ఆయుర్దాయాధ్యాయము :
ఆయుర్దాయాధ్యాయము :
నరుల ఆయుర్దాయ జ్ఞానము దేవతల కైనా దుర్లభమైనది. అనేక మునులు అనేక విధములుగా చెప్పిన ఆయుర్దాయ సారము.
రవ్యాది గ్రహములు తమతమ ఉచ్చ నీచాదిరాశివశమున ఆయుర్దాయము నిస్తారు.
పిండాయుర్దాయము:
అశ్విన్యాది నక్షత్రములు, మేషాదిరాశుల బలానుసారముగా
1. రవ్యాదిగ్రహములు తమతమ ఉచ్చరాశులందున్నప్పుడు క్రమముగా రవి19, చంద్ర25, కుజ15, బుధ12, గురు15, శుక్ర21, శని20 సంవత్సరములు.
2. నీచలో ఉన్నపుడు అందులో సగమును,
3. మధ్యలో నున్నపుడు అనుపాత ప్రకారమును ఆయుర్దాయము నెరుగవలెను.
4. ఏ గ్రహముయొక్క ఆయుః ప్రమాణము తెలియవలెనో దాని రాశ్యాదిలో ఉచ్చరాశ్యాదిని తీసివేసి, మిగిలిన రాశ్యాదిని పైన పిండాయువుచే గుణించగా వికలవరకు రాశ్యాదిని సవర్ణముచేసిన ఆగ్రహముయొక్క భగణాదిగా వర్షాది ఆయుర్దాయమువచ్చును.
5. ఉచ్చరశ్యాదినుండి తీసివేసినపుడు శేషము ఆరు రాశులకన్నా తక్కువయైన పన్నెండురాశులనుండి తీసివేయవలెను.
సంస్కార విశేషము:
1. అస్తంగత గ్రహమునకు వచ్చిన ఆయువులో సగము తీసివేయవలెను.
2. శని శుక్రులు అస్తంగతులైనా, తీసివేయనక్కరలేదు.
3. శత్రుక్షేత్రవర్తియైన, మూడవవంతు తీసివేయవలెను.
4. వక్రించిన గ్రహమునకు తీయనక్కరలేదు.
ఆయుఃప్రమాణ నిర్ణయము:
1. వ్యయభావమునుండి విలోమముగా పాపగ్రహము పూర్ణ, అర్ధ తృతీయాంశ, నాల్గవభాగము, పంచమాంశ, షష్ఠాంశ, తన ఆయుఃప్రమాణమునుండి కోల్పోవును అనగా ద్వాదశమున ఉన్న పాపగ్రహము పూర్తిగాను తగ్గించవలెను.
2. ఏకాదశమున 1/2; దశమమున 1/3; నవమమున 1/4; అష్టమమున 1/5; సప్తమమున 1/6. పాపగ్రహములో తగ్గించవలెను.
3. శుభగ్రహమునకు దానిలో సగము తగ్గించవలెను. ద్వాదశమున 1/2; ఏకాదశమున 1/4; దశమమున 1/6; నవమమున 1/8; అష్టమమున 1/10; సప్తమమున 1/12 తగ్గించవలెను.
4. ఒకే రాశిలో చాల గ్రహములు (శుభపాపగ్రహములు) ఉన్న , వానిలో బలవత్తరుడైన ఒక గ్రహము ఇచ్చు ఆయువులోనే తగ్గించవలెను. అందరిని తీయరాదు.
5. ఈ విషయమున క్షీణచంద్రుడు పాపి కాడు.
సపాపలగ్న విశేషము:
1. లగ్నమున రవికుజశనుల (పాపులెవరైనా ) ఉన్న లగ్నాంశకలలను గ్రహాయువుతో గుణించి, చక్రలిప్తల(21600)చే భాగించి, లబ్దవర్షాదిని, పూర్వము వచ్చిన గ్రహాయుర్దాయము నుండి తీసివేయవలెను. మిగిలినది స్పుటాయుః ప్రమాణము.
2. లగ్నమునకు శుభగ్రహ దృష్టిఉన్న పూర్వము తీసివేయవలెనన్న దానిలో సగము మాత్రమే తీసివేయవలెను.
లగ్నాయుర్దాయము:
1. కొందరు ఆచార్యులు లగ్న రాశ్యాదిలో మేషాదిగా ఎన్నిరాశులు గతించెనో అన్ని సంవత్సరములు, భాగలు (అంశాదికము) అనుపాతముద్వారా మాసములు వగైరా తెలిసికొని రెండును కలిపిన లగ్నమగునని చెప్పిరి.
