పంచ మహాపురుష లక్షణాధ్యాయము
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 87
పంచ మహాపురుష లక్షణాధ్యాయము :
ఇప్పుడు నేను పంచ మహాపురుష లక్షణములు చెప్పబడుచున్నది. బలవంతులు, స్వక్షేత్ర, ఉచ్చస్థులైన కుజాది పంచగ్రహములు కేంద్రగతములైన క్రమముగా రుచక, భద్ర, హంస, మాలవ్య, శశకయోగములందు పుట్టినవారు మహాపురుషులు.
రుచక యోగ లక్షణములు
రుచక యోగోత్పన్నుడైన పురుషుడు ఎక్కువ ఉత్సాహము కలవాడు, నిర్మల కాంతి, పొడవైన ముఖము, సుందరమైన కనుబొమలు, నల్లని జుట్టు, యుద్ధ ప్రేమ, సుందర వస్తువు అందభిరుచి, ఎరుపు నలుపు రంగు, క్రూరస్వభావము కలవాడు, రాజు, వివేకి, సన్నని కళ్లు కలిగిన, దొంగ నాయకుడు, చేతిలోవజ్రము, విల్లు, పాశము, వీణ, చక్రము, వృషభముల రేఖలు కలవాడు, మంత్ర, అభిచార నిపుణుడు, బ్రాహ్మణ భక్తుడు, పొడవుగా 100 అంగుళముల ప్రమాణమున్నవాడు; ముఖము, మధ్యము(నడుము) సమముగా ఉన్న వాడు, తులా సహస్రము బరువున్నవాడు. (100 పలములు 1తుల) వింధ్య సహ్య పర్వతీయ ప్రాంతమును 70 ఏళ్లు పాలించును. చివరన అస్త్రము, లేక అగ్నిద్వారా దేవలోకమునకేగును.
భద్రయోగ లక్షణములు
భద్ర సంజ్ఞకుడైన మహాపురుషుడు బలిసిన రొమ్ము కలవాడు, సింహసదృశుడు, గజగమనుడు, ఆజాను దీర్ఘబాహుడు, యోగజ్ఞుడు, మంచిగడ్డము, మీసాలు కలవాడు, కాముకుడు, సాత్వికుడు, శంఖము, చక్రము, గద, బాణము, ఏనుగు చిహ్నములు కలవాడు; నాగలిధ్వజము పద్మము రేఖలుగల కాళ్ళు చేతులు గలవాడు, శాస్త్రజ్ఞుడు, అందమైన ముక్కు, నల్లని ముంగురులు, మంచి బుద్ధి కలిగి అన్ని కార్యములందును స్వాధీనుడై, తన వారిని పోషించుచు, మిత్రులతో కూడి, భార్యాపుత్రయుతుడై, కుశలుడై మధ్యప్రదేశమునకు మహారాజై నూరేండ్లు పాలించును.
హంసయోగ లక్షణములు
తెల్లని శరీరము, హంసధ్వని, పొడవైన ముక్కు, అందమైన ముఖము, పింగళవర్ణమైన . కన్నులు; శ్లేష్మ ప్రకృతి, ఎర్రని గోళ్ళు, పండితుడు, గుండ్రనితల, బలిసినచెక్కిళ్ళు, అందమైన పాదములు, పద్మ, మీన, అంకుశ, ధనుస్సు, శంఖము, మంచపుకోడు, రేఖలుకల కాళ్ళు చేతులు కలవాడు, కాముకుడై స్త్రీలయందు తృప్తి లేనివాడు, 96అంగుళముల పొడవు, జలకేళిప్రియుడు, గంగాయమునా మధ్యప్రదేశ పరిపాలకుడై హంసుడను పురుషుడు నూరేళ్లు సుఖములనుభవించి, స్వర్గముచేరును.
మాలవ్య లక్షణము
మాలవ్యలక్షణములు కల మహపురుషుడు చంద్రకాంతి కలవాడు, సన్ననినడుము, సమానమైన పెదవులు, పొట్టికాదు, పొడుగుకాదు, మంచిసువాసన కలవాడు, కొద్ధిగా ఎర్రనిదేహము, ఆజానుబాహువు, ఏనుగువంటి గంభీరధ్వని, సమానమైన తెల్లనిదంతములు కలవాడు, విస్తారములు 16-10అంగుళములుకల ముఖము కలిగి. సింధుమాలపదేశముల రాజై డెబ్బదేళ్ళు పాలించి, స్వర్గము చేరుకొనును.
శశా లక్షణములు
శశలక్షణో పేతుడైన మహాపురుషుడు కృశోదరుడు, సమమైన పాడవు, అందమైన పిక్కలు, సన్నని నడుము, పరచ్ఛిద్రముల నెరిగినవాడు, బుద్ధిశాలి, సేనాపతి, సమర్థుడు, అరణ్యములందు కొండలందు సంచరించువాడు, రసాయనజ్ఞుడు, చపలుడు, అంగనాసక్తుడు; పరధనము కలవాడు, మురజము, ఆయుధము, వీణ, మాల రేఖలు, కాళ్ళయందు చేతులందు, కలవాడు, అట్టి శశుడను మహరాజు భూమిని డెబ్బదేళ్ళు పాలించును. వీరు అయిదుగురు మహరాజ పురుషులు.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 88
ఫలము:
పంచమహాభూత ప్రభను (కాంతిని) చెప్పబడుచున్నది. అది తెలిసినందున గ్రహములయొక్క విద్యమానదశ తెలియును. కుజాది పంచగ్రహములు క్రమముగా అగ్ని, భూమి, ఆకాశము, జలము, వాయువు, వీటి తత్త్వముల కధిపతులు, గ్రహములు బలానుసారము మనుష్యులపై ఆయా మహాభూతములు ఫలము చెప్పబడినది.
కుజుడు బలీష్ఠుడైన జాతకుడు అగ్ని తత్త్వ ప్రధానుడగును: బుధుడు బలిష్ఠుడైన భూప్రకృతియు, గురుడు బలిష్ఠుడైన ఆకాశ ప్రకృతియు, శుక్రుడు బలిష్ఠుడైన జలప్రకృతియు, శని బలీష్ఠుడైన వాయుప్రకృతికుడును; ఎన్నో గ్రహములు బలిష్ఠములైన మిశ్రప్రకృతియని తెలియదగినది.
పంచభూత స్వభావ లక్షణములు
రవి బలవత్తరుడైన అగ్నిప్రకృతియు, చంద్రుడు బలియైన జలప్రకృతి యనియు తెలియునది. అన్ని గ్రహములును వాటి దశలలో మహభూత సంబంధమైన తమ కాంతిని వ్యక్తీకరించును.
అగ్నిప్రకృతిక మనుష్యుడు ఆకలిగొన్నవాడు, ఎక్కువగా తినువాడు, చంచలుడు, శూరుడు, బక్కగా ఉన్న వాడు, గౌరవర్ణదేహము కలవాడు, బుద్ధిమంతుడు, అభిమానవంతుడు, తీక్షుడు అగును. భూమిస్వభావుడు, భోగి, అతిబలుడు, సుఖి, పద్మము, కర్పూరమువలె పరిమళించువాడు, ఓర్పు కలవాడు, సింహధ్వని కలవాడు అగును. ఆకాశస్వభావుడు " నీతిజ్ఞుడు, జ్ఞాని, తెరచిన నోరు కలవాడు, పొడవైనవాడు, శబ్దార్థజ్ఞుడు, తీవ్రమైన బుద్ధికలవాడు, జలస్వభావుడు, ప్రభ కలవాడు, మృదువు, బుద్ధిమంతుడు, రాజు, బహుమిత్రుడు, భారవాహుడు, ప్రియముగా మాట్లాడువాడును; వాయుప్రకృతికుడు తీక్షుడు, దాత, గౌరవర్ణమైన దేహము కలవాడు, రాజు, బక్కవాడు, తిరిగెడి స్వభావము కలవాడు, శత్రుమర్దనుడు అగును.
అగ్నిప్రభ (అగ్నితత్వఛాయ) లో మనుష్యుడు బంగారుకాంతికల్గి, మంచిదృష్టి సర్వకార్యసాఫల్యము, విజేత, విత్తభము కలవాడగును. భూమిప్రభలో శరీరము సువాసన, నున్నని పళ్ళు, గోళ్ళు, ధన, ధర్మ, సుఖములు కలవాడు; ఆకాశప్రభలో వాక్ర్పాగల్భ్యము, మంచి కంఠధ్వని, సుఖము కలుగును. జలప్రభలో శరీరము స్వస్థత, మార్దవము, ఇష్టరసాస్వాద సౌఖ్యము కల్గును. వాయుప్రభలో మూఢత్వము, మాలిన్యము, రోగము, దైన్యము, తాపము, కన్పట్టును.
కుజాదిగ్రహములు బలవంతులైనప్పుడే యీ రీతి ఫలము కలుగును. బలహీనులైన విపరీతముగా నుండును. గ్రహములు నీచస్థులైనా, శత్రురాశియందున్నా ఫలవిపర్యయము కల్గును. వారు నిర్బలులైన, చెప్పిన ఫలము స్వప్నమున కల్గును.
జన్మసమయము తెలియనివారికి వర్తమానదశ గ్రహముల ఫలపాకమువలన తెలియవలెను. దుష్టఫలమిచ్చు గ్రహములకు శాంతికై జపదానాదులు చేసిన శాంతి కలుగును. గ్రహములు బలవత్తరములైనట్లు మనము చేయుపనులు సిద్ధించుటను బట్టియు; దుర్బలులైన కార్యవిఘ్నము, కార్యనాశనమును బట్టియు తెలియును. దానికి శాంతి చేయుట మంచిది.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 89
త్రిగుణ ఫలము:
ఇప్పుడు గుణానుసారము ఫలములు చెప్పబడుచున్నది.
సత్వగుణప్రధాన గ్రహము జన్మ కాలమున బలముగా నున్న జాతకుడు సాత్వికుడు, విద్వాంసుడు అగును.
రాజసగ్రహమైన రాజసుడు, విద్వాంసుడు;
తామసగ్రహమైన మందబుద్ధి, తామసప్రకృతి కలవాడును; మూడు గుణముల గ్రహములు సమముగాఉన్న మిశ్రగుణుడు, మధ్యరకము బుద్ధికలవాడు అగును. ఇట్లు నాలుగు రకముల మనుష్యులుందురు. వారు ఉత్తమ, మధ్యమ, అధమ, ఉదాసీనులని క్రమముగా చెప్పబడుదురు. ప్రాచీన మునులు చెప్పిన ఆ గుణములు చెప్పబడుచున్నది.
సత్వ, రజో, తమోగుణ సంపన్న లక్షణములు
సత్వగుణగ్రహ ప్రాధాన్యమున జాతకుడు శాంతుడు, దాంతుడు, పవిత్రుడు, క్షమాశీలుడు, సరలుడు, సత్యభాషి, లోభరహితుడు, తాపసుడు అగును. రజోగుణ ప్రాధాన్యమున తేజస్వి. ధైర్యశాలి, కుశలుడు, యుద్ధమున వెనుదిరుగనివాడు, సజ్జనులను రక్షించువాడు అగును. తమోగుణ ప్రాధాన్యమున లోభి, అసత్యభాషి, బద్ధకస్థుడు, మూర్ఖుడు, నీచుడు, సేనలో నిపుణుడు అగును.
గుణసామ్యమున జాతకుడు కృషిచేయు రైతు, వ్యాపారకుశలుడు, పశుపాలకుడు, సత్యానృత భాషి అగును.
ఇట్లు ఉత్తమ, అథమ, మధ్యమ, ఉదాసీనులగు చతుర్విధ పురుషులను గుర్తించి, తెలివైనవాడు వారివారికి తగిన పనులలో నియోగించవలెను. ఏగుణమున ప్రాబల్యమున్న, దాని గుణములు కనబడును. దేనికిని ఆధిక్యము లేనప్పుడు సమత్వమును తెలియవలెను.
గుణ ప్రయోజనము
యజమాని సేవకుడు, కన్యా వరుడు, వీరిలో గుణసాదృశ్యమున్న ఇద్దరికి సౌహార్దము
( స్నేహము) స్థిరమగును. అధమున కుదాసీనునితోను, మధ్యమున కుదాసీనునితోను, ఉత్తమునకు మధ్యమునితోను సంబంధము ఆమోదము కలిగించును.
విశేషము
వధూవరులలో వరుడు, సేవ్య సేవకులలో యజమాని, గుణాధికుడు కావలెను. అధికుడైతేనే ఇద్దరికిని సుఖసౌహార్దములు బాగుండును. అట్లు కానిచో వధువెక్కువైనా, సేవకుడెక్కువైనా సౌహార్దము సరిగ్గా ఉండదు. తల్లిదండ్రులు, జన్మకాలము, సంయోగకాలము, ఇవి గుణములలో ప్రబలకారణములు. జన్మమైన గుణము నరునియందు కలుగును. ఇదివివేచనచేసి నుంచి చెడు ఫలము తెలియవలెను.
కాలమే ఈ లోకమునంతము చేయునది, పాలించునది, సృష్టిచేయునదియును ఈశ్వరుడు అవినాశి, వ్యాపకుడు, ప్రభువును. వ్యాపకుడైన ఆ ఈశ్వరుని త్రిగుణాత్మిక శక్తికే ప్రకృతి యని పేరు. శక్తినుండి విడిపోయి, అతడు ప్రతి జీవిలోను వ్యక్తుడగును. గుణానుసారముగా అతని అంగములుండును. కావున జనులు ఉత్తమ, మధ్యమ, ఉదాసీన, అధములని నాలుగు రకాలైనారు. ఆ ఈశ్వరుడు ఉత్తమాంగమునుండి ఉత్తముడు, మధ్యమాంగమునుండి సముడు., ఉదాసీనాంగమునుండి ఉదాసీనుడు, అధమాంగమునుండి అధముడు ఇట్లు చతుర్విధజనులు కలిగిరి. ఉత్తమాంగము తల, మధ్యమాంగము వక్షస్థలము, ఉదాసీనము ఊరువులు; అధమము పాదములు అగును.
ఇట్లు గుణానుసారముగా కాలభేదము, తద్వశమున జాతిభేదము చరాచరగతమైనది. గుణానుసారముగా వ్యాపకుడగు భగవంతుడు, ప్రభువు, కాలుడు చతుర్విధ సృష్టిని చేసెను.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 90
నష్టజాతకాధ్యాయము
ఇప్పటి వరకు జన్మసమయమునుబట్టి ఫలము చెప్పబడినవి. జన్మ కాలము తెలియనివారికెట్లు ఫలము తెలిసికోదగినది ? మంచిదిగాని, చెడుగాని పూర్వజన్మలో ఏ కర్మ చేసెనో అది తెలిసికొను ఉపాయమును చెప్పబడుచున్నది. (జాతకమట్లు కర్మను చెప్పునదే.)
జన్మకాలము తెలియనివారికి ఫలమెట్లు చెప్పవలెనో చెప్పబడుచున్నది. వత్సర, అయన, మాస, తిధి, నక్షత్రాదులు తెలియకున్న ప్రశ్ననుబట్టి నిస్సందేహము తెలియదగును.
ఋతుసంక్రమణము
ప్రశ్న లగ్నమున ఏ ద్వాదశాంశలో రవియుండునో ఆ రాశి సంవత్సరము, లగ్న ప్రథమ హోర ఉత్తరాయణము, రెండవ హోర దక్షిణాయనము, లగ్న ద్రేక్కాణాధిపతి శనియైన శిశిరఋతువు, శుక్రుడైన వసంతఋతువు, కుజుడైన గ్రీష్మఋతువు, చంద్రుడైన వర్షఋతువు, బుధుడైన శరదృతువు, గురుడైన హేమంత ఋతువు, రవియైన గ్రీష్మఋతువు అగును.
అయన, ఋతువులలో అనుమానము వచ్చిన, బుధుని స్థానమున కుజుడు చంద్రుని స్థానమున శుక్రుడు, గురుని స్థానమున శనిని అనుకొని ఋతువును తెలియవలెను
ద్రేక్కాణ పూర్వార్థము ప్రథమ మాసము, ఉత్తరార్థము రెండవ మాసము, ద్రేక్కాణానుపాతమున తిథిని, ప్రశ్నకాలమే జన్మ సమయము. ఆ సమయమున గ్రహములు, భావములనుబట్టి వెనుకటివలెనో ఫలము చెప్పవలెను :
గురుడు పండ్రెండేళ్ళ కొకసారి భగణమును తిరుగును కదా అందేపర్యాయమున జన్మవత్సరమని తెలిసికోవలెను.
