ధన యోగములు:
ధన యోగములు:
ఏ యోగమున పుట్టినవాడు నిస్సంశయముగా ధనవంతుడగునో అట్టి ధనయోగమును చెప్పుచున్నారు.
1. పంచమము శుక్రక్షేత్రములైన వృషభ, తులలో శుక్రుడుండి, లాభమున బుధుడుండి, లాభము చంద్ర కుజగురులతో కూడియున్న బహువిత్తవంతు డగును.
2. పంచమము రవిక్షేత్రమై (సింహము) రవి అక్కడుండి, లాభమందు శని చంద్రగురులున్న మహాధనికుడగును.
3. శనిక్షేత్రములైన మకర, కుంభము లందు శని యుండి, లాభమున రవిచంద్రులున్న ధనవంతుడగును.
4. పంచమము గురుక్షేత్రములైన ధనుర్మీనములందు గురువుండి, లాభమున బుధుడున్న ధనవంతుడగును.
5. పంచమము కుజక్షేత్రములైన మేష వృశ్చికములలో కుజుడు ఉండి, లాభమున శుక్రుడున్నచో ధనవంతుడగును.
6. పంచమము కర్కాటకమై చంద్రుడుండి, లాభమున శనియున్న ధనికుడగును.
7. సింహము లగ్నమై అందు రవియుండి, కుజగురు సంబంధమున్న ధనవంతుడగును. కర్కాటకము లగ్నమై అందు చంద్రుడుండి, బుధగురులతో కూడినా, చూడబడినా ధనవంతుడగును.
8. కుజక్షేత్రములైన మేష వృశ్చికములు లగ్నమై అందుకుజుడుండి, బుధ రవిశుక్రుల సంబంధమున్న శ్రీమంతుడగును.
9. కన్యామిథునములు లగ్నమై, బుధుడుండి, శనిగురుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును.
10. ధనుర్మీనములు లగ్నమైఅందు గురువుండి, బుధకుజుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును.
11. తులావృషభములు లగ్నమై, శుక్రుడుండి, శని బుధుల సంబంధమున్న ధనవంతుడగును. మకర కుంభములు లగ్నమై, అక్కడ శనియుండి, కుజ గురు సంబంధమున్న జాతకుడు ధనవంతుడగును. (కలిసిఉండుట, చూచుట ఈ రెంటిని సంబంధ మందురు.)
1. పంచమ నవమాధిపతులు విశేషముగా ధనము నిచ్చువారు.
2. వారితో కలిసి యున్న గ్రహములుకూడ తమతమ దశలలో ధనప్రదులగుదురు.
శుభాశుభగ్రహముల యొక్క సంయోగమువలన కలిగిన బలాబలములను విచారణ చేసియే దైవజ్ఞులు ఫలము చెప్పవలెను.
పారిజాతాంశాది కేంద్రాధిపతి ఫలములు:
1) కేంద్రాధిపతి పారిజాతాంశయందున్న జాతకుడు దాత యగును.
2) ఉత్తమాంశయందున్న విశేషదాతయగును.
3) గోపురాంశగతుడైన పౌరుషము కలవాడగును.
4) సింహాసనాంశయందున్న జనపూజితుడగును.
5) పారావతాంశయందున్న శూరుడగును.
6) దేవలోకాంశయందున్న సభావతియగును.
7) ద్వితీయగతుడైన బ్రహ్మలోకగతుడు, మునియగును.
8) ఐరావతాంశయందున్న సర్వదా సంతుష్టుడు అగును.
పారిజాతాంశాది పంచమాధి ఫలములు:
1. పంచమాధిపతి పారిజాతాంశగతుడైన కులోచితవిద్య కలుగును.
2. ఉత్తమాంశగతుడైన ఉత్తమవిద్య కలుగును.
3. గోపురాంశయందున్న ప్రపంచఖ్యాతి కలుగును.
4. సింహాసనాంశయందున్న మంత్రిత్వము కలుగును.
5. దేవలోకాంశయందున్న కర్మయోగము కలుగును.
6. బ్రహ్మలోకాంశయందున్న దేవోపాసన కలుగును.
7. ఐరావతాంశయందున్న ఈశ్వరభక్తియు కలుగును.
పారిజాతాంశాది భాగ్యాది ఫలములు:
1. భాగ్యాధిపతి పారిజాతాంశయందున్న ఈ జన్మలో తీర్థయాత్రలు చేయును. ఉత్తమాంశగతుడైన పూర్వజన్మలో తీర్ధయాత్రలు చేసినవాడు;
2. గోపురాంశలో యాగకర్త, పూర్వజన్మలోను,ఈ జన్మలోకూడ యాగకర్త అగును.
3. సింహాసనాంశలో వీరుడు, సత్యవాది, జితేంద్రియుడు, సర్వధర్మ పరిత్యాగి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించినవాడగును.
4. పారావతాంశలో ఈ జన్మలో పరమహంసుడగును.
5. దేవలోకాంశలో బాల్యమునుండి, త్రిదండిగాని, దండిగాని అగును.
6. బ్రహ్మలోకాంశలో అశ్వమేధము చేసి ఇంద్రపదవి నందును.