2. కాని నిజమునకు లగ్న రాశ్యధిపతి బలవంతుడైన రాశితో సమమైన, లగ్ననవాంశాధిపతి బలవంతుడైన నవాంశతో సమమైన సంవత్సరములుగా తెలియవలెను.
3. రాశి నవాంశలు రెండును ప్రబలములైన రెండిటివలన వచ్చిన ఆయుర్దాయములు కలిపి లగ్నాయుర్దాయముగా చెప్పవలెను.
నిసర్గాయుర్దాయము:
జన్మమునుండి
1. చంద్రునికి 1సం,
2. కుజునికి 2సంలు,
3. బుధునికి 9సంలు,
4. శుక్రునికి 20 సంలు,
5. గురునికి 18సంలు,
6. రవికి 20సంలు,
7. శనికి 50సంలు ఆయుర్దాయమగును. ఇది నైసర్గికదశా ప్రమాణముగా నెరుగునది.
అంశాయుర్దాయము:
1. లగ్నములయొక్క గ్రహములయొక్క అంశాయుర్దాయమును చెప్పబడుచున్నది.
2. గ్రహము రాశి నవాంశ సమమైన సంవత్సరము నిచ్చును.
3. గ్రహము రాశిలో ఎన్నవ నవాంశలో నున్నదో అన్ని సంవత్సరము లాయుర్దాయము నిచ్చును. రాశ్యాదిగ్రహమును 108 తో గుణించి, సవర్ణముచేసి, 12కన్న ఎక్కువగా ఉన్న 12చే భాగించిన భగణాది వచ్చును. దానితో సమమగు సంవత్సరములు ఆయుర్దాయముగా తెలియవలెను. పిండాయుస్సులో ఉన్న ట్లే హ్రాస మిక్కడను చేయదగినది.
4. పిండాయువులో హ్రాసమెట్లనగా అస్తంగతునికి 1/2, శత్రుగృహవర్తికి 1/3, ఇట్లు చెప్పబడినదికదా; కొందురు పండితులిక్కడ ఒక విశేషమును చెప్పుచున్నారు.
5. గ్రహము స్వక్షేత్రమందున్నా, ఉచ్చయందున్నా త్రిగుణము (మూడు రెట్లు) స్వనవాంశ, స్వద్రేక్కాణమందున్న రెట్టింపు (ద్విగుణము) చేయవలెనని; ఒకే గ్రహమునకు రెండును పట్టిన అనగా ఒకే గ్రహము ఉచ్చయందుండి, స్వనవాంశయందును ఉన్న , త్రిగుణితము మాత్రమే చేయవలెను.
6. అదేవిధముగా 1/3, 1/2 రెండును వచ్చిన హెచ్చు1/2) 2) హ్రాసముమూత్రమే చేయవలెను. ఇది స్పష్ట వర్షాది మనుష్యులకు ఆయుర్దాయము.
7. తక్కిన జంతువులకు ఇట్లే ఆయుస్సాధనచేసి, వాటివాటి పరమాయుః ప్రమాణముతో గుణించి, మనుష్య పరమాయుః ప్రమాణముతో భాగించగా వచ్చిన లబ్ధము వర్షాది ఆయా జంతువులదిగా తెలియవలెను.
జంతువుల పరమాయుః ప్రమాణము:
నానా జాతీయ జంతువులకు పరమాయుః ప్రమాణము చెప్పబడుచున్నది.
1. దేవతలకు ఋషులకును అపరితమైన ఆయువు.
2. చిలుకలు, కాకులు, గ్రద్దలు, గుడ్లగూబలు, సర్పములకు వెయ్యేళ్ళు;
3. కప్పలు ఎలుగుబంటి, డైగలు, కోతులకు 300 ఏళ్ళు,
4. రాక్షసులకు 150 ఏళ్ళు;
5. మనుష్యులకు, ఏనుగులకును 120 ఏళ్ళు;
6. ఒంటెలు, గాడిదలకు 25ఏళ్ళు,
7. గుర్రముకు 32 ఏళ్ళు;
8. ఎద్దులకు, దున్నపోతులకు 24 ఏళ్ళు,
9. నెమళ్ళకు 20 ఏళ్ళు,
10. మేకలకు 16ఏళ్ళు;
11. హంసలకు 14 ఏళ్ళు,
12. కోకిలలకు, కుక్కలకు, పావురములకును 12 ఏళ్ళు,
13. కోళ్ళకు 8 ఏళ్ళు,
14. బుద్బుదాదిమున్నగు పక్షులకు ఏడైళ్ళు. పరమాయుః ప్రమాణమని తెలియదగినది.