సంవత్సరమున సందేహము వచ్చిన, వయస్సునూహించి, 12, 12 చొప్పున చూడవలెను. అక్కడకూడ సందేహమున్న ప్రశ్న లగ్నమునకు త్రికోణమున గురుడున్నట్టూహించి సంవత్సరమును కల్పించవలెను.
పూర్వోక్తరీతిగా మాసము, తిథి తెలిసినా, జన్మ సమయజ్ఞాన మెట్లు కలుగునో చెప్పబడుచున్నది.
రవి రాశ్యంశాది తెలసిన తరువాత, సంక్రమణము తర్వాత రవికెన్ని అంశలు (భాగలు) గతించెనో, అన్ని దినములు; సంక్రాంతి తర్వాత అన్నవదినమున ఔదయిక రవి సాధన చేయవలెను. ఆ సాధిత రవిని ఇష్టరవి కలాత్మక అంతరమును 60చే గుణించి, స్పష్ట రవిగతి కలాసంఖ్యచే భాగించగా లబ్దతుల్య ఘట్యాది సూర్యోదయాత్పూర్వముకాని, పరముకాని జన్మేష్ట కాలముగా తెలియదగినది. ఉదయ రవికన్న ఇష్టరవి తక్కువయైన పూర్వమని, అధికుడైన ఉదయాత్పరమని తెలియదగినది.
ఉదాహరణము : ఒకడు జన్మ సమయము తెలియనివాడు, జాతకము తెలియగోరి జ్యోతిషికునివద్దకు వచ్చినాడనుకొందుము. అతడు వచ్చినది. క్రీ.శ. 1989 విభవ సంర ఫాల్గుణ శు.మీ బుధవారము మధ్యాహ్నము గం.4 30లకు, అప్పుడు సుటరవి రాశ్యాది 10 24 9. ఔదయిక రవి 10 23 4. సూర్యోదయాది ఘటికలు 25 17.
సింహద్వాదశాంశ– సింహలగ్నమున అయినది. కావున సింహమున గురుడు ఇప్పుడు గురుడు 1రాశి- 5- 51 కావున వృషభమున ఉన్నాడు. 9ఏళ్ళ క్రితము సింహమున ఉన్నాడు. ప్రశ్నకర్తకు సుమారు 20ఏళ్ళుండవచ్చును అనుకొన్నచో 12+9=21సం.లు వచ్చినవి. కావున 1989 9=1980 సంవత్సరము. ప్రశ్న లగ్నము పూర్వార్థము కనుక ఉత్తరాయణము.
ఋతువు ఏదియనగా- లగ్నము ప్రథమ ద్రేక్కాణము రవిది. గ్రీష్మఋతువు
మాసమేదియనగా ప్రశ్నలగ్నము ప్రథమ ద్రేక్కాణము. కనుక గ్రీష్మమున ప్రథమమాసము జ్యేష్ఠమాసము.
సూర్యాంశజ్ఞానము ప్రశ్నలగ్న ప్రథమ ద్రేక్కాణము. రాశ్యాది 4- 1- 0 కనుక జన్మకాలమున రవిభుక్త అంశాది 60×30/300=6 కలలు. మిధునమున 2- 0- 6. రవి. జన్మకాలిక స్పష్టరవి. 2- 0- 6. మిథునమాసమున- 1వ దినము గడుచుచుండగా జన్మము అయినది. ప్రశ్నలగ్నమునే,జన్మ లగ్నముగా చేయుమని ఒక మతము.
నిజానికి జన్మకుండలిమీద చెప్పుటే శ్రేయస్కరము. అట్లు చెప్పినా ఫలితాలు కుదురుటలేదే? నష్టప్రశ్న లగ్నముపై కుదురునా ? జన్మకాలము ప్రశ్నతో రానేరదు. అసలు ఉంటేనే అనగా జన్మ జాతకం ఉంటేనే సరియైన ఫలితము కలుగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 91
ప్రవ్రజ్యాయోగాధ్యాయము
ఇప్పుడు ప్రవ్రజ్యాయోగము చెప్పబడుచున్నది. ఏ సన్యాసముచే జనులు సర్వస్వమును వదలి విరక్తులగుదురోదానిని సన్యాసము అందురు.
ఒకేరాశియందు బలవంతులైన రవ్యాది నలుగురు గ్రహములు కాని, అంతకన్న ఎక్కువమందికాని ఉన్న, ప్రవ్రజ్యాయోగము. బలవత్తరగ్రహము రవియైన కపాలి, కుజుడైనరక్తవస్త్రధారి. బుధుడైన దండి, గురుడైన సంయమ నియమము కల సన్యాసి, శుక్రుడైనచక్రధారి, శనియైన దిగంబరుడుగా విరక్తుడగును.
(ఒక్క విషయము, నలుగురు గ్రహము లోకేసారి యందుండవలెనన్నది రాశిపరముగా కాకుండ, ఆ గ్రహముల స్థితిలో అంతరముగా తక్కువగా ఉండవలెను. ఒకే రాశిలోనైనా అంతరమెక్కువగానున్న ఫలితము లేదు. ఒకే రాశిలో ఆరంభమున ఒకరు, అంతమున ఒకరు ఉన్న ఫలముండదు. రెండు రాశులలోనైనా ఉదా : వృషభాంతమున 29 అంశలో ఒకరు, మిథునమున 3, 4 భాగల లోనైన (15 భాగలలోపుగా) ఉన్న ఫలితముండును.)
నిర్బల ప్రవ్రజ్యా యోగములు
ప్రప్రజ్యాకారక గ్రహములు ప్రబలురైయుండి అస్తంగతులైనచో ఆ ప్రవ్రజితుడు సన్యాసదీక్షను విరమించును. అనగా ఇంటికి దూరముగా పోయి, 'ఏ దీక్షలేక ఇంటికి రాకయుండును. బలములేని రవ్యతిరిక్తగ్రహము, రవి సాన్నిధ్యమున అస్తంగతులగుదురు. అప్పుడు రవి ప్రబలుడైన రవియే ప్రవ్రజ్య కారకుడగును.
అన్యయోగములు
జన్మ రాశ్యధిపతి ఇతర గ్రహములచే చూడబడక, శనిని చూచిన అప్పుడు ఆ లగ్నాధిపతి, శనులిద్దరును ప్రప్రజ్యకారకులు. దుర్భలుడైన లగ్నాధిపతిని, శనిచే చూడబడిన; ఆ సన్యాసము శనికృతమే అగును.
ఇతర యోగములు
శని ద్రేక్కాణమున చంద్రుడున్నా; చంద్రుడు, కుజశని నవాంశగతుడైనా, చంద్రునిపై శని దృష్టి ఉన్నా అది శనికృత సన్యాసమే.
కుజాదిగ్రహములు ఒక అంశలో కూడుట గ్రహయుద్ధమనబడును. అందులో శుక్రుడు ఉత్తరమున ఉన్నా , దక్షిణమున ఉన్నా విజేతయే. తక్కిన గ్రహములు ఉత్తరవర్తులైనప్పుడే విజేతలు.
ప్రవ్రాజ్యాకృతి
పరాజితుడైన గ్రహకృతమైనకాలంలో ప్రవ్రజ్యయోగంచే జాతకుడు సన్యాసియై, తర్వాత వదలివేయును.
జన్మకుండలిలో అనేక గ్రహములు సమాన బలవంతులై ప్రవ్రజ్యకారకులైన, అందులో కారకుడు ఎవరనవచ్చును ? అన్న ప్రశ్నకు
బలవంతులైన అనేక గ్రహములు సదా ప్రవ్రజ్యా కారకులైనచో, సమమైన అందరి ప్రవ్రజ్యను పొందును. గ్రహములు దశానుక్రమానుసారముగా స్వస్వభక్తులు స్వస్వజనిత ప్రజ్యనే ఇత్తురు.
ప్రవ్రాజ్యా యోగలక్షణము
లగ్న గురుచంద్రులను శని చూచుచుండి, గురుడు భాగ్యమందున్న"అది రాజయోగము.
ఈ యోగమున పుట్టినవాడు రాజైయుండి కూడ తీర్థంకరుడు (ఒక సంప్రదాయమును ఏర్పరచగల బుద్ధుడు, మహావీరుడు వంటి వాడు) అగును. నవమమందున్న శని ఇతరులచే చూడబడకున్ననూ రాజయోగమే. దానిలో పుట్టిన జాతకుడు సన్యాసముకల రాజగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 92
స్త్రీ జాతక ఫలము:
మహర్పులు పురుషులకు చెప్పిన ఫలమే స్త్రీలకును చేప్పవచ్చును. ఒక్క విశేషమున్నది.
స్త్రీలకు శారీరకఫలము లగ్నమునుండియు, సంతాన విషయము పంచమమునుండియు, పతిసౌఖ్యము సప్తమమును బట్టియు, వైధవ్య విచారము అష్టమమును బట్టి తెలియును. స్త్రీలయందసంగతమైన ఫలము వారిపురుషులకు (భర్తలకు) కల్గును.
స్త్రీ జాతకమున లగ్నము, చంద్రుడును సమ (2, 4, 6, 8, 10, 12) రాశులలో నున్న, ఆమె సుశీల, మంచి లక్షణములు కలది, స్త్రీ స్వభావానురూపమైన గుణములు కలదగును. వారికి శుభగ్రహ దృష్టియున్న సౌభాగ్యము కలది, స్వాస్థ్యము, సౌఖ్యము కలదగును. ఓజరాశి (1, 3, 5, 7, 8, 11) యె న పురుషాకృతి కలది, శీలహీనురాలు. పాపులచే లగ్నచంద్రులు చూడబడిన దుర్గుణురాలు అగును. శుభపాపగ్రహవశమున మంచి చెడు చెప్పవలెను లగ్నచంద్రులలో ఏది బలవత్తరమో దానిగుణములు సర్వాంశతః వచ్చును.
లగ్నచంద్రులలో ఎవరు బలవత్తరులో ఆ రాశి, చంద్రాధిష్ఠితరాశి వాటి త్రింశాంశలనుబట్టి స్త్రీలకు ఫలము చెప్పబడినది.
లగ్నచంద్రులలో ఏది బలవత్తరమో, అది కుజ రాశియై ( మేష వృశ్చికములు), కుజ త్రింశాంశయైన దుష్టురాలును, శుక్రాంశయైన దుశ్చరిత్రురాలును, బుధాంశయైన మాయావినియు, శన్యంశయైన చేటియు; గుర్వంశయైన పతివ్రతయు, బుధక్షేత్రమైన కుజుని అంశయైనకపటము కలదియు, శుక్రాంశయైన కాముకియు, బుధాంశయైన గుణవంతురాలును,
శన్యంశయైన నపుంసకురాలు (మాచకమ్మ) గుర్వంశయైన శుక్రాంశయైన పతివ్రతయు అగును.
శుక్రరాశియై (వృషభ, తులలు) లగ్నచంద్రులలో బలమున్నది కుజ త్రింశాంశయైన చరిత్రహీనయు, శుక్రాంశయైన గుణములచే ప్రసిద్ధురాలును, బుధాంశయైన సత్కళా పరిపూర్ణయు, గుర్వంశయైన గుణవంతురాలును, శన్యంశయైన రెండుసార్లు పెండ్లియైనదియు, చంద్రారాశియైన కుజాంశయైన స్వతంత్రురాలును, శుక్రాంశలో కులటయు, బుధాంశలో శిల్పకళాదక్షురాలును, గుర్వంశలో ఎక్కువగా గుణవంతురాలును, శన్యంశలో పతిని చంపునదియు అగును.
రవి రాశియైన సింహమున లగ్నచంద్రులలో బలవంతుడున్న కుజత్రింశాంశయైనవక్రముగా వాదించునదియు, శుక్రాంశలో పతివ్రతయు, బుధాంశలో పురుషాకృతి కలదియు, గుర్వంశలో రాణియు, శన్యంశలో భ్రష్టురాలును అగును. గురురాశుల (ధనుర్మీనములు) లో ఉన్న కుజాంశలో ఎక్కువ గుణవంతురాలును, శుక్రత్రింశాంశలో కులటయు, బుధాంశలో విజ్ఞానవతియు, గుర్వంశలో అతి గుణవంతురాలును, శన్యంశలో అల్పరతి కలదియు అగును. | శనిరాశి(మకర, కుంభ) లో కుజాంశయైన దాసియు, శుక్రాంశయై న విదుషీమణియు, బుధాంశయైన పాపయుక్తయు, నీచపురుషుని కూడినదియు, గుర్వంశలో పతివ్రతయు, శన్యంశలో నీచ పురుషాసక్తయు అగును.
సప్తమభావము గ్రహము లేనిదైన, శుభగ్రహదృష్టి లేనిదైన భర్త నీచ పురుషుడగును. సప్తమము చరరాశియైన భర్త విదేశవాసి యగును. అక్కడ శని బుధులున్న భర్త నపుంసకుడగును. రవియున్న భర్తచే విడువబడును. కుజుడున్న బాలవిధవ యగును. శనియుండి, పాపదృష్టియున్న కన్యగానే ముసలిదగును ( పెండ్లికాదు). శుభగ్రహములున్న పతివ్రతయు, పాపగ్రహములున్న విధవయు, మిశ్రగ్రహములున్న రెండుసార్లు పెండ్లి చేసికొనునదియు అగును. శుక్రకుజులు పరస్పర అంశలయందున్న పరపురుషుల చేరునదియు, చంద్రుడున్న భర్తయిష్టము మీద పరపురుషగామియు అగును. లగ్నమున చంద్రశుక్రులు లగ్నగతులై శుక్రశనుల రాశులైన (వృషభ, తులా, మకర, కుంభములు) ఆ కన్య తల్లితోసహా కులట యగును
సప్తమభావము కుజరాశి (మేష వృశ్చికములు)గాని కుజనవాంశగానియైన ఆమె భర్త కోపిష్టి లంపటడు అగును. బుధరాశి (మిథున కన్యలు) నవాంశలైన భర్త కళావేత్త, పండితుడు అగును. గురురాశి ( ధనుర్మీనములు) నవాంశయైన పతి మంచి గుణవంతుడు, ఇంద్రియనిగ్రహము కలవాడును అగును. శుక్రరాశి (తులా, వృషభములు) నవాంశయైన రూపవంతుడు, కామినీ ప్రియుడు అగును. శనిరాశి (మకర కుంభములు) నవాంశగానియైన మూఢుడు. ముసలితనముతో బాధపడువాడుఅగును. సింహాంశగాని, సింహరాశిగానియైన అతి కఠోరుడు, బహుకార్యకర్త యగును. చంద్రరాశిగాని, చంద్రాంశగానియైన రూపవంతుడు, కాముకుడు, మృదుస్వభావుడు అగును. రాశి నవాంశల బలానుసారముగా మిశ్రములైన మిశ్రఫలము చెప్పదగినది.
స్త్రీకి అష్టమమున రవియున్న దరిద్రయు, దుఃఖిత, భేదము కలది, క్షతాంగి. ధర్మమన్న ఇష్టము లేనిది అగును. చంద్రుడున్న ఆమెయొక్క దృష్టి, స్తన, భగములు కుత్సితములే యుండును. వస్త్రాలంకారములేనిది, రోగము కలది, నిందితురాలు అగును. కుజుడున్నరోగయుక్త, దుర్బల, కాంతిలేనిది, దుఃఖ సంతాపములచే శోకము కలది, విధవయు అగును. బుధుడున్న భయము కలది, కబ్జాకోరు, ధన ధర్మ అభిమానములు లేనిది, గుణహీనురాలు అగును. గురుడున్న శీలము లేనిది, అల్పసంతానము కలది, భర్తను వదలినది, స్థూలమైన కాలు చేతులు కలది, తిండిపోతు అగును. శుక్రుడున్న మదము కలది, నిర్ధన, మలినురాలు, కపటము కలది. నిష్ఠురయైనది, ధర్మరహిత యగును. శనియున్న మలిన, వంచన చేయునది, దుష్టస్వభావ, పతిసౌఖ్య హీనురాలు అగును. రాహువున్న క్రూరురాలు, హృద్రోగము కలది, పతివ్యక్త, కులట, విరూప అగును.
