రాజయోగా ధ్యాయము

 రాజయోగా ధ్యాయము

రాజ యోగములు :

ఏవి తెలిపినందున వ్యక్తి రాజపూజ్యుడగునో అట్టి రాజయోగములనుపూర్వము పరమశివుడు పార్వతికి చెప్పిన రాజయోగముసారము చెప్పబడుచున్నది. 

కారకాంశము, జన్మలగ్నము, రెండిటినుండి రాజయోగకారక స్పుటగ్రహములనుబట్టి యోగవిచారణ చేయవలెను. ఆత్మకారక పుత్రకారకులవలన ఒకటి, లగ్న పంచమాధిపతులవలన రెండు, యోగములు కలుగును. వీరి పరస్పర సంబంధము బలానుసారముగా పూర్ణ, అర్థ, పాద, యోగము కలుగును.


మహరాజయోగము:

1. లగ్నాధిపతి పంచమమున, పంచమాధిపతి లగ్నమున ఉండుట, ఆత్మకారక పుత్రకారక గ్రహములు లగ్న, పంచమ, స్వ క్షేత్ర, నవాంశ, ఉచ్చరాశులందుండుట; శుభగ్రహములచే చూడబడుట మహరాజయోగము. 

2. దీనిలో పుట్టిన జాతకుడు ప్రసిద్ధుడు, సుఖవంతుడు అగును. 

3. భాగ్యాధిపతి, ఆత్మకారకగ్రహము, లగ్న, పంచమ, సప్తమములందుండి శుభగ్రహ దృష్టిఉన్న  రాజయోగ కారకులగుదురు. 

4. కారకునినుండి కాని, లగ్నాధిపతినుండికాని 2, 4, 5 స్థానములందు శుభగ్రహములున్న తప్పక మహారాజగును. 

5. కారకునినుండి కాని, లగ్నాధిపతినుండికాని 3, 6స్థానములందు కేవల పాపగ్రహములున్నా చూచినా, రాజగును. శుభపాపమిశ్ర దృష్టియున్న ధనవంతుడగును. 

 కారకాంశయందుగాని, దానికి పంచమమందుగాని ఉన్న  శుక్రునికి గురుచంద్రుల సంబంధమున్న రాజవర్గీయుడగును.


రాజవర్గీయుడu:

1) లగ్నమందుగాని, లగ్నపదమందుగాని ఉన్న  శుక్రునికి గురుచంద్ర సంబంధమున్నా, జాతకుడు రాజవర్గీయుడగును. 

2) జన్మలగ్న. హోరాలగ్న, ఘటీ లగ్నములలో ఏ ఒకదానిపైనైనా, ఏ ఒక్క గ్రహదృష్టి ఉన్న  పై మూడు యోగములందును రాజగును.

3) లగ్న షడ్వర్గు (లగ్న, హోరా, ద్రేక్కాణ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఒకే గ్రహముతో కూడినా, చూడబడినా, రాజయోగము. 

ఆ రాజయోగము దృష్ట్యనుసారము ఫలమిచ్చును. 

1. పూర్ణదృష్టియున్న పూర్ణఫలము, 

2. అర్ధదృష్టియున్న అర్ధఫలము, 

3. పాదదృష్టియున్న పాదఫలమునిచ్చును.



1) లగ్నత్రయమందు (జన్మ లగ్నము, హోరాలగ్నము, ఘటికాలగ్నము) స్వక్షేత్ర, ఉచ్చస్థగ్రహమున్న రాజగును.

2) లేదా లగ్న లగ్నద్రేక్కాణ నవాంశలందు మూడిటియందు ఉన్న , జాతకుడు రాజగును. 

3) లగ్నపదమును సచంద్ర శుభగ్రహయుతమైన, ధనస్థానమున గురుడున్న, దానిమీదికి ఉచ్చస్థ గ్రహ దృష్టియున్న నిజముగా రాజగును. 

4) లగ్నము, ధనము, చతుర్థము, శుభగ్రహయుక్తమై, తృతీయము పాపగ్రహ క్రాంతమైన జాతకుడు రాజుగాని, రాజసముడుగాని అగును. 

5) ఉచ్చస్థుడైన చంద్ర, గురు, శుక్ర, బుధులలో ఒకడు ధనస్థానమునున్న జాతకుడు ధనవంతుడగును. 

6) నీచస్థులైన గ్రహములు షష్ఠ, అష్టమ, తృతీయమందున్న, లగ్నాధిపతి స్వక్షేత్ర ఉచ్చయందుండి లగ్నమును చూచిన రాజయోగము. 

7) 6, 8, 12 అధిపతులు అస్తంగతులు, నీచగతులు, శత్రుస్థానగతులునై లగ్నాధిపతి స్వ, ఉచ్చస్థితుడై లగ్నమును చూచిన రాజయోగము. 