ఈ చెప్పిన మూడు రకముల ఆయుర్దాయములలో ఏది ఎప్పుడు గ్రహింపదగినదను విషయము చెప్పబడుచున్నది.
1. లగ్నాధిపతి, రవి, చంద్రుడు ఈ ముగ్గురిలో లగ్నాధిపతి బలవంతుడై శుభగ్రహములచే చూడబడిన, అంశాయువును;
2. రవి బలవంతుడైన పిండాయువును,
3. చంద్రుడు బలవంతుడైన నిసర్గాయువును గైకొనవలెను.
4. ఇద్దరు సమబలవంతులైన ఇద్దరి ఆయువును కలిపి సగము చేయవలెను.
5. ముగ్గురికి బలసామ్యమున్న మూడును కలిపి, దానిలో మూడవవంతు చేసి గ్రహించవలెను.
వేరొకరీతిన ఆయుర్దాయ సాధనము.
కొందరు లగ్న, అష్టమాధిపతి, శని, చంద్రుడు, లగ్నము హోరాలగ్నమువీటిద్వారా ఆయుస్సాధనము చెప్పిరి.
1. లగ్నాధిపతి, అష్టమాధిపతులతో మొదటి యోగము;
2. శని చంద్రులతో రెండవయోగము,
3. లగ్న, హోరాలగ్నములతో మూడవ యోగము.
4. ఇద్దరును చరరాశియందున్న దీర్ఘాయువు,
5. ఒకరు స్థిరము, ఒకరు ద్విభావము అయినా, దీర్ఘాయువే.
6. ఒకరు చరము, ఒకరు స్థిరము అయిన మధ్యాయువు;
7. ఇద్దరు ద్విస్వభావమైనా మధ్యాయువే;
8. చర ద్విస్వభావములందున్నా, లేక ఇద్దరును స్థిరరాశియందున్నా నిస్సందేహముగా అల్పాయువు; రెండింటివలన వచ్చిన లేదా మూడు విధాల వచ్చిన ఆయువు గ్రాహ్యము.
9. మూడింటిలోను మూడు రకాల వచ్చిన, లగ్న హోరాలగ్నముల వచ్చినదే గ్రహింపదగినది.
10. అట్టి పరిస్థితిలో చంద్రుడు లగ్నమందుగాని, సప్తమమందుకాని ఉన్న , రెండవ యోగమును గ్రహింపదగినదే.
11. హ్రాసవృద్దులు వెనుకటివలెనే చేయదగినవి.
దీర్ఘ, మధ్య, అల్పాయువుల భేదములు:
దీర్ఘాయువు మూడు విధములు:
1. మూడు విధములుగా వచ్చిన దీర్ఘాయువు 120సం.
2. రెండురీతుల వచ్చినది 108 సం.
3. ఒక్కరీతిగానైన 96 సం. అని దీర్ఘాయు తెలియదగినది.
మధ్యాయువు మూడు విధములు:
1. మధ్యాయువు 80 ఏళ్ళు,
2. రెండు ప్రకారములనైన 72 ఏళ్ళు,
3. ఒక్కరీతిగానైన 64 ఏళ్ళున్ను గ్రాహ్యము
అల్పాయువు మూడు విధములు:
1. అల్పాయువు మూడు ప్రకారముల 32 ఏళ్ళు,
2. రెండురీతుల 36 ఏళ్ళున్ను,
3. ఒక్కవిధమున 40న్నీ అగును.
ఈ రీతిగా వచ్చిన ఆయువులో 40,36,32 ఖండములగును. దీనిద్వారా స్పష్ట ఆయుస్సాధన చేయదగినది.
దీర్ఘాయుః ఏకయోగే 96, యోగద్వయే 108, యోగత్రయే 120,
మధ్యాయుః ఏకయోగే 64 యోగద్వయే 72 యోగత్రయే 80,
అల్పాయుః యోగత్రయే 32 యోగద్వయే 36 ఏకయోగే 40
ఖండాని 32 36 40
స్పష్టమైన ఆయువు నిర్ధారణ:
1. యోగకారకగ్రహము రాశ్యాదిగతుడైన పైన చెప్పిన పూర్ణాయువు.