వంధ్య యోగములు
శుక్రచంద్రులు లగ్నముందున్న, శనికుజులతో కూడిన, పంచమము పాపులతోకూడినా, చూడబడినా ఆమె వంధ్య యగును. రుద్రాభిషేకములుగాని, విష్ణుసహస్రనామ జపముగాని చేసిన సంతానము కలుగును.
దౌర్బాగ్య – సౌభాగ్య యోగములు
సప్తమము పాపగ్రహ నవాంశయైనా, శనిదృష్టియున్నా, దౌర్బాగ్యము కలదగును. శుభాంశయైన భర్తకిష్టురాలు, సౌభాగ్యవతి యగును.
లగ్నము బుధక్షేత్రమైన, శుక్ర చంద్రయుక్తమైన, తండ్రి యింట సర్వసౌఖ్యములు అనుభవించును.
సౌఖ్య యోగములు
లగ్నమున శుక్ర, చంద్ర, బుధులున్న ఎంతో సుఖమును, గుణములను కలుగజేయుదురు. గురుడున్న పుత్ర, ధన, సౌఖ్యసమృద్ధి నిచ్చును.
వంధ్య కాకవంధ్య యోగములు
లగ్నమున కష్టమమున రవిచంద్రులు స్వక్షేత్రవర్తులైయున్న ఆమె వంధ్యయగును. (మిథున, కన్య, కర్కాటకము అష్టమమై ) బుధచంద్రులున్న కాకవంధ్య ఒక్క సంతతి కలది. యగును.
శని, కుజుక్షేత్రములు(మకర, కుంభ, మేష, వృశ్చికములు) లగ్నమై శుక్రచంద్రులున్న, పాపులచే చూడబడిన యామే తప్పక వంధ్య యగును. సప్తనుమున రవి రాహువులుండి, పంచమమున పాపులున్న, అష్టమమున శుక్ర గురుకేతువులున్న ఆమె మృతవత్స బిడ్డలు చనిపోయినదగును. అష్టమము శుక్ర, గురు, కుజులున్న సప్తమమున కుజుడుండి, శనియుక్తమైనా, చూడబడినా గర్భస్రావములు కలుగును. లగ్నమునకు చంద్రునకు పాపకర్తరియున్న (రెండు పాపగ్రహముల మధ్యపడిన) ఆమె భర్తయింటిని కూడ నాశనము చేయును.
విష కన్యా యోగము
భద్రాతిథి ( విదియ, సప్తమి, ఏకాదశి) మంగళ, భాను, శనివారములు, ఆశ్రేష, శతభిషం, కృత్తికావునక్షత్రములలో పుట్టిన యామె విషకన్య యనబడును. దుష్పల మనుభవించును.
ద్వితీయవిషకన్య
లగ్నమున శుభ, పాపగ్రహములు; షష్ఠమున రెండు పాపగ్రహములు ఉన్న కుమారివిషకన్య యనబడును.
విషకన్యా ఫలము
విషయోగమున పుట్టిన కన్య మృతాపత్య (సంతానము చనిపోయినది) అగును. వస్త్ర, అలంకారములు లేనిది, సంతాపము శోకము కలది అగును.
లగ్న చంద్రులకు సప్తమమున శుభగ్రహముకాని, సప్తమాధిపతికానియున్న విషమను పేరుకల యోగము నశించును. నిస్సంశయము.
పతి ఘాతక యోగము
పాతేళేఽపి తనౌ రంధ్రే జామిత్రే వాపి చ వ్యయే |స్థితః కుజః పతింహన్తి న చేచ్చుభయుతేక్షితః ||
ఇందోరప్యుక్తగేహేషు స్థితో భౌమోథవా శనిః | పతిహంతా క్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతి:
లగ్నమునుండి 1, 4, 7, 8, 12లందు కుజుడున్న, శుభగ్రహముతో కూడక, చూడబడకయున్న పతిని చంపును. విధవయగును. చంద్రునినుండికూడ 1, 4, 7, 8, 12లందు కుజుడున్న స్త్రీకి భర్త చనిపోవును. వరునకున్న భార్య చనిపోవును.
వైధవ్య భంగము
స్త్రీణాం వెధవ్యయోగః పుంసాం జన్మనిచేద్భవేత్ |తదా పత్నీవినాశస్స్యాదుభయో శ్చేచ్చుభం స్మృతం |
స్త్రీలకు గల వైధవ్యయోగము పురుషులకున్న భార్యానాశమగును. వధూవరుల కిద్దరికి ఆ యోగమున్న శుభము కలుగును. అనగా ఇదే కుజదోషము. ఇది ఇద్దరికిని ఉన్న వివాహము చేయవచ్చునని భావము.
శనిశుక్రులు పరస్పర నవాంశలలో ఒకరి నవాంశలో నొకరు ఉన్నా , పరస్పరము దృష్టి కలిగియున్నా, శుక్రరాశి (తులా వృషభములు) లగ్నమున కుంభ నవాంశయందు పుట్టినా కన్య యౌవనమున పురుషుడుగా పనిచేయు చెలికత్తెచే, తన కామాగ్ని చల్లార్చుకొనును. (స్త్రీతో స్త్రీ సంగమించుట).
వేదాంతశాస్త్రజ్ఞాన యోగము
కుజ, శుక్ర, బుధ, గురులు బలవంతులై లగ్నమున, ఒకే రాశియందున్నా ఆమె వేదాంతజ్ఞయు, అనేక శాస్త్రములందు నేర్పరియు అగును.
సన్న్యాసయోగము
సప్తమమున పాపగ్రహముండి, నవమమున ఏదో గ్రహమున్న ఆమె సన్యాసిని యగును. పాపగ్రహ దశాంతర్దశలో అగును.
మృత్యు యోగము
అష్టమమున శుభపాపగ్రహములున్నా, సమబలులైన, ఆమె భర్తతో పాటు మరణము పొంది స్వర్గము చేరును. లగ్నమునకు అష్టమమున శుభుడుండి, క్రూరదృష్టి, యుతి లేకున్న ఆమె భర్తకన్నా మున్నుగా చనిపోవును. నిశ్చయము.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 93
అంగ లక్షణ ఫలము:
జన్మ కాలమందలి చంద్ర, లగ్నములను బట్టి స్త్రీలకు సదసత్ఫలమును చెప్పినారు. శరీరచిహ్నములచే ఎట్లుండునో శివుడు చెప్పిన స్త్రీ అవయవలక్షణము, ఫలము, చెప్పెబడుచున్నది.
పాద లక్షణములు
స్త్రీ యొక్క పాదములు స్నిగ్ధముగా (నూనే రాసినట్లు నున్నగా, మృదువుగా, మెత్తగా, మాంసముకలిగి, సమముగా, ఎర్రగా, చెమట పట్టక, గోరువెచ్చగా ఉన్న భోగము అనుభవించును. కఠినముగా, గరుసుగా, విషమముగా, ఎరుపు లేక, మాంసము లేక చేటవలే ఉన్న దుఃఖము, దారిద్ర్యము సూచించును.
పాదరేఖా లక్షణములు
స్త్రీల పాదములందు పద్మ, శంఖ, ధ్వజ, ఛత్ర, మత్స్య, స్వస్తిక, చక్రరేఖలున్న ఆమె రాణియగును. పాదతలమున పొడవుగా ఊర్థ్వ రేఖలు సమస్త భోగప్రదములు. ఆ రేఖలు కాకి, ఎలుక, పాములను పోలియున్న దౌర్భాగ్యమునిచ్చును.
గోళ్ళ లక్షణములు
కాలిగోళ్ళు ఎర్రగా, వర్తులముగా, పొడవుగా, నున్నగా ఉన్న శుభములు. నల్లగా తెగిపోయిట్లున్న అశుభకరములు.
వ్రేళ్ళు లక్షణములు
బొటనవ్రేలు పుష్టిగా, గుండ్రముగా, పొడవుగానున్న సౌభాగ్యసూచకము, గుండ్రనకాక, చిన్నగా, వంకరగానున్న దౌర్భాగ్యద్యోతకము. కాలివ్రేళ్ళు సన్ననివి, పుష్టియైనవి. వర్తులములు, గట్టివి ప్రశస్తములు. పొట్టి, పొడుగుని, చిక్కినవి కూడదు.
కాలివ్రేళ్ళ యోగములు
పొడవైన వ్రేళ్ళున్న కులట, చిక్కిన వ్రేళ్ళున్న దరిద్రురాలు, పొట్టి వ్రేళ్ళున్నఅల్పాయుష్కురాలు, గరుసువ్రేళ్ళున్న దాసి, ఒకదానిపై నొకటి ఎక్కిన వ్రేళ్ళున్న విధవ, దుఃఖిత, పరుల నాశ్రయించినది అగును. మార్గమున నడచుచున్నపుడు ధూళి ఎగిరిపడిన ఆమె కులట, పతి మాతృ పితృ వంశములను నశింపజేయును. నడచునప్పుడు మధ్యవేలు కాని, అనామికగాని, చిటికైన వ్రేలుగాని భూమిని తగులకున్నఆమె విధవ యగును. బొటనవ్రేలి కన్నా తర్జని, స్త్రీకి పెద్దదిగా నున్న ఆమె చిన్నతనముననే పురుషుల మరగి, తరువాత స్వైరిణి, స్వేచ్చగా తిరుగునది యగును.
పాద పుష్టి
స్త్రీల పాదము పై భాగము స్నిగ్ధము నునుపైనది, మృదువైనది, బలిసినది సిరలు లేనిది, చెమట పట్టనిది, ఎత్తుగా ఉన్న ఆమె రాణి యగును. క్రిందికి వంగినది, సిరలు కలది, రోమములు కలది, మాంసము లేనిది అయిన దరిద్రురాలు, తిరిగెడిది, దాసి, దౌర్భాగ్యురాలు అగును.
పాద చీలమండల యోగములు
పాదముల ప్రక్క ప్రదేశము చీలమండలు సమముగా ఉన్న సౌభాగ్యవతి, స్థూలముగా నున్న దౌర్బాగ్యము కలది, ఎత్తుగానున్న కులట, పొడవుగా ఉన్న అతి దుఃఖిత అగును.
పిక్కలు
పిక్కలు గుండ్రనగాను, రోమములులేక, నున్నగా, సిరలు లేక యున్న ఆమె రాజాంగన యగును.
మోకాళ్ళు
మోకాళ్ళు గుండ్రంగా, నున్నగా, మాంసము కల్గియున్న శుభము. మాంసరహితమైన స్వైరిణియు, విడిపోయినట్లున్న దరిద్రయు అగును.
తోడలు
తొడలు గుండ్రనివి, మృదువైనవి, ఏనుగు తొండమువలె నున్నవి, అందమైనవి, లావైనవి, సిరలు లేనివిగా ఉండునో ఆమె రాజమహిషి అగును. రోమములుండి, గట్టిగానున్న దుర్భగ, విధవ అగును.
కటిప్రదేశము (మొలత్రాడు కట్టుకొనుచోటు) 24 అంగుళములుండుట మంచిది. పిరుదులు ఎత్తుగాను ఉండవలెను. కటి వ్రేలాడుచు, ముడుచుకొనిపోయి, గరుసుగాను, కండలేక, కొద్దిగాను, రోమములతో కూడియున్న వైధవ్యము కలిగించును.
కటి వెనుక భాగము
నితంబము (కటికి వెనుక భాగము) కండ కలది, ఎత్తైనది, స్థూలముగాను ఉన్న సౌభాగ్య సూచకము. మరొకరీతిగా ఉన్న దౌర్భాగ్యద్యోతకము.
భగ యోగము
స్త్రీ భగము (మర్మావయవము) తాబేటి చిప్పవలెను, ఎర్రగా, ఎత్తుగా, మృదువైన రోమములు కల్గియుండవలెను. భగనాసిక నిగూఢముగా ఉండవలెను. లేడిడెక్కవలెను, పొయ్యి మధ్యవలెను, రోమశమై వెడలుపైన ముఖము కలిగి, ముఖనాసికపైకి కన్పించుచున్న మంచిదికాదు. ఎడమవైపున ఎత్తుగానున్న కుమారికలు కుడివైపున ఎత్తుగా నున్న కుమారులు కలిగెదరు. ఎడమవైపు సుడివున్నది ఎప్పటికిని గర్భము ధరించదు.
వస్తి యోగము
వస్తి (నాభికి క్రింది ప్రదేశము) పెద్దది, మృదువైనది, కొద్దిగా ఎత్తైనది అయిన శుభదము. " సిరలు కల్గియుండి, రేఖలున్న శుభముకాదు. నాభి లోతుగాను, సుడిలాగ దక్షిణమునకు తిరిగియున్న అతి సౌఖ్యము నిచ్చును. ఎడమవైపునకు తిరిగి, ముడి కనిపించుచు, పైకి లేచిఉన్న మంచిదికాదు. కడుపు విస్తారముగా ఉన్న అనేక పుత్రులు కలుగుదురు; శుభప్రదము, కప్పవలెనున్న కడుపు, రాజులకు జన్మనిచ్చును. చాల మంచిది. పొట్ట యెత్తుగా ఉన్న వంధ్య యగును. త్రివలీయుక్తమైన సన్యసించును. సుడిఉన్న దాసీ వృత్తిచేయును.
పార్శ్వము ప్రక్క ప్రదేశములు పుష్టిగాను, సమముగాను, మృదువుగాను ఉన్న క్షేమమునిచ్చును. సిరలు కలవి, రోమములున్నవి. పొడవైనవి మంచివికాదు.
స్త్రీలకు హృదయము సమముగాను, రోమములు లేకయున్న శుభములు. విస్తారముగా రోమములు కలిగియున్న మంచిది కాదు.
స్తనములు సమమైనవి, బలిసినవి, గుండ్రనివి, గట్టివి శుభము. చివరకు లావైనవి, మాంసము లేనివి, వేరుగా నున్నవి అశుభములు. కుడిస్తనము ఎత్తుగానున్న పుత్రులను కనును. ఎడమది పెద్దదిగానున్న కుమారీ జన్మ నిచ్చును.
కుచాగ్రములు
కుచాగ్రములు గుండ్రంగా, నల్లగాఉన్న మంచిది. వ్రేలాడుచు, సన్నగా వంగి, లోనికి పోయి ఉన్న శుభప్రదములు కావు.
బాహువులు
బాహువుల పై భాగములు సమములు), సంధి కనిపించనివి, కండ కలవి మంచిది. వంగినవి, రోమములున్నవి, కండలేనివి, ఎత్తైనవి మంచివికావు.
చంకలు
చంకలు కొద్ది రోమకళ ఉన్న , నున్నగా, కండ కలిగియున్న మంచిది. సిరలుండి. చెనుటపట్టి. లోతుగా ఉన్న మంచివి కావు.
భుజములు
స్త్రీల భుజములు రోమములు లేనివి, సిరలు లేనివి, ఎముకలు కనబడనివి, సరళముగాను, గుండ్రనగాను, మృదువైన గ్రంథులు (ముడులు) కల్గివున్న మంచిది. సిరలున్నా, వంగియున్నా, మాంసము లేకున్నా, సన్నగా ఉన్న , గరుసురోమములున్నా స్త్రీకు దుఃఖమును, కష్టమును కలిగించును.
చేతి వేళ్ళు
చేతి వేళ్ళు తామర మొగ్గలవలెనున్న శుభప్రదము, వంగి. బలము లేకయున్న దుఃఖప్రదములు.
అరచేయ్యి
స్త్రీల చేయి( అరచెయ్యి)మధ్యలో ఉన్న తము, ఎర్రనిది, చిల్లులు లేనిది, వేళ్ళసందుల) మృదువుగాను, చిన్న రేఖలు కల్గియున్న సుఖప్రదము.
స్త్రీల అరచేయి బహు రేఖలున్న వెధవ్యము, అసలు రేఖలే లేకున్న దరిద్రము, సిరలున్న బిక్షుకవృత్తి కల్గును.
చెయ్యి పై భాగము
రోమములు లేనిది, కండ కలది, కోమలమైన చేయి పై భాగము (వెనుక భాగము) ఉత్తమము; సిరలతో కూడినది, రోమములున్నది, గుంటగా ఉన్న ది దౌర్భాగ్య లక్షణము.