8) రాజ్యాధిపతి (10) స్వ, ఉచ్చస్తుడై, లగ్నమును చూచిన, శుభగ్రహములు కేంద్రములందుండినా రాజ్యమును ఇస్తారు.

9) ఆత్మకారకగ్రహము శుభరాశి లేక శుభనవాంశయందున్న జాతకుడు ధనవంతుడగును. 

10) కారకాంశనుండి కేంద్రమున శుభగ్రహమున్న జాతకుడు రాజగును. 

11) లగ్నపదము, జయాపదము పరస్పర కేంద్రములందున్న, తృతీయే కాదశములందు పంచమ నవమములందుగాని యున్న జాతకుడు రాజగును. 

12) భావ, హోరా, ఘటికా లగ్నములలో రెంటినిగాని, మూడిటినిగాని ఉచ్చస్థగ్రహము చూచిన జాతకుడు రాజగును. 

13) ఆ మూడు లగ్నముల రాశి, ద్రేక్కాణ, నవాంశలనుగాని, లేదా రాశి నవాంశలనుగాని, రాశిద్రేక్కాణములనుగాని, లగ్నరాశినిగాని ఉచ్చస్థగ్రహము చూచిన రాజగును.  

14) లగ్నపదము ఉచ్చస్థుడైన ఏ గ్రహములోగాని, చంద్రునితో గాని, గురుశుక్రులతో గాని కూడిన దుష్టగ్రహార్గల లేకున్న రాజయోగము. 

15) శుభగ్రహయుక్తమైన లగ్న పదమున చంద్రుడుండి, ద్వితీయమున గురుడున్నను రాజయోగము.

16) 6, 8, 12 అధిపతులు నీచస్థితులై లగ్నమును చూచిన రాజయోగము చేయుదురు. 

17) 4, 10, 2, 11 అధిపతులు లగ్నమును చూచుచున్న, లగ్నపదము శుభగ్రహయుక్తమైన, పదమునకు లాభమున శుక్రసంబంధమున్నా, రాజుగాని, రాజతుల్యుడు గాని అగును. 

18) 6, 8, 3, 11 లందున్నగ్రహము నీచస్థుడై లగ్నమును చూచినా, లేక లగ్ననవాంశరాశినుండి కేంద్రమున శుభగ్రహమున్నా జాతకుడు నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాజగును.


గ్రహముల స్థానవిశేషమువలన, దృష్ట్యనుసారముగాను వచ్చు రాజయోగములు:

1. నవమాధిపతి మంత్రి, పంచమాధిపతి ముఖ్యమంత్రి, ఇద్దరికి పరస్పరము దృష్టిఉన్న  జాతకుడు రాజ్యాధికారి యగును. 

2. వారిద్దరును ఎక్కడైనా ఒకేచోట ఉన్న , పరస్పర సప్తమములందున్నా, రాజవంశోత్పన్న బాలకుడు రాజై తీరును. 

3. చతుర్థాధిపతి దృష్టి వారిపైనున్నా జాతకుడు రాజగును. 

4. 5, 10, 4, 9, 1 అధిపతులు కలిసియున్న జాతకుడు ప్రసిద్ధుడైన రాజగును 

5. చతుర్ధ, దశమాధిపతులు పంచమ, నవమాధిపతులతో కూడి 1, 4, 10 స్థానములందున్న జాతకుడు రాజగును. 

6. శుక్రునితో కూడిన గురుడు స్వక్షేత్రమైన నవమమందున్న, పంచమాధిపతితో కలిసినా జాతకుడు రాజగును.

7. మధ్యాహ్నము, అర్ధరాత్రి తర్వాత రెండున్నర గడియలు శుభసమయము. ఆ సమయమున పుట్టినవాడు రాజుగాని, రాజసముడుగాని అగును.

8. 3, 11లందున్న చంద్ర శుక్రులు పరస్పరము చూచుకొన్నను, లేదా ఎక్కడున్నను పరస్పరదృష్టి కల్గియున్న రాజయోగము చేయుదురు, (తృతీయైకాదశములందున్నప్పుడు రాశి దృష్టివశాత్తు పరస్పరము చూడవలెను.) 

9. చంద్రుడు వర్గోత్తమ నవాంశలో ఉండి, నాలుగైదు గ్రహములచే చూడబడిన రాజయోగము. లగ్నము వర్గోత్తమ నవాంశమై, చంద్రుడు కాక మూడింటికి ఎక్కువైన గ్రహములచే చూడబడినా జాతకుడు తప్పక రాజగును.

