలు కలవాడు రాజు అగును.
కుసుమయోగము:
స్థిరరాశిలగ్నమై, శుక్రుడు కేంద్రగతుడై, శుభగ్రహయుక్తుడైన చంద్రుడు త్రికోణమున (5, 9) ఉండి, శని దశమమందన్న కుసుమయోగము.
ఈయోగమున పుట్టినవాడు రాజుగాని, రాజసముడుగాని అగును. సుఖము, గుణము, భోగములు కలవాడు, దాత, పండితుడు, వంశమున ప్రసిద్ధుడు అగును.
కలానిధియోగము:
ద్వితీయమునగాని, పంచమమునగాని గురుడుండి, బుధశుక్ర సంబంధమున్నను, లేదా గురు, బుధ, శుక్రుల క్షేత్రమందున్నా, కలానిధియోగము.
ఈయోగజాతకుడు విద్య, ధనము, గుణము, సుఖము కలవాడు, రాజపూజితుడు, రోగము, భయములేనివాడు, కాముకుడు అగును.
పారిజాత యోగము:
లగ్నాధిపతియున్న రాశ్యధిపతి, అతడున్న రాశ్యధిపతి, దాని నవాంశాధిపతి ఉచ్చయందుగాని, కేంద్రకోణములందుగాని యున్న పారిజాత యోగము.
ఈయోగజాతకుడు ఐశ్వర్య సంపన్నుడు, బలవంతుడు, దయాలుడు, యుద్ధమన్న ఇష్టము కలవాడు అగును.
హరి హర బ్రహ్మ యోగము:
ధనాధిపతినుండి ద్వితీయ, అష్టమ, వ్యయములందు శుభగ్రహములున్న హరియోగము. సప్తమాధిపతినుండి 4, 9, 8 స్థానములందు శుభగ్రహములున్న హరయోగము. అదేవిధముగా లగ్నాధిపతినుండి 4, 10, 11 స్థానములందు శుభగ్రహములున్న బ్రహ్మయోగము.
ఈ యోగజాతకకుడు సుఖీ, విద్వాంసుడు, పుత్రులు, ధనము కలవాడగును.
లగ్నాధియోగము:
లగ్నమునుండి సప్తమ, అష్టమములందు శుభగ్రహములుండి, వారికి పాపగ్రహయుతికాని, దృష్టికాని లేకయుండిన లగ్నాధియోగము.
ఈ యోగజాతకుడు సుఖవంతుడు పండితుడు అగును.
పారిజాతాది లగ్న ఫలములు:
లగ్నాధిపతి పారిజాత వర్గస్థుడైన జాతకుడు సుఖవంతుడును,
వర్గోత్తమాంశ యందున్న రోగము లేనివాడును,
గోపురాంశయందున్న ధనికుడును,
సింహసనాంశ యందున్న రాజును,
పారావతాంశయందున్న విద్వాంసుడును,
ఐరావతాంశయందు రాజవంద్యుడును,
దేవ లోకాంశయందున్న మంచి వాహనము కలవాడు అగును.
Comments
Post a Comment