చేతిలోని రేఖలవలన యోగములు
స్త్రీకి వామహస్తమున సువృత్తమైన, ఎర్రని, స్పష్టమైన, నున్నని, పరిపూర్ణమైన రేఖలు సౌభాగ్యప్రదములు. స్త్రీ చేతిలో మత్స్య రేఖవున్న సౌభాగ్యవతియు, స్వస్తిక రేఖయున్న ధనవతియు, దక్షిణావర్తమున్న చక్రవర్తి భార్యయు, శంఖ, కూర్మ, ఛత్ర చిహ్నములున్న రాజమాతయు అగును. ఎడమ చేతిలో ఏనుగు, అశ్వము, వృషభము, త్రాసు ఆకృతి రేఖలున్న వర్తకుని భార్య యగును. వజ్ర, ప్రాసాద రేఖలవలన శాస్త్రకర్తను కనును. శకటము, కాడి రేఖలున్న రైతు భార్య యగును. ధనుస్సు, చామరము, ఖడ్గము, శక్తి, త్రిశూలము, అంకుశము, గద, దుందుభీ ఆకార రేఖలున్న రాణి యగును. బొటనవ్రేలి మొదటనుండి చిటికెన వేలివరకు వెళ్ళిన రేఖయున్న మగని చంపును. (విధవ యగును). ఆమెను వివాహమాడరాదు. గాడిద, కాకి, కప్ప, తేలు, తోడేలు, పిలి. సర్పము, ఒంటె, నక్కలయొక్క రేఖలు క్లేశకరములు. సృష్టకణువులు కలిసి గుండ్రనివి, సన్ననివి, పొడవైనవి, రోమములు లేనివి, మృదువైన చేతివ్రేళ్ళు సుఖసౌభాగ్యముల నిచ్చును. వంకరవి, ఎక్కువ కణుపులున్నవి, కణుపులేనివి, సన్ననివి, రోమములున్నవి, మరీ పొట్టివి, దుఃఖమును, దారిద్ర్యమును ఇచ్చును,
వేలి గోళ్ళు
స్త్రీల వ్రేళ్ళగోళ్ళు ఎర్రగా, ఎత్తుగా, శాఖలు కలిగియున్న శుభము. నల్లగా పచ్చగా, తెల్లగా ఉన్న అశుభము నిచ్చును.
పృష్ఠ భాగము
స్త్రీల వీపు ఎముకలు కనపడకుండా కండ కలిగియున్న మంచిది. సిరలుండి రోమములుండి, వంగియున్న శుభప్రదముకాదు.
కంఠము
మూడు రేఖలున్నది, గుండ్రనిది, ఎముకలు కనపడనిది, పుష్టికలది. మృదువైనది అయిన కంఠము స్త్రీలకు సౌభాగ్యదము. స్థూలము వైధవ్యమును, వంకరది దాసీత్వమును, గరుసుగా గట్టిగా ఉన్న ది సంతానహీనమును చేయును.
కంఠపు ముడి
కంఠము పైకైత్తినపుడు కనిపించు కంఠపుముడి కండకలిగి, సరళమై, ఎత్తుగానున్న మంచిది, సిరలుకల్గి వెడల్పుగా, వంకరగా, రోమములు కలిగివున్న శుభముకాదు.
గడ్డము
స్త్రీలగడ్డము మృదువుగా, పుష్టికలిగి, ఎర్రగా ఉన్న శుభప్రదము. లావుగా బలిసి, రేఖలుకలిగి, రెండుగా చీలియున్న, పొడవుగాఉన్న అశుభము.
చెక్కిళ్ళు
స్త్రీల చెక్కిళ్ళు (చెంపలు) గుండ్రంగా, పుష్టిగా, ఎత్తుగా, పొడవుగాఉన్న శుభప్రదము
ముఖము
స్త్రీముఖము గుండ్రంగా, పుష్టికలిగి, సువాసన కలిగి, నున్నగా, సమముగా, అందముగా ఉన్న సౌభాగ్యద్యోతకము.
అధరము
ఎర్రని, చక్కని, నున్నని, గుండ్రని, మధ్యన రేఖతో విభజింపబడిన, అందమైన పెదవికల స్త్రీ మహరాజపత్ని యగును. ఎండిన, కఠినమైన, పొడవైన, బిరుసైన, నల్లని, బలసిన పెదవి వైధవ్యమును, బాధను కలుగజేయును. ఎర్రతామరపువ్వుతో సమమైన, స్నిగ్ధమైన. : పెదవి మధ్యన ఎత్తున్నది. రోమరహితమైనది సౌభాగ్యమును, సుఖమును ఇచ్చును.
దంతములు
పాలరంగులో ఉన్న వి, నున్ననివి, 32 ఉన్న వి, క్రింద పైన సమాసముగా ఉన్నవి, కొంచెత్తున్నవియైన పళ్ళు శుభములు. ఎత్తుపల్లములుగా ఉన్న వి, నల్లనివి, పొడవైనవి, పచ్చనివి, రెండు వరుసలున్నవి. క్రింద ఎక్కువగా ఉన్న వి, విరళముగా (పంటికి పంటికి మధ్య కాళీ ఉండునట్లు) ఉన్నవి అశుభములు.
జిహ్వము
స్త్రీల, జిహ్వ కోమలమైనది, ఎర్రనిది అయిన అమిత భోగము నిచ్చును. చివరన వెడల్పు, మధ్యన నొక్కుకొనిపోయి యున్న కష్టమునిచ్చును. తెల్లగా ఉన్న జలమరణము కలుగజేయును. నల్లగా ఉన్న కలహమును, మోటుగా ఉన్న దారిద్ర్యమును, పొడవుగా ఉన్న అభక్ష్య భక్షణమును వెడల్పుగా ఉన్న ప్రమాదమును కలుగజేయును.
దవడలు
స్త్రీల దవడలు నున్నగా, మృదువుగా, ఎర్రగా ఉన్న ఉత్తమము. తెల్లగా ఉన్న వైధవ్యసూచకము. పచ్చగానున్న సన్యాసమిచ్చును. నల్లగాఉన్న సంతానము లేకుండ జేయును. కఠినముగా ఉన్న బహు కుటుంబమును కలుగజేయును.
హాస్యము
నవ్వుచున్నప్పుడు పళ్ళు కనిపించనిది, చెక్కిళ్ళు విప్పారినది అయినది శుభదమని మునులచే చెప్పబడినది. తక్కినది అశుభదము.
నాసికం
సమానముగా వర్తులముగానున్న ముక్కుపుటములు కలది, చిన్నరంధ్రములుకలది శ్రేష్ఠము. చివర లావైనది, మధ్యన పల్లముగా నున్నది అశుభము.
చివర ఎర్రగా ఉండి, నొక్కుకొనిపోయిన వైధవ్యము నిచ్చును. గట్టిగా ఉన్న ది దాస్యము నిచ్చును. సన్నగా, పొడవుగా ఉన్న కలహప్రియము.
నయనము
కనుకొలకులు ఎర్రగానుండి, నల్లని కనుగ్రుడ్లుకలిగి, ఆవుపాలవలె తెల్లనై, స్నిగ్ధమై, నల్లని కనుబొమ్మలుకల కన్నులు శుభప్రదములు.
నేత్రఫలము
కన్నులెత్తుగా ఉన్న అల్పాయువు, వర్తులముగా ఉన్న కులట, తేనెకన్నులున్న " సర్వసౌభాగ్యమును, ఎడమకన్ను కాయకన్నైన కులటయు, కుడికన్నైన వంధ్యయు, పావురపు కన్నులు కలది శీలహీనయు, ఏనుగు కన్నులుకలది దుఃఖభాగిని అగును.
కను రెప్పలు
సూక్ష్మములైన, నల్లని, మృదువైన, దళసరియైన రెప్పలచే సుఖము భాగ్యము కలుగును. పల్చని, స్థూలమైన, పిశంగవర్ణమైన రెప్పలున్న దుఃఖిత యగును.
కనుబొమ్మలు
కనుబొమ్మలు వింటి ఆకృతి వంగినవి, నున్ననివి, నల్లనివి, మరీ ఒత్తు కానివి, మృదువైన రోమములు కలవి సుఖమును కీర్తిని ఇచ్చును.
కర్ణము
చెవులు వెడల్పుగా వ్రేలాడునవి, మంచి ఆవృత్తికలవి, సౌభాగ్యమును, సుతులను ఇచ్చును. పైన చెవిలేనివి, సిరలున్నవి, వంకరవి, చిన్నవి నింద్యములు.
మొగము
సిరలులేనిది, రోమరహితము, అర్థచంద్రునితో సమమైన తన మూడువ్రేళ్ళ వెడల్పునకు, తక్కువకానిది స్త్రీలకు సౌఖ్యము నిచ్చును. స్వస్తికమువలెనున్నది రాజ్యము నిచ్చును. రోమములున్న ఎత్తైన, పొడవైన మస్తకము (మొగము) ఫాలము దుఃఖము నిచ్చును.
మస్తకము
ఏనుగు కుంభస్థలమువలె ఉన్నతము, వర్తులమునైన తల శుభము. విశాలము, కుటిలము, వెడల్పైన తల దౌర్భాగ్యమును, క్లేశమును ఇచ్చును.
కేశములు
స్త్రీలకు జుట్టు నల్లగా, చిక్కగా, నున్నగా, పొడవుగా, సన్నగా ఉన్నవి మంచివి. పచ్చనివి, గరుసువి, బిరుసువి, పల్చగా ఉన్న వి, పొట్టివి మంచివికావు. గౌరవర్ణమైన స్త్రీకి పింగళములుకాని, నల్లనివికానిమంచివి. ఇట్లే పురుషులకును అవయవలక్షణమును చెప్పవలెను.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 94
తిలాదిలక్ష్మ ఫలము:
దేహమందు పుట్టిన, మశక, ఆవర్త, తిలచిహ్నములకు ఫలము చెప్పబడుచున్నది;
పుట్టుమచ్చలు శుభాశుభములు:
స్త్రీలకు ఎడమవైపున, పురుషులకు కుడివైపున ఎర్రని లేక తిలసదృశమైన మచ్చలు, సుడులను విద్వాంసులు శుభములుగా చెప్పుదురు. స్త్రీలకు హృదయము తిలాదిచిహ్నము సుఖసౌభాగ్యవర్ధకము. స్త్రీకి దక్షిణ స్తనమున ఎర్రని తొలచిహ్నము సుఖ, సౌభాగ్యవర్ధకమేగాక సంతతిప్రదమును. వామస్తనమున రక్తతిలచిహ్నము. ఏకపుత్రప్రదము. దక్షిణస్తనమున తిలచిహ్నము. పుత్రీపుత్ర ప్రదము. ఫాలమున, కనుబొమ్మలమధ్యన తిలచిహ్నము రాజ్యప్రదము. చెంపల పై మశకచిహ్నము మృష్టాన్న ప్రాప్తి నిచ్చును. భగమునకు దక్షిణభాగమున మచ్చఉన్న స్త్రీ రాజమహిషి. రాజమాత యగును. ముక్కుచివర ఎర్రని మచ్చ రాణియగుటకు సూచన. నల్లని మచ్చవున్న విధవకాని, స్వైరిణి స్వేచ్చగా తిరుగునది అగును. స్త్రీలకుగాని పురుషులకుగాని నాభికి దిగువన మచ్చ ఉండుట మంచిది.
చెవియందు, చెక్కిళ్ళయందు, హస్తముందు, కంఠమందు, మచ్చవున్న ప్రథమగర్భమున కుమారుని కనును. సత్సౌభాగ్యము, సుఖము కలుగును. చీలమండ యందు తిలాది చిహ్నములుయున్న క్లేశ ప్రదము.
కపాలమున త్రిశూలమువంటి చిహ్నము కనిపించిన పురుషుడు రాజు, స్త్రీ రాణి యగును. రొమ్మునకు, నాభికి, చేతికి, చెవికి కుడివైపున రోమావర్తము (సుడి) ఉన్న , వీపుమీద కుడివైపున ఉన్న ప్రశస్తము. నాభిక్రింద ఎడమవైపుగా ఉన్న అశుభము.
స్త్రీలకు సుడి మొల, గుహ్యప్రదేశమున ఉన్న దుఃఖప్రదము. పొట్టమీద ఉన్న సోదరులకు నష్టము; వీపు మధ్యనున్న స్వైరిణి యగును. పాపిటలోను, మొగముమీద, శిరసు మధ్యన, కంఠమున వున్న, స్త్రీలకుగాని, పురుషులకుగాని శుభము కాదు. మంచి లక్షణముకల స్త్రీలు అల్పాయుష్కుడైన భర్తనుకూడ దీర్ఘాయుష్కుని, ప్రసన్నుని చేయగలుగుదురు.
మచ్చలవలన కలుగు ఫలములు.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 95
పూర్వజన్మ శాప వర్ణనాధ్యాయము:
ధర్మిష్ఠులైన విద్వాంసులు పుత్రహీనులు అగుచున్నారు. పుత్రహీనునకు సద్గతి లేదని శాస్త్రము. వారికి పుత్రహీనత ఎందువలన వచ్చినది? వారికి సుత ప్రాప్తి ఎట్లు కలుగును. ?
లగ్నాత్తు పుత్రభావ కారణమును చెప్పుచున్నారు.
దీనినే పూర్వము పార్వతి అడుగగా శివుడు చెప్పినరీతి చెప్పబడుచున్నది.
పార్వతి శంకరుని ప్రశ్నించినది. మనుష్యులకే దురితమువలన సంతానము లేకపోవుట కలుగును. ? అది తెలిసికొనుట, పరిహరించుకొనుట ఎట్లో నాకు చెప్పము. అనగా
శంకరుడు: దేవీ! నీ ప్రశ్న మంచిదే. సంతాన నాశక యోగములను వాటినుండి రక్షించుకొను ఉపాయములను ఈవిధంగాచెప్పెను.
అనపత్య యోగము
గురువు, లగ్నాధిపతి, దారాస్థానాధిపతి, పంచమ గృహాధిపతి నిర్బలులుగా వున్నట్లయితే ఆ జాతకులు నిస్సంతులవుతారు. అదే విధంగా పుత్రస్థానమందు రవి, కుజ, రాహులు మరియు శని బలంగా వుండి, పుత్రకారక గ్రహం బలహీనంగా వున్నట్లయితే కూడా ఆ జాతకులకు సంతానం కలుగదు.
సర్ప శాపవశమున పుత్రక్షయ యోగము
రాహువు పంచమమున ఉండి కుజునిచే చూడబడినా, కుజుక్షేత్రమున రాహువున్నా, సర్పశాపమున పుత్రులు కలుగరు. పంచమాధిపతి రాహువుతో కూడియున్నా, శని పంచమమందున్నా, చంద్రునితో కూడినా, చూడబడినా సర్పశాపము. పుత్రకారకుడైన గురుడు రాహువుతో కలిసియున్నా, పంచమాధిపతి దుర్బలుడైనా, లగ్నాధిపతి కుజునితో కలిసియున్నా సర్పశాపము. పుత్రకారకుడు గురుడు కుజునితో కలిసియున్నా, లగ్నమున రాహువున్నా, పంచమాధిపతి దుష్టస్థానమున నీచ, శత్రురాశిలో ఉన్నా సర్పశాపము. కుజాంశలో కుజుడున్నా, పంచమాధిపతి బుధుడైనా, లగ్నమున రాహువు మాంది ఉన్నా, సర్పశాపము. పంచమము కుజు క్షేత్రమై, పంచమాధిపతి రాహువుతో కలిసియున్నా, బుధునితో కలిసినా, చూడబడినా సర్పశాపము. పంచమమున రవి, శని, కుజులు, రాహు, గురు, బుధులు ఉండి, పంచమ, లగ్నాధిపులు బలహీనులైనా సర్పశాపము. లగ్నాధిపతి రాహువుతో కూడినా, పంచమాధిపతి కుజయుతుడైనా, కారకుడు రాహు సహితుడైనా సర్పశాపము.
దోషశాంతి ఉపాయము
ఇట్లు గ్రహస్థితివలన అనపత్య కారణము తెలిసికొని, ఆ దోషపరిహారమునకై నాగపూజను చేయవలెను. స్వగృహ్యోక్త విధానమున నాగప్రతిష్ఠ చేసి, బంగారముతో నాగమూర్తిని చేయించి, పూజచేయవలెను. గోవు, భూమి, తిలలు, బంగారము యథాశక్తిగా దానము చేయవలెను. ఇట్లు చేసిన, నాగేంద్రానుగ్రహమున సంతతి కలిగి, కులము వృద్ధిపొందును.