10. జన్మకాలమున మూడింటికి తక్కువైనా, రెండైనా గ్రహములు ఉచ్చయందున్న రాజవంశ్యుడు రాజును, అన్యవంశ్యుడు, ధనాదులలో రాజసముడు అగును. 

11. స్వక్షేత్ర, ఉచ్చ, కోణస్థులైన నాలుగైదు గ్రహముల వలన  అన్యజుడైనా రాజగును. 

12. ఆరు గ్రహములు ఉచ్చయందున్న జాతకుడు చక్రవర్తి అగును. ఇట్లు వివిధములైన రాజయోగములను పెద్దలు చెప్పినారు. 

13. బుధుడుగాని, గురుడుగాని, శుక్రుడుగాని ఉచ్చస్థుడై శుభగ్రహయుక్తుడై కేంద్రమందున్న రాజుగాని, రాజసముడుగాని అగును. 

14. శుభగ్రహములన్నియు కేంద్రములందును, పాపగ్రహములన్నియు 3, 6, 11 లందును ఉన్న  నరుడు దుష్కలమందు పుట్టినా రాజగును.


రాజాశ్రయయోగములు:

1. జన్మలగ్నమునుండి రాజ్యాధిపతి అమాత్యకారకునిచే గాని, అమాత్యకారకుడున్న రాశ్యధిపతిచేగాని కూడినా, చూడబడినా, రాజభవనమున ప్రధానుడగును. 

2. లాభము లగ్నాధిపతిచే చూడబడి పాపసంబంధము లేకున్నరాజాలయమున స్వకులమందున ప్రధానుడగును. 

3. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు కలిసిన జాతకుడు సూక్ష్మ బుద్ధియు, రాజమండ్రియుఅగును. 

4. అమాత్యకారకగ్రహము బలవంతుడై, శుభగ్రహముతో కూడియుండి, స్వక్షేత్రమునగాని, ఉచ్చయందుగాని ఉన్న  మంత్రి యగును. 

5. అమాత్యకారకుడు లగ్న, పంచమ నవమముల నుండిన జాతకుడు ప్రఖ్యాతుడు మంత్రి యగును. 

6. అమాత్యకారకుడు ఆత్మ కారకునికి కేంద్రకోణములందున్న జాతకుడు సుఖి, ఎప్పుడు రాజకృపకు ప్రాతుడు అగును. 

7. రాజాశ్రయము కలవాడుఅగును. ఆత్మ కారకునినుండిగాని, లగ్నము నుండిగాని, ఆరూఢ లగ్నమునుండి కాని తృతీయ, షష్ఠములందు పాపగ్రహములన్నియు ఉండగా పుట్టినవాడు సేనాపతి యగును. 

8. ఆత్మకారకుడు స్వక్షేత్రము, ఉచ్చయైన కేంద్రకోణములందుండి, నవమాధిపతితో కూడిన, లేదా చూడబడిన నరుడు మంత్రి యగును. 

9. ఆత్మకారకుడు చంద్ర లగ్నాధిపతియై లగ్నమునుండి, శుభగ్రహయుతుడైన జాతకుడు వార్ధక్యమున మంత్రియగును. మంత్రిత్వమున కిది ముఖ్యయోగము.

10. శుభగ్రహయుక్తుడైన ఆత్మకారకగ్రహము పంచమ, సప్తమ, నవమ, దశమములందున్న రాజాశ్రయమువలన ధనాగమముండును. 

11. ఆత్మ కారకుడు నవమ భావమున, లేదా భాగ్యపదమున, లగ్నమున ఉండిన జాతకుడు రాజసంబంధము కలవాడగును. 

12. లగ్నాధిపతి లాభస్థుడై పాపగ్రహ సంబంధము లేకున్న, ఆత్మకారకగ్రహము శుభగ్రహయుక్తమైన రాజభవనమున ధనలాభము చెప్పవలెను.

13. దశమాధిపతి లగ్నమున లగ్నాధిపతి దశమమున ఉన్న  విశేషముగా రాజ సంబంధము కలుగజేయు యోగము. 

14. ఆత్మకారకునకి చతుర్థమున చంద్ర శుక్రులున్న జాతకుడు రాజచిహ్నములు కలవాడై, రాజసమమైన సుఖము కలవాడగును. 

15. లగ్నాధిపతి లేదా ఆత్మకారకుడు పంచమాధిపతితోకూడి కేంద్రకోణములందున్న జాతకుడు రాజునకు మిత్రుడగును.


రాజయోగము, రాజాశ్రయ యోగము రెండు వేరు. 

 రెండింటిని విడివిడిగా  అర్థం చేసుకోవాలి. 

జాతక పరిశీలనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Comments

Popular posts from this blog

Vaidhavya yoga (widowhood) Recognition

Recognition of Vericose veins in a horoscope

Apamrutyu Dosha Recognition