2. రాశ్యన్తగతుడైన ఖండతుల్యముగా తగ్గింపును
3. మధ్యన ఉన్న అనుపాతము ప్రకారమున్ను ఆయువుండును.
4. యోగకారక గ్రహముల అంశలనుకూడి వాటిని, యోగకారకగ్రహ సంఖ్యచే భాగించవలెను. లబ్దమైన అంశాదిని ఖండముతో గుణించి, 30చే భాగించిన లబ్దము వర్షాదిని దీర్ఘాయురాది సంఖ్యనుండి తీసివేసిన స్పష్టఆయువు వచ్చును.
విశేషము:
1. శని యోగకారకుడైన కక్ష్యాహ్రాస ముండును. కాని కొందరాచార్యులు శని యోగకారకుడైనప్పుడు వృద్ధిని చెప్పియున్నారు.
2. ఈ హ్రాస, వృద్ధులు, స్వక్షేత్ర ఉచ్చగతుడైనా, లేదా పాపగ్రహమాత్రదృష్టుడైనా ఉండవు.
3. గురుడు లగ్నమునగాని, సప్తమమునగానిఉండి, శుభగ్రహయుక్తుడుగాని, దృష్టుడైనా చెప్పిన ఆయువుకు కక్ష్యావృద్ధి ఉండును.
కక్ష్యాహ్రాస వృద్ధి లక్షణము:
1. కక్ష్యావృద్ధిలో ఎట్లుండుననగా-నిరాయువు అల్పాయువుగాను, అల్పాయువు మధ్యాయువుగాను, మధ్యాయువు దీర్ఘాయువుగాను, దీర్ఘాయువు అపరిమితాయువుగాను అగును.
2. గురునిలో కక్ష్యావృద్ధిలో ఈరీతిగా ఉండును.
3. శని యోగకారకుడైన కక్ష్యాహ్రాస మెట్లననగా అమితాయువు దీర్ఘాయువు, దీర్ఘాయువు మధ్యాయువు; మధ్యాయుపు అల్పాయువు, అల్పాయువు నిరాయువు అగును.
ఆయుర్దాయ భేదములు: అనాయువు, అధికాయువు :
ఆయువు ఏడు రకములు, ౧బాలా రిష్టాయువు, ౨యోగజ రిష్టాయువు, ౩అల్పాయువు, ౪మధ్యాయువు, ౫దీర్ఘాయువు, ౬దివ్యాయువు, ౭అమితాయువు అని ఆయువు ఏడు రకములు.
1. బాలారిష్టమున 8 ఏళ్ళు,
2. యోగరిష్టమున 20 ఏళ్ళు,
3. దీర్ఘాయువు 120ఏళ్ళు,
4. దివ్యాయువు (1000) వెయ్యేళ్ళు,
5. అమితాయువు సహస్రాధికవర్షములు పుణ్యవంతులచే మాత్రమే పొందబడును.
అమిత, దివ్యాయుర్యోగములు:
1. కర్కాటక లగ్నమున చంద్రగురులుండి, బుధశనులు కేంద్రగతులై మిగిలిన గ్రహములు 3, 6, 11 లందున్న జాతకుడు అమితాయువగును.
2. పాపగ్రహములు 3, 6, 11 లందును. శుభగ్రహములు కేంద్రములందుగాని, త్రికోణముందుగాని ఉండి, అష్టమము శుభగ్రహము యొక్క రాశియైన దివ్యాయువు కలవాడగును.
3. కేంద్రమున గురుడు గోపురాంశలో ఉండి, త్రికోణమందున్న శుక్రుడు పారావతాంశలో ఉండి, కర్కటక లగ్నమైన జాతకుడు యుగాంతావధి జీవితము కలవాడగును.
4. కుజుడు పారావతాంశమందు, శని దేవలోకాంశమందు, సింహాసనస్థుడై గురుడు లగ్నమున ఉన్న జాతకుడు ముని సదృశమైన ఆయుర్దాయము కలవాడగును.
పూర్ణాయువు యోగములు:
సుయోగమున్న ఆయుర్వృద్ధి, దుర్యోగమున్న ఆయుర్హాని జరుగును. కావున దీర్ఘ, మధ్య, అల్పాయుర్యోగములను చెప్పబడుచున్నది.
1. శుభగ్రహములు కేంద్రము లందున్న, లగ్నాధిపతి శుభయుక్తుడైన, గురునిచే చూడబడినా పూర్ణాయువు కల్గును.