పితృ శాపమువలన సుతక్షయ యోగము
1. రవి పంచమమున నీచయందు శని నవాంశలో ఉండి, రెండు ప్రక్కల చతుర్థ షష్ఠములందు క్రూరగ్రహ సంబంధమున్న పితృశాపమువలన సుతక్షయమగును. 2. రవి పంచమాధిపతయై త్రికోణమున పాపునితో కలిసియుండి, మరొక పాపగ్రహముచే చూడబడినా, 3. రవి రాశిలో గురుడు, గురురాశిలో రవియుండి పంచమము, లగ్నమును పాపయుక్తమైనా, 4. లగ్నాధిపతి దుర్భలుడై పంచమమందుండి, పంచమాధిపతి రవితోకూడి, లగ్నపంచమములు పాపయుక్తములుకాగా, 5. పంచమ నవమాధిపతులు పరివర్తనులైన, లగ్నపంచమములు పాపయుక్తమైనా, 6. దశమాధిపతి కుజుడై పంచమాధిపతితో కూడి లగ్నపంచమ దశమములు పాపయుక్తములుకాగా, 7. దశమాధిపతి పాపస్థానగతుడై, కారకుడైన గురుడు పాపరాశిగతుడై లగ్నపంచమాధిపతులు పాపులతో కూడివుండగా, 8. రవికుజ శనులు లగ్నపంచమములందుండగా, అష్టము వ్యయములందు గురు రాహువులుండగా , 9. అష్టమమున రవి, శని పంచమమున ఉండి, పంచమాధిపతి రాహువుతో కూడి యుండగా, 10. వ్యయాధిపతి లగ్నమున అష్టమాధిపతి పంచమమున దశమాధిపతి అష్టమమున ఉండగా 11. షష్ఠాధిపతి పంచమమున, దశమాధిపతి షష్ఠమున, గురువుతో కూడియుండగా పితృశాపమున సుతక్షయము, సంతానము కల్గకుండుట జరుగును.
పితృ శాప శాంతి ఉపాయము
దోషపరిహారమునకై గయాశ్రాద్ధము చేయవలెను. పదివేల మందికి గాని, వేయిమందికి గాని బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. కన్యాదానము చేసి, దూడతో కూడిన గోవును దానము చేయవలెను. ఇట్లు చేసిన పితృశాపము నుండి ముక్తుడగును. పుత్రపౌత్రాదులతో కులము వృద్ధి నొందును. గ్రహవశమున ఫలము నీ రీతిగా చెప్పవలెను.
మాతృ శాపమువలన సుతక్షయ యోగము
పంచమాధిపతియైన చంద్రుడు నీచయందుగాని, పాపుల మధ్యగాని, చతుర్థ పంచమములందు పాపునితో కూడియున్నా గాని, 2. లాభమందు శని, చతుర్థమున పాపి, పంచమమున నీచయందు చంద్రుడు ఉన్న, 3. పంచమాధిపతి త్రిక (6, 8, 12) లందుండి, లగ్నాధిపతి నీచయందుండి, చంద్రుడు పాపయుక్తుడుకాగా, 4. పంచమాధిపతి దుష్టస్థానమున ఉండి, చంద్రుడు పాపాంశయందుండి, లగ్న పంచమములు పాపయుక్తములుకాగా, 5. పంచమాధిపతి చంద్రుడు శని రాహుకుజయుక్తుడై నవమమున, పంచమమునగాని ఉన్న, 6. చతుర్థాధిపతి కుజుడు శనిరాహుయుతుడై రవి చంద్రులతో లగ్నముకాని పంచమముకాని కూడికొనగా, 7. లగ్న పంచమాధిపతులు షష్ఠమున, చతుర్థాధిపతి అష్టమమున, దశమ అష్టమాధిపతులు లగ్నమున ఉన్న షష్ఠాష్టమాధిపతులు లగ్నమున, చతుర్థాధిపతి వ్యయములందు, పంచమమున చంద్రుడు, గురుడు పాపాయుతుడైనా, 9. లగ్నము పాప మధ్య గతముకాగా, క్షీణచంద్రుడు సప్తమమున, చతుర్థపంచమములందు రాహుశనులున్నా మాతృ శాపమువలన సంతానము కలుగదు.
మరియు
అష్టమాధిపతి పంచమమున, పంచమాధిపతి అష్టమమున వుండి, చంద్ర, చతుర్థాధిపతులు దుష్టస్థానములందున్నా, 2. చంద్రక్షేత్రమైన లగ్నమున కుజ రాహుపులుండి, శనిచంద్రులు పంచమమందున్నా, 3. లగ్న పంచమ అష్టమ వ్యయములందు కుజరాహురవి శనులుండి, చతుర్థ లగ్నాధిపతులు దుష్టస్థానము (6, 8, 12) లందున్నా, 4.గురుడష్టమమున కుజరాహువులతో కూడియుండి, పంచమమున శని చంద్రులున్నా మాతృశాపమున సంతానము కలుగదు.
మాతృ శాప శాంతి ఉపాయము
దానిశాంతికై సేతువున స్నానముచేసి, లక్షగాయత్రీజపము చేసి, గ్రహదానము చేసి, పుడి సెడు పాలుత్రాగి ఉపవాసముండి, బ్రాహ్మణులకు భోజనము పెట్టి, అశ్వత్థప్రదక్షిణములు1008 భక్తిశ్రద్ధలతో చేసిన శాపముక్తియై సంతానము కలును వంశవృద్ధి అగును.
భాతృ శాపవశమున సంతతిక్షయ యోగములు
భ్రాతృశాపమున వలన వచ్చిన యోగములు. అవి విన్నందున జనులు శాపవిముక్తికి ప్రయత్నింతురు.
1. తృతీయాధిపతి పంచమమున, కుజ రాహుపులతో కూడియుండి, లగ్నపంచ మాధిపతులు అష్టమమున ఉన్న, 2. లగ్నమున కుజుడు, పంచమమున శని, తృతీయాధిపతి భాగ్యమున, కారకుడు అష్టమముఉన్న , 3. తృతీయమున గురుడు నీచయందుండి, శని పంచమమున ఉండి, చంద్రకుజులు అష్టమమున ఉన్న, 4. లగ్నాధిపతివ్యయమున, కుజుడు పంచమమున, సపాపుడైన పంచమాధిపతి అష్టమమున ఉన్న, 5. లగ్నపంచమములు పాపులమధ్యనుండి, పంచమలగ్నాధిపతులు 6, 8, 12 లందున్నా, 6. దశమాధిపతి తృతీయమందుండి, పాపయుక్తమై, పంచమమున కుజుడున్నా, 7. బుధక్షేత్రమైన పంచమమున శనిరాహువులుండి, వ్యయమున కుజబుధుడున్నా, 8. లగ్నాధిపతి తృతీయమున, తృతీయాధిపతి పంచమమున వుండి, లగ్నతృతీయపంచమములు పాపయుక్తములైనా, 9. తృతీయమున కారకుడు గురుడు, లేదా పంచమమున రాహు శనిలతో కూడికాని, చూడబడుచుకాని యున్నా, 10. అష్టమాధిపతి పంచమమున తృతీయాధిపతితో కూడియుండి, అష్టమము కుజశనులతో కూడగా భ్రాతృ శాపమున సంతానము కలుగదు.
భాతృ శాప శాంతి ఉపాయము
భ్రాతృశాపము పోవుటకై విష్ణుసహస్రనామ పారాయణము చేసి, చాంద్రాయణ వ్రతము చేయవలెను. కావేరీనది గట్టున విష్ణుసన్నిధిలో అశ్వత్థ స్థాపన చేసి, పదిగోవులను దానము చేయవలెను. ప్రాజాపత్య వ్రతము చేసి, ఫలముతో కూడిన భూమిని దానము చేయవలెను. ఇట్లు భక్తితో చేసినవానికి పుత్రవృద్ధి కలుగును.
మాతుల శాపమున సంతతి క్షయయోగములు :
1. పంచమమున బుధుడు, గురువు రాహు కుజయుతులుకాగా, లగ్నమున శనియున్నా, 2. లగ్న పంచమాధిపతులుపంచమమున, శని బుధ కుజులతో కూడియుండగా, 3. పంచమాధిపతి అస్తంగతుడై లగ్నమున ఉండి, సప్తమమున శని, బుధుడు, లగ్నాధిపతి యుండగా, 4. చతుర్థాధిపతి లగ్నమున వ్యయాధిపతితో కలిసియుండగా చంద్ర, కుజ, బుధులు పంచమమందున్నా మాతుల శాపమున సంతతి కలుగదు.
మాతుల శాప శాంతి ఉపాయము
ఆ దోషపరిహారమునకై విష్ణుస్థాపనము, వాపీకూప తటాకాది నిర్మాణం, సేతుబంధనము చేయించవలెను. అతనికి పుత్రవృద్ధి, సంపదద్ధి కలుగును. ఇట్లు యోగానుసారమున పండితుడు శాంతిని చెప్పవలెను.
బ్రహ్మ శాపము వలన సంతతిక్షయ యోగములు:
బల, సంపత్తిగర్వముతో ఎవడు బ్రాహ్మణులను అవమానించునో వానికి ఆ దోషమువలన, బ్రహ్మ శాపము వలన సంతతి కలుగదు. 1. గురుక్షేత్రమునరాహువుండి, కుజగురుశనులు పంచమమున ఉండి, నవమాధిపతి అష్టమమందున్న బ్రహ్మ శాపమువలన సంతతి కలుగదు. 2. నవమాధిపతి పంచమమున, పంచమాధిపతి అష్టమమున గురుకుజురాహువులతో ఉన్న, 3. నవమాధిపతి నీచగతుడై, వ్యయాధిపతి లగ్నమునగాని, పంచమమునగానియున్నా, రాహువుతో కూడినా, చూడబడినా, 4. గురుడు నీచగతుడై, రాహు లగ్నపంచమములందుండి, పంచమాధిపతి 6, 8, 12 లందున్నా, 5. పంచమాధిపతి, గురుడు అష్టమమునపాపయుక్తులై, రవి చంద్రులతో కలిసియున్నా, 6. శన్యంశలో శనియుండి, గురుకుజులతో కూడి వుండి, పంచమాధిపతి వ్యయమందున్నా, 7. శనియుతుడైన గురుడు లగ్నమున, నవమమున రాహువు, వ్యయమున గురుడు ఉన్న బ్రహ్మ శాపమువలన సంతానము కల్గదు.
బ్రహ్మ శాప శాంతి ఉపాయము
దోషశాంత్రికై చంద్రాయణ వ్రతముచేసి, బ్రహ్మకుచ్ఛ్రములు మూడు చేసి, దక్షిణతో ధేనువును, బంగారముతో పంచరత్నములను దానము చేసి, బ్రాహ్మణులకు అన్నదానము చేయవలెను. ఇట్లు చేసిన సత్పుత్రుని పొందును. శాపమునుండి విముక్తుడై, పరిశుద్దుడై సుఖము పొందును.
పత్నీ శాపమున సుతక్షయ యోగములు
1. సప్తమాధిపతి పంచమమున, శని సప్తమేశుని అంశలోను, పంచమాధిపతి అష్టమమున ఉన్న, 2. సప్తమాధిపతి అష్టమమున, అష్టమాధిపతి పంచమమున ఉండి, పుత్రకారకుడు పాపయుక్తుడైనా, 3. శుక్రుడు పంచమమున, సప్తమాధిపతి అష్టమమున, కారకుడు పాపయుక్తుడైనా, 4. కుటుంబస్థానము పాపయుక్తమై, సప్తమాధిపతి అష్టమమునుండి, పంచమము పాపయుక్తమైనా, 5. శుక్రుడుభాగ్యమున, సప్తమాధిపతి అష్టమమునవుండి, లగ్నపంచమములు పాపయుక్తములేనా, 6. శుక్రుడు భాగ్యాధిపతియై, పంచమాధిపతి శత్రుస్థానమునపుండి; గురుడు, లగ్న సప్తమాధిపతులు 6, 8, 12 లందున్నా పత్నీశాపమువలన సంతానము కలుగదు.
మరియు
1. పంచమము శుక్రక్షేత్రమై రాహుచంద్రయుక్తమై, 1, 12, 2ల పాపులున్న స్త్రీశాపమువలన సంతతి కలుగదు. 2. సప్తమమున శని శుక్రులుండి, అష్టమాధిపతి పంచమమున ఉండి, రవి లగ్నమున రాహుయుక్తుడెనా, 3. కుజుడు 2న, 12న గురుడు, శుక్రుడు పంచమమున పుండి, శనిరాహువులచే చూడబడినా 4. ధన, సప్తమాధిపతులు అష్టమమునుండి, పంచమ, లగ్నముల శనికుజులుండి, కారకుడు పాపయుక్తుడెనా, 5. లగ్న, పంచమ, భాగ్యములందు క్రమముగా రాహు శని కుజులుండి, పంచమ సప్తమాధిపతులు అష్టమమున ఉన్న పత్నీశాపమున సంతతి కలుగదు.
పత్నీ శాప శాంతి ఉపాయము
శాపవిముక్తికై కన్యాదానమును చేయవలెను. లక్ష్మీ నారాయణమూర్తిని బంగారుదానిని, పది ధేనువులను, అలంకారమును, శయ్యను, వస్త్రమును బ్రాహ్మణులకు దానము చేయవలెను. సౌభాగ్యము, సుతుడు కలుగుటకై దంపతులకు ధేన్వాదుల నియ్యవలెను.
ప్రేత శాపమున సుతక్షయ యోగములు
1.పంచమమున రవిశనులు, సప్తమమున క్షీణచంద్రుడు, లగ్న ద్వాదశములందు రాహుగురులున్నా, 2. పంచమాధిపతి శని అష్టమమున, కుజుడు లగ్నమున, కారకుడష్టమమున ఉన్న, 3. లగ్నము పాపయుక్తమై, వ్యయమున రవి, పంచమమున కుజుడు, శని బుధులు, పంచమాధిపతి అష్టమమున ఉన్న, 4. లగ్నము రాహుయుక్తమై, పంచమమున శని ఉండి, గురుడష్టమమున ఉన్న, 5. గురుశుక్రులు రాహువు లగ్నమున, శని చంద్రులుకూడ ఉండి, లగ్నాధిపతి అష్టమమునున్నా, 6. కారకుడు, పంచమాధిపతి నీచస్థులై నీచస్థ గ్రహములచే చూడబడినా, 7. లగ్నమున శని, పంచమమున రాహువు, అష్టమమున రవి, వ్యయమునకుజుడు ఉన్న, 8. సప్తమాధిపతి 6, 8, 12 లందుండి, పంచమమున చంద్రుడుండి, లగ్నమున శని, గుళికులున్నా, 9. శనిశుక్రులతో కూడి అష్టమాధిపతిపంచమమున, కారకుడష్టమమున ఉన్న ఈ యోగములందు ప్రేతశాపము వలన సంతానము కలుగదు.
ప్రేత శాప శాంతి ఉపాయము
దోషశాంతికై గయాశ్రాద్ధము చేయవలెను. రుద్రాభిషేకముచేసి, బ్రహ్మ మూర్తిని, ధేనువును, వెండి పాత్రను, నీలమణిని దానము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టి, దక్షిణనియ్యవలెను. అన్నిటిని ఇట్లు చేసిన శాపమోక్షమగును. అతనికి పుత్రులు కలిగి వంశవృద్ధి యగును.
గ్రహ దోషశాంతికై మార్గములు
బుధశుక్ర జనిత దోషము శివపూజవలనా, గురుచంద్ర దోషము మంత్ర, యంత్ర, ఔషధములవలనా, రాహుదోషము కన్యాదానమువలనా, రవిదోషము విష్ణుపూజవలనా, కేతుదోషము గోదానము వలనా, కుజ, శనిదోషము రుద్రీయ జపమున శాంతించును. పుత్రప్రాప్తి కలుగును. సర్వవిధదోషశాంతికై భక్తిపూర్వకముగా హరివంశ శ్రవణము చేసిన చిరంజీవియగు సంతానము కలుగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 96
ప్రశ్నాధ్యాయము :
ఇప్పుడు మనుష్యులకు ప్రశ్నల చేతనే మనోగతభావమును, పథికా గమానాదికమును స్త్రీ పుత్రలాభ హాని, మరణము, జీవనము, రోగి విషయము అన్నియు ప్రశ్నతో ఎట్లు చెప్పవచ్చునో చెప్పబడుచున్నది. ముందు భావములవలన విచార్యవిషయములను తెలిసికొని, భావముల బలాబలములను తెలిసి, శుభాశుభఫలము చెప్పవలెను.