7. ఐరావతాంశలో స్వయముగా ధర్మావతారమే. శ్రీరామ, ధర్మరాజాదితుల్యుడగును.
యోగకారక గ్రహ ఫలములు:
1) కేంద్రము (1, 4, 7, 10) విష్ణుస్థానము;
2) త్రికోణము (1, 5, 9) లక్ష్మీ స్థానము,
3) ఈ రెండు స్థానముల అధిపతుల యొక్క సంబంధము మనుష్యులకు రాజయోగకారకము.
4) కేంద్రాధిపతి, కోణాధిపతులు పారిజాతాంశయందున్న జాతకుడు లోకానురంజకుడైన రాజగును.
5) ఉత్తమాంశయందున్న గజాశ్వ రథాది వాహనయుక్తుడైన ఉత్తమ రాజగును. గోపురాంశయందున్న రాజవందితుడైన రాజశ్రేష్ఠుడగును.
6) సింహాసనాంశయందున్న చక్రవర్తి యగును. ఈ యోగముననే హరిశ్చంద్రుడు, ఉత్తముడను మనువు, బలి, వైశ్వానరుడు ఇంకా చక్రవర్తులెందరో జన్మించిరి.
7) వర్తమానయుగములో, కుంతీపుత్రుడైన ధర్మరాజు, పరాశరులు ద్వాపరయుగమున ఈశాస్త్రముచెప్పినాడని పై శ్లోకం తెలియజేయుచున్నది.
8) భవిష్యత్తులో శాలివాహనుడు జన్మింతురు,
9) ఇట్లే మనువు మొదలైనవారు పారావతాంశలోను,
10) విష్ణువుయొక్క అవతారములు దేవలోకాంశయందు,
11) బ్రహ్మాది లోకపాలురు బ్రహ్మలోకాంశయందును,
12) స్వాయంభువ మనువు ఐరావతాంశయందును ఉద్భవించిరి.
దారిద్ర్య యోగములు:
1. లగ్నాధిపతి వ్యయమందుండి, వ్యయాధిపతి లగ్నమందుండి, మారకాధిపతి (2, 7) సంబంధమున్న జాతకుడు నిర్ధనుడగును.
2. లగ్నాధిపతి షష్ఠమందుండి, షష్ఠాధిపతి లగ్నమందున్న, మారకాధిసంబంధమున్న నిర్ధనుడగును.
3. లగ్నము, చంద్రుడు కేతువులతో కూడి, లగ్నాధిపతి అష్టమగతుడై, మారకాధిప సంబంధమున్న నరుడు నిర్ధనుడగును.
4. లగ్నాధిపతి 6, 8, 12న ఉండి, పాపగ్రహయుక్తుడై, ధనాధిపతి షష్ఠమందున్న రాజవంశీయుడైనా, నిర్ధనుడగును.
5. లగ్నాధిపతి త్రిక (6, 8, 12) నాథునితో కూడి, పాపగ్రహదృష్టుడైనా, లేదా శనితోకూడి శుభగ్రహ దృష్టిలేక పోయినా నిర్ధనుడగును.
6. పంచమ నవమాధిపతులు క్రమముగా షష్ఠ, వ్యయములందుండి, మారకాధిపునిచే చూడబడిన నిర్ధనుడగును.
7. నవమ, దశమాధిపతులు తప్ప, పాపగ్రహము లగ్నమందుండి, మారకాధిప సంబంధమున్న నిర్ధనుడగును.
8. త్రికాధిపతులున్న రాశ్యధిపతులు త్రికమున ఉండి పాపసంబంధమున్న నిర్ధను డగును.
9. చంద్రుడున్న నవాంశాధిపతి మారకాధిపయుతుడైనా, మారకస్థానమందున్నా నిర్ధనుడగును. లగ్నాధిపతి, లగ్నాధిపుడున్న నవాంశాధిపతి 6, 8, 12 లలో ఉండి, మారకాధిప సంబంధమున్న నిర్ధనుడగును.
10. పాపగ్రహములు శుభస్థానములందుండి, శుభులు పాపస్థానములందున్న జాతకుడు భోజనమునకు బాధపడునంత దరిద్రుడగును.
11. త్రికాధిపతితో కూడిన గ్రహములు కోణాధిప దృష్టిలేకున్నయెడల వారిదశయందు ధననాశము కలుగజేయుదురు.
12. లగ్నమునకు గాని కారకునికి గాని అష్టమమున, వ్యయమున ఆత్మకారక, లగ్నాధిప దృష్టియున్న నిర్ధనుడగును.
13. ధనభావమున శనికుజులున్న ధననాశకులు.
14. వారికి బుధదృష్టియున్న మహాధనుని చేయుదురు.
15. ధనస్థానమున ఉన్నరవికి శని దృష్టిఉన్న దరిద్రుడగును.
16. శనిదృష్టి లేకున్న ప్రసిద్ధుడైన ధనవంతుడగును.
17. ఇట్లు ధనస్థానమున ఉన్నశనికి రవిదృష్టి యున్నను ధనవంతుని చేయునని తెలియునది.
Comments
Post a Comment