చంద్ర యోగము-చంద్ర యోగ ఫలము:
చంద్ర యోగము-చంద్ర యోగ ఫలము:
రవినుండి చంద్రుడు కేంద్ర, పణఫర ఆపోక్లిమములందున్న జాతకునకు ధనము, బుద్ధి, నైపుణ్యములు, తక్కువ, మధ్యము, హెచ్చుగా నుండును. అనగా
1. చంద్రుడు రవినుండి 1, 4, 7, 10 స్థానములందున్న అల్పముగా ఉండును.
2. చంద్రుడు రవినుండి 2, 5, 8, 11 స్థానములందున్న మధ్యమముగా ఉండును.,
3. చంద్రుడు రవినుండి 3, 6, 9, 12 స్థానములందున్న ఉత్తమముగాను ఉండును.
ధనా ధన యోగములు:
పగటివేళ జననమైన, చంద్రుడు స్వాంశయందుగాని, అధిమిత్రాంశయందుగాని ఉండి, గురునిచే చూడబడిన జాతకుడు ధనసుఖము కలవాడగును.
రాత్రియందు జననమై, చంద్రుడు స్వ, అధిమిత్ర నవాంశగతుడై, శుక్రునిచే చూడబడిన జాతకుడు సుఖవంతుడు, ధనవంతుడు అగును.
దీనికి విపరీతముగా, గురుశుక్రదృష్టి లేక యున్న జాతకుడు అల్పధనుడో, నిర్ధనుడో అగును.
ఆధి యోగము:
చంద్రునినుండి 6, 7, 8 స్థానములందు శుభగ్రహములున్నచో అధియోగము.
అందు పుట్టిన జాతకుడు గ్రహబలానుసారము రాజో మంత్రియో, సేనాధిపతియో అగును.
చంద్రునినుండి వృద్ధి/ ఉపచయ స్థానములందు (3, 6, 10, 11)
1. అన్ని శుభగ్రహములు ఉన్న జాతకుడు సంపూర్ణ ధనవంతుడగును.
2. రెండు శుభగ్రహములున్న మధ్యమధనుడు,
3. ఒకశుభగ్రహమున్న అల్పధను డగును.
సునఫా అనఫా దురుధరా యోగములు:
చంద్రునినుండి ద్వితీయ, ద్వాదశ, ఉభయస్థానములందు రవికాకుండా ఇతర గ్రహములు ఉండిన, సునఫా, అనఫా, దురుధరాయోగములగును.
ఎట్లనగా
1. చంద్రునికి ద్వితీయమున రవీతరగ్రహములున్న సునఫా యోగము అగును,
2. వ్యయమున ఉన్న అనఫాయోగము అగును,
3. ఉభయరాశులందు ఉన్న దురుధరాయోగమును అగును.
సునఫా అనఫాది యోగ ఫలములు:
1. సునఫాయోగమున పుట్టినవాడు, రాజుగాని, రాజతుల్యుడుగాని అగును. బుద్ధిమంతుడు, ధనవంతుడు, ప్రసిద్ధి కలవాడు, స్వార్జితమైన ధనము కల వాడగును.
2. అనఫాయోగ జాతకుడు రాజు, రోగహీనుడు, సచ్చీలుడు, కీర్తిమంతుడు, ప్రసిద్ధుడు, సుందరుడు, సుఖియుఅగును.
3. దురుధరాయోగ జాతకుడు ధనము, వాహనము, సౌఖ్యము కలవాడు, దాత, సేవకులు కలవాడు, శత్రువులను జయించువాడగును.
కేమద్రుమ యోగము:
చంద్రుని నుండి ద్వితీయ వ్యయములందు రవీతర గ్రహమేదియు లేకపోయిన కేమద్రుమ యోగము అగును.
ఈ యోగమున పుట్టిన జాతకుడు విద్యాహీనుడు, బుద్ధిహీనుడు, దరిద్రుడు, ఆపదలు కలవాడు అగును.
కేమద్రుమ యోగము చెడ్డది. దానితో మరొకరీతిగా కలుగు రాజయోగమును భంగపడును.
యోగభంగములు:
1. లగ్నమునుండి చంద్రునినుండియు కేంద్రములందు గ్రహములున్న, ఈ యోగముండదు.
2. కేమద్రుమయోగము పట్టినా, చంద్రుడుగాని, శుక్రుడుగాని కేంద్రగతుడైయుండి, గురునిచే చూడబడిన, కేమద్రుమయోగము యోగభంగమగును.
3. చంద్రుడు శుభగ్రహయుక్తుడైనా శుభగ్రహముల మధ్యస్థుడై, గురుదృష్టుడైనాకూడ కేమద్రుమయోగము భంగమగును.
4. చంద్రుడు అధిమిత్రక్షేత్రమునగాని, ఉచ్చరాశియందుగానియున్న స్వక్షేత్రమునగాని, స్వసవాంశయందుగాని యున్నా కేమద్రుమయోగ భంగమగును.
5. గురుడు ఆచంద్రుని చూచుచున్నను; కేమద్రుమయోగ భంగమగును.
ఇట్లు కేమద్రుమయోగము చెప్పునపుడు ఆ యోగభంగమునుకూడ పరికించి చెప్పవలెను.
చంద్రయోగము:
చంద్రయోగము తక్కిన యోగములన్నిటిని కాదని, విశేషముగా తనఫలము నియ్యగలదని తెలియదగినది.
రవి యోగములు:
బేశి, బోశి, ఉభయచర యోగములు
1. రవినుండి ద్వితీయమున చంద్రుడు తప్ప కుజాదిగ్రహములున్న బేశియోగము.
2. ద్వాదశయోగమున ఉన్న బోశియోగము. కొందరు దీనిని వాశి యోగమనిరి.
3. ఉభయములందు ఉన్న ఉభయచర యోగము.
బేశి బోశి ఉభయచర యోగములు phalitamulu:
1. బేశియోగజాతకుడు సత్యవాది, బద్ధకస్తుడు, సమదర్శి, సుఖి, స్వల్పధనుడు, పొడవైనవాడు అగును.
2. బోశియోగజాతుడు సమర్థుడు, దాత, బలవంతుడు, విద్వాంసుడు, కీర్తిమంతుడు అగును.
3. ఉభయచరజాతుడు సుఖముకలిగి రాజో, రాజసముడో అగును.
4. ఆబేశి, బోశులు ఉభయచరములును సద్గ్రహములచే ఏర్పడినవైన అనగా రవికి ఇటు అటు శుభగ్రహములున్న పైన చెప్పినఫలములు. పాప గ్రహములున్న దీనికి విపరీతముగా పాపఫలితములు చెప్పవలెను.
Comments
Post a Comment