భూమినుండి విచారించు విషయములు
ప్రశ్నించువాని శీలము, సుఖదుఃఖములు, లగ్నమునుండియు; సువర్ణ, రత్నలాభము, నష్టము ద్వితీయమునుండి; పరాక్రమము, సోదరులు, భృత్యసుఖము తృతీయమునుండి; మిత్రులు, గృహ, గ్రామ, మాతృ, వాహన, సుఖములు చతుర్థమునుండి; సంతానము, బుద్ధి, శాస్త్రములుపంచమమునుండి; శత్రు, మాతుల, రోగవ్రణములు షష్ఠమువలన; వివాద, భార్యా వాణిజ్య, గమనాగమనములు సప్తమమువలనా, ; మృత్యు, యుద్ధ, రోగ భయములు అష్టమమువలనా, ; వాపీ, కూప, దేవాలయ నిర్మాణములు నవమమువలనా, ; రాజ్యము, పితృసుఖము, రాజకార్యములు దశమమువలనా, ; కన్య. కాంచనము. ధాన్యము, జ్యేష్ఠ సోదరులు లాభభావము వలనా, శత్రువు చేసిన అడ్డంకులు, భోగము, దానము, కార్యవ్యయము ద్వాదశమువలనా, తెలియవలెను.
భావముల బలాబల విచారము
భావము, తన అధిపతి, శుభగ్రహములతో కూడినా, చూడబడినా బలము కలది. పాపగ్రహములతో కూడినా, చూడబడినా దుర్బలము. మిశ్రము మధ్యమము.
కపటప్రశ్న
ప్రశ్నకుండలిలో శనిచంద్రులు లగ్నముందుండి, బుధుడు రశ్మిహీనుడై, రవి కుంభమున ఉన్న పృచ్చకుడు దుష్టభావముతో వచ్చెనని నిర్ణయించునది.
కార్యసిద్ధి యోగము
1. ప్రశ్నలగ్నాధిపతి లగ్నమును, కార్యాధిపతి కార్యగృహమును, 2. లగ్నాధిపతి కార్యమును, కార్యాధిపతి లగ్నమును చూచినా, 3. తమతమ భావములందున్న లగ్నేశ కార్యేశులు పరస్పర దృష్టికలవారైనా, ఆ మూడు యోగములందును ప్రయత్నముమీద కార్యసిద్ధి అగును. లగ్న కార్యాధిపతులు పూర్ణచంద్రునిచే చూడబడిన అనాయాసముగా కార్యసిద్ధి అగును.
యోగాంతరము
ప్రశ్నలగ్నము శుభగ్రహయుక్తమైనా, శుభగ్రహ షడ్వర్గున ఉన్న , శీర్షోదయరాశి (మి, సిం, కన్య, తు, వృశ్చి, కుం) లగ్నగతమైనా కార్యసిద్ధిశీఘ్రముగా అగును. పాపగ్రహయుక్తమైనా, పాపషడ్వర్గు అయినా, కార్యసిద్ధికాదు. శుభపాప మిశ్రమైన ఆలస్యముగా కార్యసిద్ధి అగును.
రత్నాది మృత్తికాంతము ధాతువులు. మనుష్యాది క్షుద్రజీవాంతము జీవులు, వృక్షాది తృణాంతను మూలములు. గుప్పిట్లో పెట్టుకొనికాని, మనస్సులో అనుకోని ప్రశ్నవేసిన స్వనవాంశస్థ గ్రహము ప్రశ్నలగ్నమును, లేక నవమ పంచమములలో తన నవాంశను చూచినధాతుప్రశ్న. ఇతరుల నవాంశయందున్న గ్రహము ప్రశ్నలగ్నము పంచమ, నవమముల తన నవాంశను చూచిన జీవచింత; పర నవాంశస్థ గ్రహము ప్రశ్న లగ్న త్రికోణములలో పర నవాంశను చూచినమూలచింత. సమరాశిలో ప్రథమ నవాంశము లగ్నమైన జీవచింత, ద్వితీయనవాంశమైన మూలచింత, తృతీయనవాంశమైన ధాతుచింత, 4లో జీవ, 5లో మూల, 6లో ధాతు ఇట్లే విషమరాశిలో ప్రథమనవాంశలో ధాతుచింత, ద్వితీయ నవాంశలో మూలచింత, తృతీయనవాంశలో జీవచింత. అదేవిధముగా తక్కినవి.
పథిక గమనా గమన విచారము
ప్రశ్నలగ్నమునకు చతుర్థ దశమములందు శుభగ్రహమున్న వెళ్ళినవాడు వెళ్ళును. పాపగ్రహములున్న ఆగంతుకుడు రాడు. లగ్నచతుర్థ దశమములనుండి ఎన్ని రోజులలో తరువాతి రాశికి గ్రహమువెళ్ళునో అన్ని రోజులలో పథికుడు వచ్చును.
శీఘ్ర గమన యోగము
ప్రశ్న లగ్నమునకు సప్తమమున చంద్రుడు, నవమాధిపతిరాశికుత్తరార్థమున ఉన్న , పథికుడు మార్గమున వచ్చుచున్నాడు. ప్రశ్న లగ్నమునకు చతుర్థమున గురుశుక్రులుగాని చంద్రుడుగాని ఉన్న పథికుడింటికి వచ్చియుండును. లగ్నమునకు ద్వితీయమున గాని, తృతీయమునగాని గురు శుక్రులున్నను పథికుడింటికి వచ్చియుండును. అనగా త్వరలో వచ్చును. శుక్ర, బుధ, శనులలో ఒకడైన చరలగ్నమున ఉన్న పరదేశి శీఘ్రముగా వచ్చును. ఆ గ్రహము వక్రము కారాదు.
పథిక క్లేశయోగము
లగ్నము పృష్ఠోదయరాశి (మే, వృషకర్కధను) యై, శుభదృష్టిలేక, పాపగ్రహములచే చూడబడినా, కేంద్రముల పాపగ్రహములున్నా పథికునకు క్లేశము కలుగును.
పథికారిష్ట యోగము
ప్రశ్నలగ్నమునకు అష్టమమున రవిగాని, కుజుడుగానియున్న చోరభయము, సింహమున రవి, లగ్నమునుండి అష్టమమున చంద్రుడుగాని, కుజుడుగాని ఉండి, శనిచే చూడబడిన, లగ్నమునందు శుభగ్రహములు లేకున్న పథికునకు శస్త్ర భయము కలుగును. దశమమునగాని నవమమునగాని శుభగ్రహమున్న ప్రవాసి ధనపూర్ణుడై యుండును.
వివాహ ప్రశ్న
ప్రశ్నలగ్నమునకు 3, 6, 11, 7, 5 లందు చంద్రుడుండి, రవి, బుధ, గురువుచే చూడబడినా లేక, లగ్నమునకు కేంద్ర త్రికోణములందు గురు, బుధ, శుక్ర, చంద్రులున్నా; లగ్నసప్తమాధిపతులు సప్తమ, లగ్నగతులైనా వివాహము త్వరలో జరుగును.
స్త్రీ మృత్యు యోగము
ప్రశ్నలగ్నమునకు 4, 7 లందు పాపగ్రహములుండి, శుక్రుడు నిర్బలుడై, సప్తమమున రాహువున్న ఈ మూడు యోగములందును స్త్రీ చనిపోవును.
యోగాంతరము
సప్తమము పాపగ్రహయుక్తమై, చతుర్థము శుభగ్రహయుక్తమైన ప్రథమభార్య చనిపోవును. రెండవది బ్రతుకును. రెండును పాపయుక్తములైన ఇద్దరును చనిపోవుదురు.
ఆ గర్బ ప్రశ్న
ప్రశ్నలగ్నమునకు పంచమమున శుభగ్రహమున్నా, తదధిపతితో కూడినా, చూడబడినా, మాసాధిపతి బలవంతుడైన, గర్భము కుశలముగానుండును. (పంచమము పాపయుక్తమై . తదధిపతి యుక్తముకాని దృష్టముకాని కాకున్న మాసాధిపతి దుర్బలుడైనా గర్భము కుశలముకాదు.)
సంతాన ప్రశ్న
పంచమ, లగ్నాధిపతులు పుం రాశులలో ఉన్న ( ఓజరాశులు పురుషురాశులు, పురుషుడును, స్త్రీ రాశులలో ఉన్న కన్యయు కలుగును. విషమరాశి విషమనవాంశయందు శనియున్న పుత్రకారకుడగును. ఆ శని సమరాశి సనునవాంశలో ఉన్న కన్యాప్రదుడు. విషమరాశి యుందున్న రవిచంద్రగురులు పుత్ర ప్రదులు. పంచమ రాశికి కుజ, శుక్ర, చంద్రులదృష్టియున్న పుత్రుడు కలుగును.
యోగాంతరము
బలవంతులైన శుక్రచంద్రులు ప్రశ్నలగ్నమునకు పంచమమును చూచిన, పుత్రుని, అక్కడ ఉన్న కన్యను ఇత్తురు. వారు నీచ, శత్రురాశులందుగాని, 6, 8, 12 లందుగాని ఉన్న , నీచగత్తులైనా సంతానమునకు బాధకలుగును. వారు బలవంతులై లాభమున ఉన్న పుత్రలాభమును చెప్పవలెను.
పుత్ర యోగము
పంచమాధిపతి లగ్నమున, లగ్నాధిపతి పంచమమున, బలవంతుడైన చంద్రునితో కూడియున్న పుత్రోత్పత్తి నిస్సంశయముగా కలుగును. లగ్నపంచమాధిపతులు ఉచ్చస్థులై పరస్పరదృష్టి కలవారైయున్న పుత్రుడు పుట్టును.
యోగాంతరము
పంచమాధిపతి అస్తంగతుడైనా, నీచపడినా, పాపులచే పీడింపబడినా, ప్రశ్నకర్త అపుత్రకుడగును. ఒకవేళ బిడ్డకల్గినా, క్షణములో చనిపోవును. పంచమాధిపతి రాహువుచే కాని, కుజునిచే కాని కూడిన సంతానముండదని పూర్వమునులు చెప్పిరి.
రోగి ప్రశ్న
1. ప్రశ్న లగ్నము పాపగ్రహరాశియైనా, 2. అష్టమము పాపగ్రహయుక్తముకాని, దృష్టముకానియైనా, 3.పాపద్వయ మధ్యవర్తియైన చంద్రుడు పాపునితో కూడి అష్టమమందున్నా, 4.అష్టమమునగాని, ద్వాదశమునగాని పాపగ్రహమున్నా, 5. చంద్రుడు ప్రశ్నలగ్నము నుండి 1, 6, 7, 8 అందున్నా, 6. చంద్రుడు లగ్నమందు రవి సప్తమమందుఉన్న , 7. మేషమందున్న కుజుడు వృశ్చిక నవాంశగతుడై చంద్రునితో పాటు ఉన్న ఈ యోగములందు రోగికి మృత్యువు శీఘ్రముగా వచ్చును.
రోగి యొక్క కళ్యాణ యోగము
1. ప్రశ్నలగ్నమునకు సప్తమము శుభగ్రహయుక్తమై, 2. లగ్నాధిపతి ఉదితుడై, అష్టమాధిపతి బలహీనుడై, లాభాధిపతి ప్రబలుడైన రోగికి క్షేమము కలుగును. లగ్నమునకు సప్తమమున శుభ, పాపగ్రహములు మిశ్రమముగానున్న మిశ్రఫలమును చెప్పవలెను.
ప్రశ్నలగ్నమునుబట్టి తెలియవలెను. అదేవిధముగా అన్నియు తెలియవీలగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 97
గ్రహ శాన్త్యధ్యాయము
గ్రహముల దోషశాంతికై పూజా, జప, హెూమాది విధానము:
సూర్యాది నవగ్రహములచే ప్రపంచమంతయు ప్రభావితమైనది. ప్రాణులసుఖదుఃఖములు తదధీనములు. కాని మనుష్యలు ధన, వృష్టి ఆయురాదికము కోరి గ్రహశాంతికై గ్రహయజ్ఞము (పూజ, జపము, హెూమము) చేయవలెను.
పూజార్థ గ్రహప్రతిమ
సూర్యాది నవగ్రహ ప్రతిమలను తామ్రాది ధాతువులతో చేయించి, మంత్ర పూర్వకముగా తత్తద్గ్రహెూక్త దిశలలో స్థాపించవలెను. ఆయా గ్రహవర్ణములలో పట్టుబట్టలపై మూర్తులు లిఖించవలెను. రవిప్రతిమ రాగితోను, చంద్రునిది స్పటికముతోను, కుజునిది రక్తచందనముతోను, బుధగురులది స్వర్ణముతోను, శుక్రునిది వెండితోను, శనిది లోహముతోను రాహువుది. సీసముతోను, కేతువుది కంచుతోను చేయించవలెను.
గ్రహముల స్వరూపములు
1. సూర్యభగవానుడు పద్మము ఆసనము, చేతిలో పద్మము, పద్మమువంటి దేహకాంతి, సప్తఅశ్వములున్న రథము నెక్కినవాడు, రెండుభుజములు కలవాడు. 2. చంద్రుడు దశాశ్వములున్న రథము కలవాడు, తెల్లనివాడు, తెల్లని వస్త్రము, గద తెల్లని అలంకారములు కలవాడు. ద్విభుజుడును. 3.కుజుడు ఎర్రని పూలమాల, ఎర్రని వస్త్రము, చేతిలో శూలము శక్తికలిగి, నాలు భుజములు, గదాధరుడు, వరదుడు. అజవాహనుడు, 4. బుధుడు పసుపుపచ్చనిమాల, పీతవస్త్రము, తాళపత్రము వంటి రంగు, సింహారూఢుడు, గద, కవచము, కత్తి చేతులలో కలవాడు వరదుడు, 5, 6. గురుశుక్రులు తెల్లని పచ్చని కాంతి, చేతిలో రుద్రాక్షమాలలు, దండములు, కమండలములు కలిగి, వరదులైనవారు. 7. నీలకాంతి, గ్రద్దవాహనము, ధనుర్బాణధరుడు, చతుర్బాహుడు, శూలధారి, వరదుడు శనైశ్చరుడు. 8. రాహువు భయంకరమైన ముఖము, కవచము, త్రిశూలము, కత్తిని ధరించినవాడు, అశుభుడు, సింహవాహనము, నల్లని కాంతి, కల్గిన పరదుడు. 9.కేతుగణము గద, ధూమ్రవర్ణము, రెండు భుజములు కలిగి, గృధ్రవాహనులు, వరదులు. ఇవి గ్రహస్వరూపములుగా పెద్దలు చెప్పుదురు.
గ్రహమూర్తి విధానము
గ్రహములయొక్క రంగు నా, సరించి వస్త్రములు, పువ్వులు, ధూపదీపములు, సుగంధ ద్రవ్యములు ఉంచవలెను. ఆయా గ్రహమునకు చెప్పబడిన ద్రవ్యమును అన్నపానాదికమును నైవేద్యము పెట్టి, యథావిధిగా భక్తితో బలి (అన్నపు ముద్దలు) నివేదించవలెను.
జప సంఖ్య –
శ్లో || సూర్యానాం నభోగానాం మంత్రైర్విప్రేంద ! వైదికైః |పౌరాణికై ర్వా విధివత్ మౌనం తు జపమాచరేత్ | | రవేర్నగా స్తద్వదిందో రుద్రా దశ కుజస్యవై |బుధస్య నందా వచసాం పతే రేకోనవింశతిః || భృగోస్తుషోడశ తథా అధికావింశతిః శనేః | హోరష్టేందవఃకేతోర్నగేందవ ఇమాః పునః || సహస్రగుణితా లబ్దసంఖ్యకం జపమాచరేత్ |జపానుష్టానతః భేటాః ప్రీతాశ్శుభ ఫలప్రదాః ||
సూర్యాది నవగ్రహములకు విహితమైన వేదిక మంత్రములతో గాని, పౌరాణిక మంత్రములతో గాని మౌనముగా జపము చేయవలెను. జపసంఖ్య రవికి 7000, చంద్ర 11,000, కుజునికి 10,000; బుధునికి 7, 000; గురునికి 19,000; శుక్రునికి 16,000, శనికి 23,000; రాహువునకు 18,000;కేతువునకు 17,000 జపము చేసినందున, ప్రీతి పొందిన గ్రహములు శుభఫలము నిచ్చును.