2. లగ్నాధిపతి కేంద్రమందుండి, గురుశుక్రులతో కూడినా, చూడబడినా పూర్ణాయువు. స్వ, ఉచ్చ, మిత్రక్షేత్రగతములైన మూడు గ్రహములు అష్టమమందుఉండి, లగ్నాధిపతి బలవంతుడైన పూర్ణాయువు;
3. మూడుగ్రహములు ఉచ్చస్థులై లగ్నాష్టమాధిపతులతో కూడియుండి, అష్టమము పాపవర్జితమైన పూర్ణాయువు.
4. స్వ, ఉచ్చగతుడైన ఏగ్రహముతోనైనా అష్టమాధిపతిగాని, శనిగాని కూడియున్న దీర్ఘాయువు. పాపగ్రహము 3, 6, 11 లందుండి, శుభగ్రహములు కేంద్రకోణములందుండి, లగ్నాధిపుడు బలవంతుడై పూర్ణాయువు;
5. శుభగ్రహములు కేంద్రకోణములందుండి, లగ్నాధిపుడు బలవంతుడైన పూర్ణాయువు, శుభగ్రహములు 7, 6, 8 లందుండి, పాపగ్రహములు 3, 11 లందున్న, లగ్నాధిపతి కేంద్రమందు, అష్టమాధిపతి రవికి మిత్రుడైయున్న దీర్ఘాయువు.
6. పాపగ్రహము షష్ఠమందుండి, దశమాధిపతి ఉచ్చస్థుడైన పూర్ణాయువు.
7. లగ్నము ద్విస్వభావరాశియై, లగ్నాధిపతి కేంద్ర, స్వ, ఉచ్చ, త్రికోణములందున్న పూర్ణాయువు. లగ్నము ద్విస్వభావరాశియై బలవంతుడైన లగ్నాధిపతితో రెండు పాపగ్రహములు కేంద్రమందున్న జాతకుడు దీర్ఘాయువగును.
దీర్ఘ మధ్యల్పాయుష్య యోగములు:
1. లగ్న అష్టమాధిపతులలో బలవంతుడైన గ్రహము కేంద్రమున ఉన్న దీర్ఘాయువు నిశ్చయము. లగ్న అష్టమాధిపతులలో బలవంతుడైన గ్రహము పణఫరమందున్న మధ్యాయువు,
2. లగ్న అష్టమాధిపతులలో బలవంతుడైన గ్రహము
3. ఆపోక్లిమమందున్న అల్పాయువు కలుగును.
1) లగ్నాధిపతి రవికి మిత్రుడైన దీర్ఘాయువు,
2) లగ్నాధిపతి రవికి సముడైన మధ్యాయువు,
3) లగ్నాధిపతి రవికి శత్రువైన అల్పాయువు కలుగును.
1. అష్టమాధిపతి రవికి మిత్రుడైన దీర్ఘాయువు,
2. అష్టమాధిపతి రవికి సముడైన మధ్యాయువు,
3. అష్టమాధిపతి రవికి శత్రువైన అల్పాయువు కలుగును.
1. లగ్నాధిపతి, అష్టమాధిపతి, స్వక్షేత్రవర్తులైన దీర్ఘాయువు,
2. లగ్నాధిపతి, అష్టమాధిపతి, సమరాశిగతులైన మధ్యాయువు,
3. లగ్నాధిపతి, అష్టమాధిపతి, శత్రురాశిగతులైన అల్పాయువు కలుగును.
అల్పాయు యోగములు:
1) తృతీయాధిపతి కుజుడుగాని, అష్టమాధిపతి శనిగాని పాపగ్రహయుక్తులైనా, దృష్టులైనా, అస్తంగతులైనా అల్పాయువు.
2) 6, 8, 12లందు పాపులతోకూడి లగ్నాధిపతియున్న, వానికి శుభయుతి, దృష్టి లేకున్న అల్పాయువుకాని అనపత్యుడుగాని అగును.
3) కేంద్రములందు పాపగ్రహములుండి, శుభగ్రహ దృష్టిలేకుండి, లగ్నాధిపతి దుర్బలుడైన అల్పాయువు.
4) ద్వితీయము, ద్వాదశము పాపగ్రహయుక్తమై శుభగ్రహసంబంధము లేకున్న అల్పాయువు.
5) లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరును అస్తంగతులైనా, నీచస్థులైనా అల్పాయువగును. శుభాశుభగ్రహ యోగమున్న మధ్యాయువగును.
Comments
Post a Comment