గ్రహముల పూజాక్రమములు –
శ్లో || సూర్యస్యార్కః పలాశశ్చ విధోర్భూనందనస్య తు | ఖదిరోఽథ బుధ స్యైవ మపామార్గ ఉదీరితః || పిప్పలో హి గురోర్జంతు ఫలః శుక్రస్య సమ్మతః |శనేశ్శమీత్వ హేర్దూర్వా కుశాఃకేతోస్సమిత్ స్మృతా || ససర్పిర్మధునా దధ్నా జుహుయాత్పాయసోఽపి వా | అష్టోత్తర శతం వాపి మనుయుస్ప్రమితం బుధః ||
రవికి జిల్లేడు, చంద్రునికి మోదుగ, కుజునికి చండ్ర, బుధునికి ఉత్తరేణి, గురునికి రావి, శుక్రునికి మేడి, శనికి జమ్మి, రాహువునకు దూర్వ, కేతువునకు దర్భసమిధలు, తేనె, నెయ్యి, పెరుగు, పాలతోగాని అష్టోత్తరశతము (108 సార్లు) గాని, 28 సార్లుగాని ఒక్కొక్కరికి హెూమము చేయవలెను.
శ్లో || ప్రీతయే తు నభోగానా మోదనం గుడమిశ్రితం | పాయసం చ హవిష్యాన్నం క్షీరషాష్టికమేవ వా || భక్తం సదధిసాజ్యం చ సుచూర్ణం సామిషం తథా |చిత్రాన్నమితి విప్రేభ్యోఽశనందేయం ససత్కృతి |
గ్రహప్రీతికై బెల్లము కలపిన అన్నము, పరమాన్నము, హవిష్యాన్నము పాలఅన్నము, దధ్యోదనము, నెయ్యి కలిపిన అన్నము, నువ్వుపిండి కలిపిన అన్నము, మాంసాన్నము (ఇది మాంసభుక్కుల విషయము), చిత్రాన్నము ఇవి నైవేద్యము పెట్టి, బ్రాహ్మణులకు సత్కార పూర్వకముగా భోజనము పెట్టవలెను.
దక్షిణ
శ్లో || ధేనుకంబువృషస్వర్ణ వస్త్రా శ్వాసిత ధేనవః |లౌహచ్ఛాగౌచ గదితా గ్రహాణాం దక్షిణాః క్రమాత్ |
ఆవు, శంఖము, వృషభము, బంగారము, వస్త్రము, అశ్వము, కపిలగోవు, లోహము, మేక వీటిని దక్షిణగా ఇయ్యవలెను.
శ్లో || దుష్టస్థాపస్థితం ఖేటం జప హెూమాదిపూజనేః | విప్రాణాం భోజనైర్దానైర్యత్నతః శాంతయేద్బుధః || గ్రహేఽనుకూలే మనుజాః సుఖినోభ్యున్నతాస్సదా | ప్రతికూలే దుఃఖభాజస్తస్మాత్తాన్ పరిపూజయేత్ |
దుష్టస్థానమున ఉన్న గ్రహమును జప హోమాది పూజల చేతను, విప్రులకు బోజనములు, దానముల చేతను శాంతింప చేయవలెను. గ్రహము అనుకూలమైన మనుజులు సుఖపంతులు. అభ్యుదయము కలవారగుదురు. ప్రతికూలమైన దుఃఖమును పొందుదురు. కావున వాటిని బాగుగా పూజించవలెను.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 98
అశుభ జనుర్వర్ణనాధ్యాయము
శుభలగ్నము, శుభగ్రహములు ఉన్న మనుష్యుల కెందుకు అశుభము కలుగు చున్నది? దానికి కారణమేదో మరొకటి ఉండి ఉండవలెను. అది చెప్పబడుచున్నది. భద్రాకరణము, అమావాస్య, కృష్ణపక్ష చతుర్దశి, సూర్యసంక్రమణము, తండ్రి అన్నల నక్షత్రము. త్రివిధ గండాంతములు, యమఘంట, వ్యతీపాతాది దుష్టయోగములందు జన్మమైనా ముగ్గురు పుత్రుల తర్వాత పుత్రికగాని, ముగ్గురు పుత్రికల తర్వాత పుత్రుడుగాని పుట్టినా, పురుడువికారముగా వచ్చినా ( ఎదురు కాళ్ళని పుట్టుట, ప్రేగు మెడలో వేసుకొని పుట్టుట వంటివి) వీటన్నిటికి జాతకుని జన్మ అశుభకారకము. కావున కల్యాణ ప్రాప్తికై
శాస్త్ర సమ్మతమైన శాంతి చేయవలెను. శాంతిద్వారా శుభముకలుగును. కావున క్రమముగా శాంతిని చెప్పబడుచున్నది.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 99
అమాజన్మ శాన్త్యధ్యాయము
అమావాస్య జననము తల్లిదండ్రులకు దారిద్ర్యము నిచ్చును. దోషము శమించుటకై ప్రయత్నముతో శాంతిని చేయవలెను. నీటితో నిండిన కలశమును స్థాపించి దానిలో జువ్వి, రావి, మర్రి, మామిడి, వేప-వీటియుక్క బెరడు, వేరు, చిగుళ్ళు; పంచరత్నములు దానిలో వేసి, ఎర్రగుడ్డతో చుట్టి, దానిని 'ఆపోహిష్ఠా' 'సర్వేసముద్ర' అను మూడు మంత్రములతోను అభిమంత్రించవలెను. సూర్యచంద్రుల యొక్క, ధర్మదేవతయొక్క రాశిప్రతిమకాని, వెండి ప్రతిమకాని పెట్టి యథావిధిగా పూజించవలెను. పంచోపచారములు షట్ ఉపచారములు. దశోపచారములు, లేక, షోడశోపచారములతో పూజ చేయవలెను. సవితృమంత్రముతోను. 'సోమోధేను'అను మురత్రమును 108సార్లుగాని. 28సార్లుగాని హెూమము చేయవలెను. పీటలపై శిశువుతోకూడ దంపతులు కూర్చుండవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వెండి, బంగారము, ఆవులను దక్షిణగా ఇవ్వవలెను. ఇట్లు చేసిన అమావాస్యనాడు జనించిన శిశువు తప్పక క్షేనుము పొందును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 100
కృష్ణచతుర్దశీ జననశాన్త్యధ్యాయము
కృష్ణపక్ష చతుర్దశినాడు జన్మకలిగిన అశుభము. చతుర్దశీ ప్రమాణమును ఆరుచే భాగించిన, ప్రథమభాగము మంచిది, రెండవ భాగమున తండ్రి మరణము, మూడవ భాగమున తల్లి మరణము, నాల్గవ భాగమున మేనమామ గండము, అయిదవ భాగమున వంశనాశము, ఆరపభాగమున ధననాశము, లేదా, ఆత్మ నాశము (శిశుగండము). కావున శాంతి చేయవలెను.
యధాశక్తిగా స్వర్ణమయమైన శివమూర్తిని (ప్రతిమను) చేయించవలెను. అది శుభ్రమైన వస్త్రము కలిగినది, వృషభము నెక్కినది, సుదరమైనది, మొగముపై బాలేందురేఖ, మూడు కన్నులు కలది, వర అభయముద్రలతో, రెండు చేతులుకల దానిని పూజించవలెను.
వారుణమంత్రములతో, 'త్ర్యంబకం' అను మంత్రముతో ఆవాహనచేసి, పూజచేసి, మంత్రములతో, ఆగ్నేయకోణమున ఉన్న కుంభము మొదలు అన్నిటికి పూజలు చేసి, పురుష, శ్రీసూక్తములు పఠించి, 'కద్రుదాయ' అను మంత్రజపము చేసి, రుద్రాభిషేకము చేయవలెను. భక్తిపూర్వకముగా గ్రహపూజచేసి, సమిధలు, నెయ్యి, చరువు, తిలలు, మినుములు, ఆవాలు వీటిని 'హోమము చేయవలెను. 108సార్లుగాని, 28సార్లుగాని 'త్ర్యంబకం ' అను మంత్రముతో తిల హెూమము చేయవలెను. గ్రహములకున్ను, వ్యాహృతులతో హేమముచేసి. ఆ కలశములోని నీటితో దంపతులకు పిల్లవానికి మార్జన చేయవలెను. భక్తితో బ్రాహ్మణులకు భోజనము పెట్టి, చేసినదానికి క్రియాంతమున దక్షిణను యథాశక్తిగా ఇయ్యవలెను. అట్లు చేసిన క్షేమము కలుగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 101
భద్రావమాది దుష్టయోగశమనాధ్యాయము
భద్ర, క్షయతిథి, వ్యతీపాత, యమఘంట, మున్నగు దుర్యోగములందు జన్మ అశుభప్రదము; దానికి శాంతి విధానము శాంతి చేసినందున నరునికి శుభము కలుగును. దుర్యోగము మరల కలిగినప్పుడు శాంతి చేయవలెను. అనగా భద్రాశాంతిని మరల భద్ర వచ్చినపుడు చేయవలెను. దైవజ్ఞులు చెప్పిన శుభముహూర్తమున, మంచి లగ్నమున దేవపూజ, గ్రహయజ్ఞము, రుద్రాభి షేకము, శివాలయమున ధూపదీపములు, అశ్వత్థ ప్రదక్షిణ నమస్కారములు, ఆయుర్వృద్ధికరములు. హరిమంత్రముచే అష్టోత్తరశత హోమము చేయవలెను. ఇట్లు చేసిన పుట్టిన శిశువు తప్పక మంచిని పొందును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 102
ఏకనక్షత్రోత్థ జాతక శాన్త్యధ్యాయము
తల్లిదండ్రులయొక్క సోదరునియొక్క నక్షత్రమున జన్మమైన, అందులో ఎవరో, ఒకరో, ఇద్దరూగాని మృతి చెందుదురు. కావున దాని శాంతి ప్రాచీన మహర్షులచే చెప్పబడినది మంచి తిథి శుభనక్షత్రమున రిక్త, అమావాస్య, అవమాదులు లేని రోజున తారాచంద్ర బలయుక్తమైన దినమున శాంతి చేయవలెను. నక్షత్రప్రతిమను చేయించి, అగ్నికి ఈశాన్య దిక్కును ఉంచవలెను. నక్షత్రమంత్రములచే పూజించి, రక్తవస్త్రముతో కప్పి, వస్త్రద్వయము చుట్టవలెను. స్వస్వశాఖోక్త ప్రకారము అగ్ని ముఖముచేసి నక్షత్ర మంత్రముతో 108 సార్లు నెయ్యి, తిలలు, అన్నీ కలిపి, నేతితో ప్రాయశ్చిత్తాంత హోమములు చేయవలెను. తరువాత ఆచార్యుడు కలశోదకముతో తల్లిదండ్రులను, సోదరులను, శిశువును మార్జన చేయవలెను. యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణలు ఇయ్యవలెను. ఇట్లు చేసిన నక్షత్రదోషశాంతియై శిశువు సోదరులు, తల్లిదండ్రులు, సుఖముగా నుందురు.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 103
సంక్రాంతి జనన దోష శాంత్యధ్యాయము
సూర్య సంక్రాంతి సూర్యాది వాసరములందు ఘోర, ధ్వాంక్షి, మహోదరి, నంద, మందాకిని, మిశ్ర, రాక్షసి అని ఏడు విధములు. ఆ సంక్రాంతులలో పుట్టినవాడు దుఃఖ దారిద్ర్య యుక్తుడగును. శాంతివలన శుభము కలుగును. కావున శాంతిని చెప్పబడుచున్నది. ఆ దోష శమనమునకై గ్రహయజ్ఞము (పూజ, హోమములు) చేయవలెను.
శాంతి విధానము
గృహమున తూర్పున పరిశుద్ధ ప్రదేశమున గోమయముతో అలికి, ముగ్గులు పెట్టి, అయిదు ద్రోణముల (20కిలోలు శేర్లు) ధాన్యమును, 10 శేర్లు బియ్యమును, 5 శేర్లు తిలలను వేర్వేరుగా రాశులుగా పోయవలెను. వస్త్రము క్రిందవేసి ధాన్యము పోసి, మరల వస్త్రమువేసి బియ్యముపోసి, మరల వస్త్రమువేసి తిలలు పోయవలెను. అట్లు పోసిన అవి కలిసిపోవు. వాటి పై అష్టదళపద్మమును గీయవలెను. పుణ్యాహవాచనము చేసి, ఆచార్యవరణము చేయవలెను. ఆ ధాన్యరాశులపై శుద్దోదకమున్న మూడుబిందెలు పెట్టవలెను. వాటిలో సప్తమృత్తికలు, శతౌషధులు, పంచగవ్యములు, పంచ పల్లవములు వేయవలెను. ఘటములను వస్త్రములతో చుట్టి, వాటిలో పత్రములుంచవలెను. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యచంద్రుల ప్రతిమలుంచవలెను. ఆప్రతిమలను పూజించవలెను. సంక్రాంతి ప్రతిమను ద్ద్వితీయవస్త్రంపై మధ్యలో సంక్రాంతి ప్రతిమను, అటునిటు సూర్యచంద్రులు ప్రతిమనుంచవలెను. ఉత్తరీయముచుట్టి, ఆ ప్రతిమలను త్ర్యంబక మంత్రముతో పూజించి ధూపదీపాదులు సమర్పించవలెను. 'ఉత్సూర్య' మంత్రముతో సూర్యునికి 'ఆప్యాయస్వ' మంత్రముతో చంద్రునికి పూజ చేయవలెను. షోడశోపచారములు చేయవలెను. సర్వవిధ విఘ్నోపశాంతికై మృత్యుంజయ జపము. అష్టోత్తర సహస్రము, అష్టోత్తరశతము, ఇరవై ఎనిమిది సార్లు జపము చేయవలెను
ఘటములకు పశ్చిమమున స్థండిలము కల్పించి, అగ్ని ప్రతిష్ఠాపన చేయవలెను. స్వగృహ్యోక్త విధానమున అగ్ని సంస్కారము చేసి, సమిధలు, నెయ్యి. చరువును త్ర్యంబకాది మంత్రములతో అష్టోత్తర సహస్రముకాని, అష్టోత్తర శతము కాని, ఆఖరికి 28 సార్లు కాని హోమము చేయవలెను. తిల హెూమము, స్విష్టకృత్ హోమముచేసి, ఘటోదకములతో శిశువునకు, తల్లిదండ్రులకును అభిషేకము (మార్జన) చేయవలెను. బ్రాహ్మణ భోజనము పెట్టి శాంతి చేయవలెను. ఇట్లు చేసిన జాతకునికి తప్పక శుభము, దీర్ఘాయువు కలుగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 104
గ్రహణజాతదోష శాన్త్యధ్యాయము
సూర్యచంద్రుల గ్రహణ సమయమున పుట్టినవానికి దుఃఖము, దారిద్ర్యము, రోగము కలుగును. కావున హితకాముడు వానికి శాంతి చేయవలెను. ఏ నక్షత్రమున గ్రహణమైనదో, ఆ నక్షత్రాధిపతి ప్రతిమను బంగారముతో చేయించి, సూర్యగ్రహణమున సూర్యునిది బంగారముతోను, చంద్రగ్రహణమున చంద్రునిది వెండితోను, రాహువుది సీసముతోను చేయించవలెను.
శాంతి విధానము
పరిశుద్ధ ప్రదేశమున సమముగా ఉన్న స్థలములో, గోమయముతో అలికి, రవి చంద్ర రాహువుల ప్రతిమలను అక్కడ ఉంచవలెను. సూర్యగ్రహణమున రవి ప్రీతికరమైన, రక్తాక్షితలు, రక్తచందనము, ఎర్రపూలమాల, ఎర్రని వస్త్రములు, సమర్పించవలెను. చంద్రగ్రహణమునచంద్ర ప్రీతికరమైన తెల్లని గంధము, తెల్లపువ్వులమాల, తెల్లని వస్త్రములు చంద్రునికిని, రాహువునకు నల్లని పువ్వులు, మాల, నల్లని గంధము, నల్లని వస్త్రములు సమర్పించవలెను. చంద్రునకు అన్నియు తెల్లనివే. 'ఆకృష్ణేన' అను మంత్రముతో రవిని, 'ఇమందేవా' అను మంత్రముతో చంద్రుని, 'కయానశ్చిత్ర' అను మంత్రముతో రాహువును పూజించవలెను. రవి, చంద్ర, రాహువులకు జిల్లేడు, మోదుగ, దూర్వా, సమిధులు. ఆయా గ్రహప్రీత్తికై, ఆయా సమిధలచే హెూమము చేయవలెను. తరువాత కలశోదకముతో బాలుని, దంపతులను మార్జన చేయవలెను. ఆచార్యునికి నమస్కరించి, బ్రాహ్మణులకు భోజనములు పెట్టి, కర్మాంతమున యధాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ నీయవలెను. ఇట్లు చేసిన శాంతితో గ్రహణజాతులకు దోషము శమించి, శుభము కల్గును. "
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 105
గండాంతోద్భవ శాన్త్యధ్యాయము
తిథి, లగ్న, నక్షత్రవశమున గండాంతము మూడు విధములు. దీని విషయము వివాహసుముహూర్తములకు, జననమునకు, ప్రయాణమునకు విచారింపవలెను.
గండాతరములు
పూర్ణా (5, 10, 15) నందా (1, 6, 11) తిథుల సంధులలో 4గడియలు తిథిగండాంతము. అనగా పూర్ణిమ చివర 2గడియలు, పాడ్యమి మొదలు 2గడియలు, పంచమీ షష్టి మధ్య, దశమ్యేకాదశులమధ్య, అమావాస్యా పాడ్యమిల మధ్య గండాంత గడియలు. అదేవిధముగా రేవతీ అశ్వినులమధ్య, అశ్లేషామఘలమధ్య, జ్యేష్ఠామూలల మధ్య 2గడియలు నక్షత్ర గండాంతము. మీనమేషములమధ్య. కర్కాటక సింహములమధ్య, వృశ్చిక ధనుస్సులమధ్య ఒక్కొక్క ఘడియలగ్నాంతము.
మూడు గండాంతములు జన్మయందు, యాత్రయందు మృతిప్రదములు. జ్యేష్ఠామూలల సంధిలో 5, 8 గడియలు (జ్యేష్ఠాంత్యమున 5, మూలాదిలో 8) మహా విఘ్నప్రదములు, అభుక్తమూల అని పేరు. కావున గండాంత త్రయమున అభుక్తమూలలో పుట్టిన జాతకునికి శాంతి తప్పక చేయవలెను.
శాంతి విధానము
త్రివిధ గండాంతమున పుట్టిన శిశువునకు దోషశాంతి సూతకాంతమునగాని, మరొక శుభదినమునగాని చేయవలెను. శాంతి చేయునంతవరకు తండ్రి బాలుని చూడకూడదు. తిథి, నక్షత్ర, లగ్నగండాంతములకు క్రమముగా వృషభ, ధేను, సువర్ణములను దానమియ్యవలెను. గండాంత ప్రథమ భాగమున పుట్టిన శిశువుతో పాటు తండ్రికూడ స్నానము చేయవలెను. ద్వితీయ భాగము పుట్టిన శిశువునకు తల్లికి ఒకేసారి స్నానము చేయించవలెను.
తిధినక్షత్ర లగ్నాధీశుల ప్రతిమలను బంగారముతో చేయించి, జలఘటము పైన పెట్టిన పాత్రలో ఉంచి, పూర్వము చెప్పినట్లే ఆరు, పది, పంచ, ఉపచారములతో పూజించవలెను. తరువాత సమిధలు, ఆజ్యముతో యధావిధిగా హెూమము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. దోషశాంతి అగును. ఆరోగ్య, ఆయుర్వైభవములు ప్రతిదినము వృద్ధి పొందును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 106
మూలగండ శాన్త్యధ్యాయము
అభుక్తముల ఘటికలను పూర్వము చెప్పితిగదా. ఆ గడియలలో పుట్టిన పుత్రునిగాని, కన్యనుగాని తండ్రి విడిచి వేయవలెను. లేదా ఎనిమిదేళ్ళ వరకు వాని ముఖము చూడరాదు. ఆ గడియలు మహావిఘ్న ప్రదములు కనుక శాంతి ఇక్కడ చెప్పబడుచున్నది.
శుభదినమున, పుట్టిన పండ్రెండవరోజునగాని, ఎనిమిదవ సంపత్సరాంతమునగాని, మూలానక్షత్రమున పుట్టినవారికి యథావిధిగా శాంతి చేయవలెను.
శాంతి విధి
తన గృహము ఉత్తరమునగాని, తూర్పునగాని, శుభ్రమైన ప్రదేశమున, గోమయముతో అలికి మండపము కట్టవలెను. నాలుగు ద్వారములు, అంతట తోరణములు కట్టవలెను; బహిర్ద్వారమున హెూమమునకై కుండమునేర్పాటు చేయవలెను. విత్తానుసారముగా నక్షత్రాధిపతి ప్రతిమను నల్లని రంగు, రెండు తలలు, తోడేలు ముఖము, డాలు కత్తికలిగి, శవవాహనము పై భయంకరముగానున్నట్లు చేయించి, యథావిధిగా పూజించవలెను. స్వస్తి పుణ్యాహవాచనముచేసి, ఆచార్యవరణముచేసి, కలశమున తీర్థోదకము, పంచగవ్యము, శతౌషధులు వేయవలెను. మరొక కలశమును శతచ్ఛిద్రమయమును(నూరుచిల్లు లుండునట్లు) చేసియుంచవలెను. దానికి ముందు వంశపాత్రను(దానిలో పప్పులు పోయవలెను) స్థాపించవలెను. నక్షత్రాధిపతియైన నైరృతిని సాదరముగా పశ్చిమముగా తిరిగి కూర్చుండి పూజించవలెను. తెల్లని వస్త్రము కప్పి తెల్లని గంధము, పువ్వులు, అక్షతలతో పూజించవలెను. అతని కధిదేవతగా ఇంద్రుని ప్రత్యధిదేవతగా వరుణుని స్వశాఖోక్త మంత్రములతో పూజించవలెను. ఇట్లు దేవత్రయమునకు అష్టోత్తర సహస్రముగాని, అష్టోత్తరశతముగాని హెూమము చేసి, మృత్యుశాంతికై మృత్యుంజయ జపము, పూజ, ఆరాధన నియమముతో భక్తిగా చేయవలెను.
తరువాత ఆచార్యుడు రెండు కలశములలోని నీటితోను దంపతులను, శిశువును అభిషేకము (మార్జన) చేయించవలెను. తర్వాత యజమానుడు ఆ నీటితో స్నానమాచరింప వలెను. స్నానము చేసి, తెల్లని వస్త్రములు కట్టుకొని, తెల్లని గంధము రాసికొని, ఋత్విక్కులకు, విశేషముగా ఆచార్యునికి దక్షిణ నియ్యవలెను. ఆచార్యునకు పాలనిచ్చు గోవును దానము చేసి, బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలెను. “దౌర్బల్యం..అఖిలం...దేహిమే" అను శ్లోకముతో
యజనూనుడు తన నీడను ఆజ్యమున చూడవలెను. ఈరీతిగా శాంతి చేయుటచే మూలగండమున పుట్టిన వారికి దోషము పోయి శుభము కలుగును
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 107
జ్యేష్ఠాది గండాంత శాంత్యాధ్యాయము
శిశువునకు తల్లిదండ్రులకు గండమైన జ్యేష్ఠా నక్షత్ర జాతులకు విఘ్నోపశమనమునకై శాంతిని మూలానక్షత్ర శాంతివలెనే చేయవలెను. ప్రధానదేవుడు ఇంద్రుడు, అధిదేవతా ప్రత్యధిదేవతలు అగ్ని, రాక్షసులు. కావున ముగ్గురిని పూజించవలెను. వజ్ర, అంకుశములతో కూడిన గజారూఢుడైన దివ్యవస్త్ర విభూషితుడైన ఇంద్రప్రతిమను సువర్ణముతో చేయించవలెను. కలశముపైఉన్న పాత్రలో ఆ ప్రతిమను స్థాపించి, గృహ్యోక్త మంత్రములతో గంధాక్షితలతో పూజించి, అభిషేకము, హెూమముచేసి, సూక్తపాఠము చదివి, మహామృత్యుంజయ జపము చేయించి, బ్రాహ్మణులకు భోజనములు పెట్టిన శుభము కలుగును.
శక్తి లేనప్పుడు ఆశ్రేషా, మూల, మఘ, జ్యేష్ఠల శాంతిలో మూడావులను, రేవత్యశ్వినుల శాంతిలో రెండావులను తక్కిన దుర్యోగములలో ఒక్క గోవును, లేనిచో దాని ఖరీదునైనా దానము చేయవలెను.
జ్యేష్ఠానక్షత్రమున పుట్టిన కన్య భర్త అన్నకు, విశాఖాంత్య పాదమున పుట్టిన కన్య మరదికి గండము కల్గించును. కావున వివాహ సమయమున శాంతికై గోదానము చేయవలెను. జ్యేష్ఠానక్షత్రమున చివర మూడు పాదములు అయిన, కన్య అత్తగారిని, పుత్రుడు మామను చంపును. కావున శాంతికై వివాహసమయమున వారికి గోదానము చేయవలెను.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 108
త్ర్యన్యజననదోషశాన్త్యధ్యాయము
త్ర్యన్య జన్మదోషశాంతిని చెప్పబడుచున్నది. ముగ్గురు కొడుకుల తర్వాత కూతురుగాని, ముగ్గురుకూతుళ్ళ తర్వాత కొడుకుగాని పుట్టిన కులద్వయ మున (తల్లికి తండ్రికి) అరిష్టము కలుగును. కావున దీని శాంతికై గ్రహములను, బ్రహ్మ, విష్ణు, రుద్రలును యథోక్త విధానమున పూజించి శాంతి చేయవలెను.
జాతసూతక శుద్ధి కాగానేగాని, శుభదినమునగాని గ్రహయజ్ఞము చేయవలెను. ఋత్విగ్వరణము, ఆచార్యవరణము చేసి, బ్రహ్మ, విష్ణు, రుద్రుల, ఇంద్రుని ప్రతిమలు బంగారముతో చేయించి, కలశాగ్రమున ఉన్న పాత్రలందు స్థాపించి, పూర్వము వలెనే, గంధపుష్పాక్షతలు, ధూపదీప నైవేద్యోదకములతో పూజించవలెను.
తరువాత ఒక పవిత్ర బ్రాహ్మణుడు శాంతిసూక్తములను, రుద్రసూక్తములను జపించవలెను. ఆచార్యుడు సమిధలు, తిలలు, నేతితో హెూమమును అష్టాధిక సహస్రముగాని, అష్టోత్తరశతముగాని చేయవలెను. స్వగృహ్యోక్త మంత్రములతో, తత్తద్దేవతలను అనుగ్రహింప జేసికోగల్గిన మంత్రములతో పూజను, బలినిఇచ్చి, స్విష్టకృద్ధోమము చేసి, పూర్ణాహుతి చేసిన తర్వాత, ఆచార్యుడు ఘటోదకములతో దంపతులను బాలుని మార్జన చేయవలెను. బ్రాహ్మణ భోజనము పెట్టి ఋత్విక్కులకు దక్షిణ నియ్యవలెను. యజమాను డాచార్యుని విశేషముగా స్వర్ణగోధనములచే పూజించవలెను. ఇట్లు చేసిన శాంతిచే అరిష్టము శాంతించును. శుభము కలుగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 110
గ్రంథోపసంహారాధ్యాయము
మైత్రేయమహర్షికి పరాశరమహర్షిచే చెప్పిన ఈశాస్త్రమంతయు పరాశరమహర్షిచే పారంపర్యక్రమమున పొందబడినది. పూర్వము ప్రజాపతి నారదమహర్షికి, అతడు శౌనకాదులకు చెప్పెను. వారివద్దనుండి పరాశరమహర్షి భ్యసించెను. ఇది దుర్జనునికి, వినయము లేనివానికి, కృతఘ్నునకు, మందునకు, ద్వేషించువానికి, నిందించువానికిని ఎప్పుడు ఇయ్యరాదు. వినయము కలిగి, కులశీలములు తెలిసిన, సేవించువానికి బుద్ధిమంతునకు ఈ ఉత్తమమైన శాస్త్రము నీయవలెను.
కాలజ్ఞానపరుడు, గ్రహముల నక్షత్రములస్థితి నెరిగినవాడు, గణితస్కంధ నిపుణుడు, శబ్దశాస్త్ర (వ్యాకరణ) నిపుణుడు ఈ హోరాశాస్త్రమును చదువుట కర్హుడు. అట్టివాడు చెప్పిన శుభాశుభఫలము ఎప్పుడును అసత్యము కాదు.
గ్రంథోప సంహారాధ్యాయము
ఈ గ్రంథమున వివిధ విషయముల వర్ణన చేయబడినవి. దీనిలోని అధ్యాయములలోని సృష్టిక్రమము, అవతారక్రమము, గ్రహస్వరూపము, గ్రహాదిసాధనము, రాశిశీలము, షోడశవర్గ వర్ణనము, వర్గవివేచనము, దృష్టిభేద వర్ణనము, సూతికాధ్యాయము, అరిష్టాధ్యాయము, అరిష్టభంగము, భావవిచేనము, భావఫలము, భావాధీశఫలము, ధూమాది అప్రకాశ గ్రహఫలము, గ్రహస్పష్టదృష్టి స్పష్టబలసాధనము, ఇష్టకష్ట వివేకము, ఆరూఢము పదము, ఉపపదము, అర్గలా ఫలము, కారకము, కారకాంశఫలము, యోగములు, నాభసయోగములు, వివిధయోగములు, చంద్ర-సూర్య-రాజయోగములు, రాజాశ్రయయోగములు, ధనయోగము, దారిద్ర్యయోగము, ఆయుర్విచారము, మారకభేదము, గ్రహావస్థాఫలము, దశాభేదములు, దశాఫలము, భావేశ దశాఫలము, కాలచక్రదశ, చరాదిరాశి దశాఫలము, అంతర్దశాఫలము, అష్టకవర్గు, త్రికోణశోధనము, ఏకాధిపత్య శోధనము, పిండసాధనము, అష్టకవర్గఫలము, అష్టకవర్గోక్త ఆయువు, సముదాయాష్టక వర్గోద్భవ ఫలము, గ్రహరశ్మిఫలము, సుదర్శనఫలము, పంచ మహాభూతఫలము, సత్వాది గుణత్రయము, అజ్ఞాత జన్మసమయ వ్యక్తులకు జన్మాంగాదిభోధ, ప్రవ్రజ్యాయోగము, స్త్రీజాతకము, స్త్రీ అంగ లక్షణములు, పుత్రక్షయకారణములు, అనిష్టకారకతిధ్యాది శాంతి ఇవన్నియు ఉన్నవి. ఈ ప్రకారమీ హోరాశాస్త్రము శతాధిక విషయ విశిష్టమై యున్నది.
శ్లో|| పరాశరోదితం శాస్త్రమేతదాదరపూర్వకం| యే పఠన్త్యపి శృణ్వన్తి తేషామాయుర్యశోబలం ||
సమృద్ధిశ్చాపి వివిధ వర్థతే హి దినే దినే | తస్మాచ్ఛాస్త్రమదో విజ్ఞై రధేతవ్యం సదా ముదా||
పరాశరునిచే చెప్పబడిన శాస్త్రమును ఎవరు ఆదరముతో విందురో, పఠింతురో వారికి ఆయువు, కీర్తి, బలము, వివిధమైన సమృద్ధి దినదినమున వృద్ధి పొందును. కావున ఈశాస్త్రము విజ్ఞులెప్పుడును సంతోషముగా చదువవలెను.
పరాశరహోరాశాస్త్రము సర్వము సంపూర్ణము.
Comments
Post a Comment